ప్రస్తుతం రోజుకు తొమ్మిది నుంచి 10 వేల స్థాయిలో కొత్తగా కరోనా కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ కు లాకులెత్తేసి వారాలు గడిచిపోతున్న నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇలా రోజు వారీగా కేసుల సంఖ్య పెరగడంతో ఇండియా కరోనా అత్యంత ప్రభావ దేశాల సరసన నిలుస్తూ ఉంది. ప్రపంచం రెన్నెళ్ల కిందట జాలి పడిన ఇటలీ వంటి దేశాలను దాటేసింది ఇండియా. వుహాన్ ను మించి ముంబైలో కేసుల సంఖ్య పెరిగింది! ఇలాంటి పరిస్థితుల్లోనూ కొంత ఊరటను ఇచ్చే విషయాలు కూడా ఉన్నాయి.
అందులో ముఖ్యమైనది దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది. ఎంతలా అంటే.. ప్రస్తుతానికి దేశంలో కరోనా పేషెంట్ల కన్నా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కాస్త ఎక్కువగా ఉండటం!
బుధవారం ఉదయం నాటి గణాంకాల ప్రకారం.. 1,35,205 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్ పేషెంట్ల సంఖ్య 1,33,632. ఇలా ఇండియాలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య యాక్టివ్ పేషెంట్ల సంఖ్య కన్నా ఎక్కువగా ఉంది. ఇది నిస్సందేహంగా ఒకరకమైన విజయమే. ప్రభుత్వాలు, డాక్టర్లు సాధించిన విజయంగా దీన్ని చెప్పాలి. రోజువారీగా పది వేల స్థాయిలో కేసులు నమోదు అవుతున్న తరుణంలో..అదే స్థాయిలో డిశ్చార్జిలు కూడా జరుగుతున్న పరిస్థితి ఇప్పుడు అగుపిస్తూ ఉంది.
అలాగే మరి కొందరు కరోనా పేషెంట్లను ఇంట్లోనే ఉంచి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. మొబైల్ ద్వారా వాళ్లకు వాడాల్సిన మందుల సమాచారం ఇచ్చి, ఇంట్లోనే ప్రత్యేక గదుల్లో ఉండమని సూచిస్తూ చికిత్సను అందిస్తున్న దాఖలాలూ కనిపిస్తున్నాయి. సుదీర్ఘ లాక్ డౌన్ లు వేరేరకమైన సమస్యలను తెచ్చిపెడుతున్న నేపథ్యంలో.. ఉన్న వైద్యపద్ధతుల్లోనే కరోనాను ధీటుగా ఎదుర్కోవడం కీలకమైన విషయం. ఈ విషయంలో ఇండియన్ వైద్యులు చాలా వరకూ సఫలం అవుతున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.