ఇండస్ట్రీలో దీన్ని ఇగో వార్ అనాలో, ప్రచ్ఛన్న యుద్ధమే అనాలో, కులపోరు అనాలో కానీ.. మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. తన విషయంలో ఇతరులు ఎలా వ్యవహరించినా తనకు అభ్యంతరం లేదని అంటూనే, వాళ్లు వ్యవహరిస్తున్న తీరు మీద నటుడు బాలకృష్ణ తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. వాళ్లు పిలిస్తే ఎంత, పిలవకపోతే ఎంత.. అని అంటూనే, తనను పిలవలేదని బాలకృష్ణ నొక్కి చెబుతున్నారు. అక్కడికంతా వెళ్లి పంచాయతీలు పెట్టుకునే తీరిక తనకు లేదని అంటూనే, మళ్లీ తనను పిలవలేదనే టోన్ లో బాలకృష్ణ మాట్లాడుతూ ఉండటం గమనార్హం.
కేసీఆర్ తో ఇండస్ట్రీ పెద్దల మీటింగ్ విషయంలో అయినా, జగన్ తో మీటింగ్ విషయంలో అయినా, ఆఖరికి 80ల తారల మీటింగ్ విషయంలో అయినా బాలకృష్ణ తనను పిలవకపోవడం వల్ల తనకు వచ్చే నష్టం లేదని అంటూ, తనను పిలవలేదని నిరసిస్తూ ఉన్నారు. తన షష్టిపూర్తి సందర్భంగా ఇస్తున్న ఇంటర్వ్యూల్లో బాలకృష్ణ ఈ వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు.
ఆ సంగతలా ఉంటే.. ఈ మాటల యుద్ధం ఎలా ఉన్నా, బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
'60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు.ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను.Dear #NBK as U turn the magical 60,I fondly reminisce on Ur amazing journey.Happy birthday' అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
అయితే ఈ ట్వీట్ విషయంలో మెగాభిమానులు స్పందించిన తీరు మరోరకంగా ఉంది. 'మీకున్న మంచితనం ఆ బ్రీడుకు లేదెందుకో..'అంటూ మెగాభిమానులు ఈ ట్వీట్ పై కామెంట్లు చేస్తున్నారు.