ఇన్నేళ్లూ కేవలం తెలంగాణ బీజేపీ లీడర్ గా గుర్తింపును కలిగి ఉన్న కిషన్ రెడ్డి కి ఇటీవల కేంద్ర మంత్రివర్గంలో దక్కిన ప్రమోషన్ తో కొత్త ఊపు వచ్చినట్టుగా ఉంది. ఇదే ఉత్సాహంతో ఆయన జన అశీర్వాదయాత్ర అంటూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో యాత్రను చేపట్టడం గమనార్హం.
అయితే ఇది రెండు రాష్ట్రాల వ్యాప్తంగా సాగే యాత్ర కాదు. కేవలం సెలెక్టివ్ గా కొన్ని లోక్ సభ, అసెంబ్లీ నియోకవర్గాల పరిధిలో ఈ యాత్రను ప్లాన్ చేసినట్టుగా ఉన్నారు. మొత్తం మూడు వందల కిలోమీటర్లకు పైగా ఈ యాత్ర సాగుతుందట. ఇది బస్సు యాత్ర తరహా కార్యక్రమంలా ఉంది.
మరి ఈ మధ్యకాలంలో.. చెప్పాలంటే గత కొన్ని దశాబ్దాల్లో బీజేపీ తరఫున ఇలాంటి యాత్రలు ఏవీ లేవు. తెలంగాణలో బీజేపీ కార్యక్రమాలు ఇటీవలి కాలంలో ఊపందుకుంటున్నాయి కానీ, అదంతా ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడ జరిగే కార్యక్రమంలా ఉంది. ఇక ఏపీలో అయితే.. బీజేపీ మొక్కుబడిగా కొన్ని కార్యక్రమాలను చేపడుతూ ఉంది.
అంతే కానీ, పెద్ద యాత్రలనేవీ చేపట్టలేదు. కిషన్ రెడ్డి చేపడుతున్నది కూడా ఏ పాదయాత్రో కాదు కానీ, ఈ మాత్రం ప్రజల్లో ఉండే కార్యక్రమాలు కూడా బీజేపీ వాళ్లు ఏవీ చేపట్టలేదు. మోడీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టారట. ఈ కార్యక్రమం ద్వారా బీజేపీ బలోపేతానికి ఆయన కృషి చేస్తారట.
మొత్తం ఎనిమిది లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో ఈ యాత్ర సాగుతుందని తెలుస్తోంది. మొత్తానికి కేంద్ర మంత్రి వర్గంలో ప్రమోషన్ తర్వాత కిషన్ చేపడుతున్న పెద్ద కార్యక్రమం ఇది. మరి ఈ యాత్రతో కిషన్ రెడ్డి బీజేపీకి తెలుగురాష్ట్రాల నుంచి బిగ్ లీడర్ అవుతారా?
ఇన్నాళ్లూ తెలంగాణ నేత, తెలంగాణ వాదిగా మిగిలిన కిషన్ రెడ్డి.. ఏపీలోనూ తన వర్గాన్ని పెంపొందించుకోగలరా? ప్రత్యేకించి ఏపీలో… బీజేపీ చుక్కాని లేని నావ లానే ఉంది దశాబ్దాలుగా. కిషన్ రెడ్డి యాత్రతో బీజేపీ ఏ మేరకు బలోపేతం అవుతుందో మరి!