కోమటిరెడ్డి బ్రదర్స్‌పై తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి విరుచుకుపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌తో మొదటి నుంచి జగదీష్‌రెడ్డికి రాజకీయ శత్రుత్వం వుంది. పరస్పరం విమర్శలు చేసుకోవడం తెలిసిందే. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో వీళ్ల మధ్య విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. మంత్రి జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి బ్రదర్స్ వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి పూటకో మాట, పూటకో అబద్ధం చెబుతున్నారని ధ్వజమెత్తారు.
రాజగోపాల్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. త్యాగాలు చేశామని చెప్పడం అంటే ఇంతకు మించిన సిగ్గుమాలిన చర్య మరొకటి వుండదని మంత్రి విమర్శించారు. ఇప్పటి వరకు అనేక ఉప ఎన్నికలు ఆయా కారణాల వల్ల వచ్చాయని, కానీ మునుగోడులో ఎందుకొచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసమో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశానంటున్నారని, బీజేపీలో చేరితే ఏం అభివృద్ధి జరుగుతుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీ ఓ వ్యక్తిని కొనుగోలు చేయడంతో వచ్చిన ఉపఎన్నిక ఇదని ఆయన ఘాటు విమర్శ చేశారు. మూడేళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉండి, ఆ పార్టీని మోసం చేసి బీజేపీలో చేరారని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ప్రజలు క్షమించరన్నారు.
ఇదిలా వుండగా మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోనే పోటీ చేస్తామని ఆయన అన్నారు. ఇటీవల కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అనే జాతీయ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ పేరును గుర్తిస్తూ ఎన్నికల సంఘం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.