ఎన్నికల సమయంలో విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం వేడెక్కింది. సరిగ్గా ఈ సమయంలో వాతావరణాన్ని కాస్త కూల్ చేసేందుకు అన్నట్టు కొందరు నేతలు కామెడీని పండిస్తున్నారు. కేఏ పాల్, నాగేంద్రబాబు, సోము వీర్రాజు, బండ్ల గణేష్, లోకేశ్, అప్పుడప్పుడు పవన్‌కల్యాణ్ తదితర నేతల కామెంట్స్ భలే సరదాగా వుంటున్నాయి.
తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సీరియస్‌గా కామెడీ చేశారు. సోము వీర్రాజు ఏ విషయాన్నైనా చాలా గంభీరంగా చెబుతుంటారు. సీరియస్‌గా మాట్లాడుతున్నట్టు తాను అనుకోవడమే తప్ప, విషయం మాత్రం నవ్వు తెప్పిస్తుంటుంది. ఇవాళ ఆయన ఏమన్నారంటే…జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టే హక్కు కేసీఆర్‌కు లేనేలేదని వీర్రాజు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇలా చెబుతుంటే చూసే వాళ్లకు నవ్వు రాకుండా వుంటుందా?
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు. ప్రజలు ఆదరిస్తే మనుగడ సాగిస్తారు. లేదంటే ఇంట్లో మూలన కూచుంటారు. ఇందులో చర్చించడానికి ఏమీ లేదు. అదేంటో గానీ, మన వీర్రాజు గారు మాత్రం అసలు కేసీఆర్‌కు పార్టీ పెట్టే హక్కే లేదని వాదిస్తున్నారు. అంతటితో ఆయన ఊరుకోలేదు.
ఒకవేళ పార్టీ పెట్టాడే అనుకుందాం. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రులను ద్రోహులుగా అభివర్ణించిన కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే అర్హత సైతం లేదని తేల్చి చెప్పారు. కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్నారని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ …వీఆర్ఎస్ తీసుకోవాల్సి వుంటుందని ఆయన సెటైర్ కూడా వేశారండోయ్.
కేసీఆర్‌కు జాతీయ పార్టీ పెట్టే హక్కు లేదనడం, ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టే అర్హత లేదనడం… ఇలా సోము వీర్రాజు కామెడీ పిచ్చ కామెడీ చేశారు. అయ్యా ఎవరేం మాట్లాడినా, అంతిమంగా భరతం పట్టాల్సింది ప్రజలే అని గుర్తిస్తే, ఇలా ఒకరి హక్కుల గురించి మాట్లాడరు. అంతా తామే వుండాలనే పగటి కలలు మానితే… కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చారనే సామెత చందాన ప్రజలు అందరి లెక్కల్ని సరిదిద్దుతారు.