షాపింగ్ మాల్స్ తెరిచారు కానీ పెద్దగా రద్దీ కనిపించలేదు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి కానీ ఆక్యుపెన్సీ అంతంతమాత్రం. లాక్ డౌన్ తర్వాత వస్త్ర దుకాణాలు, స్వీట్ షాపులు, బేకరీలు తెరిచినా అమ్మకాలు చాలా తక్కువ. దాదాపు ప్రతి రంగంపై కరోనా ప్రభావం గట్టిగా పడింది. అయితే భక్తి విషయంలో మాత్రం కరోనా లెక్క తప్పింది. భక్తి ముందు కరోనా బలాదూర్ అనే రేంజ్ లో ఉంది శ్రీవారి దర్శన టిక్కెట్ల అమ్మకాలు.
అవును.. రేపట్నుంటి దేశవ్యాప్తంగా ఉన్న సామాన్య భక్తులకు తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది టీటీడీ. ఈ మేరకు టిక్కెట్ అమ్మకాలు ప్రారంభించగా.. రేపటికి సంబంధించిన 3వేల టిక్కెట్లు కేవలం అర్థగంటలో అమ్ముడుపోయాయి. దీంతో 12, 13వ తేదీలకు సంబంధించిన టిక్కెట్ల అమ్మకాల్ని టీటీడీ ప్రారంభించింది.
అటు ఆన్ లైన్ టిక్కెట్టింగ్ లో కూడా ఇదే జోరు కనిపించింది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు ఈనెల 30వ తేదీ వరకు (రోజుకు 3వేలు చొప్పున) ఆన్ లైన్ లో అమ్ముడుపోయాయి. జులై కోటాను ఇంకా తెరవలేదు. ఊహించని విధంగా వచ్చిన స్పందన చూసి టీటీడీ అధికారులే ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
78 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కలిగింది. అయితే ట్రయిల్ రన్ కింద ముందుగా టీటీడీ ఉద్యోగులకు మాత్రమే దర్శనానికి అనుమతినిచ్చారు. తర్వాత స్థానికులకు దర్శనం కల్పించారు. రేపట్నుంచి దేశవ్యాప్తంగా ఉన్న సామాన్య భక్తులందరికీ దర్శనం కల్పించబోతున్నారు. కరోనా కారణంగా ఈసారి భక్తుల రాక తగ్గొచ్చని, ఆన్ లైన్ టిక్కెట్లకు పెద్దగా డిమాండ్ ఉండకపోవచ్చని టీటీడీ భావించింది. కానీ భక్తులు మాత్రం మూకుమ్మడిగా షాకిచ్చారు. పెద్ద ఎత్తున తరలిరాబోతున్నట్టు టిక్కెట్ అమ్మకాల ద్వారా తెలియజెప్పారు.
ఈ విషయంలో భక్తుల ఆలోచన టీటీడీకి భిన్నంగా ఉంది. అదేంటంటే… సాధారణ రోజుల్లో శ్రీవారిని దర్శించుకోవాలంటే పెద్ద క్యూలో నడవాలి. గదుల్లో వేచి ఉండాలి. ఇంత కష్టపడి గుడిలోకి అడుగుపెడితే స్వామివారి దర్శనం కొన్ని సెకెన్లు మాత్రమే. అక్కడే ఉన్న వాలంటీర్లు భక్తుల్ని అలా ముందుకు నెడుతూనే ఉంటారు. అయితే ఈసారి భౌతిక దూరం కారణంగా శ్రీవారిని ఇంకాస్త ఎక్కువ సమయం చూసే వెసులుబాటు దక్కుతుందని భక్తుల ఆలోచన. పైగా ఆలయం తెరిచిన వెంటనే వెళ్తే రద్దీ తక్కువగా ఉంటుందనే ఆలోచన కూడా చాలామందికి ఉండడంతో.. ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.
టీటీడీకి మాత్రం ఇది విషమ పరీక్షే. మొన్నటివరకు టిక్కెట్, లగేజీ చెక్ చేసి లోపలకు పంపిస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి టెంపరేచర్ చెక్ చేయాలి. ప్రతి మలుపులో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. భక్తుల క్యూలైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఇవన్నీ చేస్తూనే.. భక్తుల మధ్య ఎడం ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు టీటీడీ తన శక్తిమేరకు ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఊహించని విధంగా భక్తుల రద్దీ పెరగడంతో.. రేపట్నుంచి కరోనా నిబంధనలు కొండపై ఏ మేరకు అమలవుతాయనేది వేచి చూడాల్సిన విషయం.