ట్రయిలర్ తో జనాల్ని ఎట్రాక్ట్ చేయడంలో రెండు పద్ధతులుంటాయి. ఒకటి సినిమాలో ఏదో ఉందని సస్పెన్స్ క్రియేట్ చేయడం, రెండోది తమ సినిమాలో ఇది మాత్రమే ఉందని క్లియర్ గా చెప్పేయడం. శ్రీదేవి సోడా సెంటర్ జనాలు ఈ రెండో పద్ధతిని ఫాలో అయినట్టున్నారు. కొద్దిసేపటి కిందట మహేష్ చేతుల మీదుగా విడుదలైన ఈ ట్రయిలర్ అరటిపండు వలిచి పెట్టినట్టు క్లియర్ గా ఉంది.
ఓ బి-టౌన్ పట్టణంలో హీరో లైటింగ్ చేస్తుంటాడు. హీరోయిన్ సోడాలు కొడుతుంటుంది. హీరో, హీరోయిన్ ను ప్రేమిస్తాడు, ఎలాగోలా ఆమెను తన ప్రేమలో పడేట్టు చేస్తాడు. ఇక పెళ్లి చేసుకోవడమే బ్యాలెన్స్ అనుకునే టైమ్ కు కులాలు వేరు అనే టాపిక్ వస్తుంది. హీరో జైలుకెళ్తాడు.
జైలు నుంచి వచ్చిన హీరో పూర్తిగా మారిపోతాడు. తన ప్రేయసి కోసం అందర్నీ ఎదిరిస్తాడు. అయితే ఆమెకు అప్పటికే పెళ్లయిపోతుందని తెలుస్తుంది. దీంతో హీరో మరింత రెచ్చిపోతాడు. క్లైమాక్స్ ఏంటి అనేది మాత్రం సస్పెన్స్. ఇదంతా మేం అల్లిన కథ కాదు, శ్రీదేవి సోడా సెంటర్ ట్రయిలర్ లో ఉన్న మేటర్.
చూస్తుంటే.. సినిమాపై లేనిపోని అంచనాలు క్రియేట్ చేయకూడదనే ఉద్దేశంతో మేకర్స్ ఇలా కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని మరీ ఈ ట్రయిలర్ కట్ చేసినట్టుంది. అయితే దర్శకుడు కరుణకుమార్ స్టయిల్ ను దృష్టిలో పెట్టుకొని చూస్తే, సినిమాలో ఏదో పెద్ద ట్విస్ట్ ఉన్నట్టుంది. ఎందుకంటే, పలాస మూవీలో కూడా ఇలానే చేశాడు ఈ దర్శకుడు.
ట్రయిలర్ విషయానికొస్తే, మాస్ కుర్రాడు సూరిబాబుగా సుధీర్ బాబు బాగానే నటించాడు. కాకపోతే ఆ బ్యాక్ డ్రాప్ కథకు, ఆ సిక్స్ ప్యాక్ సూటయ్యేలా లేదు. ఆనంది లుక్, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఈనెల 27న థియేటర్లలోకి వస్తోంది శ్రీదేవి సోడా సెంటర్.