అచ్చెన్నాయుడికి ధైర్యం వుందా?

టెక్కిలి ఎమ్మెల్యే, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష కీల‌క నాయ‌కుడు అచ్చెన్నాయుడికి ఇది ప‌రీక్షా స‌మ‌యం. మూడు రాజ‌ధానులు కావాల‌ని కోరుతున్న ఉత్త‌రాంధ్ర వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాకు సై అంటున్నారు. ఇందులో భాగంగా చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం…

టెక్కిలి ఎమ్మెల్యే, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష కీల‌క నాయ‌కుడు అచ్చెన్నాయుడికి ఇది ప‌రీక్షా స‌మ‌యం. మూడు రాజ‌ధానులు కావాల‌ని కోరుతున్న ఉత్త‌రాంధ్ర వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాకు సై అంటున్నారు. ఇందులో భాగంగా చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ రాజీనామా చేశారు. ఈ సంద‌ర్భంగా అచ్చెన్నాయుడికి స‌వాల్ విస‌ర‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

అచ్చెన్నాయుడికి ద‌మ్ముంటే వికేంద్రీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా రాజీనామా చేయాల‌ని ధ‌ర్మ‌శ్రీ స‌వాల్ విసిరారు. అమ‌రావ‌తికి మ‌ద్ద‌తుగా టెక్క‌లి నుంచి అచ్చెన్నాయుడు తిరిగి పోటీ చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అమ‌రావ‌తి నుంచి అర‌స‌వెల్లికి పాద‌యాత్ర చేస్తున్న నేప‌థ్యంలో ఉత్త‌రాంధ్ర నుంచి అధికార పార్టీ నేత‌లు వికేంద్రీక‌ర‌ణ కోసం స్పీడ్ పెంచ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ధ‌ర్మ‌శ్రీ స‌వాల్‌ను అచ్చెన్నాయుడు స్వీక‌రిస్తే క‌థ వేరేలా వుంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇటు ఉత్త‌రాంధ్ర‌ వైసీపీ, అటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రాజ‌ధాని అంశంపై ప్ర‌జ‌ల్లోనే తేల్చుకుంటే బాగుంటుంద‌ని చాలా మంది అభిప్రాయం. అయితే అచ్చెన్నాయుడు, ఇత‌ర టీడీపీ ఎమ్మెల్యేలు అంత ధైర్యం చేసే ప‌రిస్థితి ఉందా? అంటే లేద‌నే స‌మాధానం వ‌స్తోంది. అధికార పార్టీ వాళ్లు త‌ప్ప తాము ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాజీనామా చేసే ప్ర‌సక్తే వుండ‌ద‌ని చంద్ర‌బాబునాయుడు ఎప్పుడో తేల్చి చెప్పారు.

వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల‌ని గ‌తంలో చంద్ర‌బాబు డెడ్‌లైన్ విధించిన సంగ‌తి తెలిసిందే. టీడీపీ డిమాండ్ల‌న్నీ కేవ‌లం మీడియాకే ప‌రిమితం. ప్ర‌జ‌ల కోసం రాజీనామా చేసిన చరిత్ర చంద్ర‌బాబు నేతృత్వంలోని టీడీపీకి లేద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం.