త‌గ్గుతూ, పెరుగుతూ, త‌గ్గుతూ..!

ఇండియాలో క‌రోనా కేసుల సంఖ్య కు సంబంధించిన గ్రాఫ్.. కాస్త ఎగుడుదిగుడుగా సాగుతూ, స్ట‌డీగా సాగుతోంది! దేశంలో క‌రోనా కేసుల సంఖ్య పూర్తి స్థాయిలో త‌గ్గిపోనూ లేదు.. అలాగ‌ని, పూర్తి స్థాయిలో పెరిగి భ‌య‌పెట్టడ‌మూ…

ఇండియాలో క‌రోనా కేసుల సంఖ్య కు సంబంధించిన గ్రాఫ్.. కాస్త ఎగుడుదిగుడుగా సాగుతూ, స్ట‌డీగా సాగుతోంది! దేశంలో క‌రోనా కేసుల సంఖ్య పూర్తి స్థాయిలో త‌గ్గిపోనూ లేదు.. అలాగ‌ని, పూర్తి స్థాయిలో పెరిగి భ‌య‌పెట్టడ‌మూ లేదు. 

గ‌త వారం ప‌ది రోజుల ప‌రిస్థితిని స‌మీక్షిస్తే.. ఒక్కో రోజు కేసుల సంఖ్య 40 వేల‌ను దాటింది. మ‌రో రోజు ముప్పై వేల స్థాయిలో నిలిచింది, ఆ పై 25 వేల స్థాయికి కూడా త‌గ్గింది. మ‌ళ్లీ ముప్పై వేల స్థాయికి, ముప్పై ఐదు వేల స్థాయికి పెరిగింది. ఇలా స్వ‌ల్ప స్థాయిలో హెచ్చుత‌గ్గుల‌తో దేశంలో క‌రోనా నంబ‌ర్లు స్థూలంగా స్ట‌డీగా కొన‌సాగుతూ ఉన్నాయి. 

ఇటీవ‌లి కాలంలో కేసుల సంఖ్య కాస్త పెర‌గ‌డంతో.. మూడో వేవ్ షురూ అయిన‌ట్టే అనే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.ఆగ‌స్టు రెండో వారం త‌ర్వాత మూడో వేవ్ పుంజుకోవ‌చ్చ‌ని ఇది వ‌ర‌కూ ప‌లువురు అధ్య‌య‌న‌క‌ర్త‌లు అంచ‌నా వేశారు. దీంతో.. ఆగ‌స్టు మొద‌టి వారంలో కేసుల సంఖ్య కాస్త పెర‌గ‌డంతో, ఇక మూడో వేవ్ మొద‌లైన‌ట్టే అనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే పెరుగుద‌ల కొన్ని రాష్ట్రాల్లోనే ప్ర‌ధానంగా చోటు చేసుకుంది. 

కేర‌ళ‌లోనూ, ఈశాన్య రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అమాంతం పెర‌గ‌డం ఆందోళ‌న రేపింది. మూడో వేవ్ కు ఆ రాష్ట్రాలు హాట్ స్పాట్ గా నిలుస్తాయా? అనే చ‌ర్చ మొద‌లైంది. ఇక ఇప్పుడు కూడా మెజారిటీ కేసుల‌కు కేర‌ళ‌నే కేంద్రంగా నిలుస్తోంది. గ‌త ఇర‌వై నాలుగు గంట‌ల కేసుల్లో కూడా మెజారిటీ వాటా కేర‌ళ‌దే. దాదాపు 60 శాతానికి పైగా కేసులు కేర‌ళ‌లోనే న‌మోద‌వుతున్నాయి ఈ మ‌ధ్య‌. 

గ‌త ఇర‌వై నాలుగు గంట‌కు సంబంధించిన స‌మాచారం ప్ర‌కారం.. మొత్తం కేసుల 36 వేల స్థాయిలో ఉండ‌గా, అందులో 21వేల కేసులు కేర‌ళ‌లోనే న‌మోద‌య్యాయి. ఆ త‌ర్వాత మ‌హారాష్ట్ర ఉంది. మ‌హారాష్ట్ర‌లో ఐదు వేల స్థాయిలో కేసులు వ‌చ్చాయి. ఇలా.. డెబ్బై ఐదు శాతం స్థాయి కేసులు కేవ‌లం రెండు రాష్ట్రాల్లోనే నమోద‌వుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం.

క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ఏపీల్లో 1500 స్థాయిలో కేసులు వ‌చ్చాయి. ఇక ఉత్త‌రాది రాష్ట్రాలు కేసులే లేవ‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి. దేశ‌రాజ‌ధాని ఢిల్లీతో స‌హా, యూపీ, బిహార్, హ‌ర్యానా, మ‌ధ్య‌ప్ర‌దేశ్, గుజ‌రాత్ ల‌లో.. డ‌బుల్ డిజిట్ స్థాయిలో మాత్ర‌మే కేసుల అధికారిక ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో క‌రోనా ప్ర‌స్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల‌కే చిన్న‌పాటి స‌మ‌స్య‌గా కొన‌సాగుతోంది. మిగ‌తా రాష్ట్రాలు మాత్రం.. త‌మ ద‌గ్గ‌ర కేసులే లేవంటున్నాయి!

ఇక జ‌న‌జీవ‌నం కూడా దాదాపు సామాన్య స్థితికి చేరుతోంది. ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ప్ర‌జ‌లు త‌మ ప‌నుల‌న్నింటినీ చేసుకోగ‌లుగుతున్నారు. వ్య‌వ‌సాయ‌, వ్యాపారాల‌కు ఎలాంటి ఆటంకాలూ లేవు. ఇక వివాహాలు, శుభ‌కార్యాల‌కు మ‌ళ్లీ పిలుపులు ఊపందుకుంటున్నాయి. చిన్న చిన్న ఫంక్ష‌న్ల‌కు కూడా హ్యాపీగా వంద‌ల మంది హాజ‌ర‌వుతున్నారు. 

పెళ్లిళ్లు కూడా నాలుగైదు వంద‌ల మందితో జ‌రిగే ప‌రిస్థితి చాలా చోట్ల క‌నిపిస్తూ ఉంది. మాస్కుల‌ను నామ‌మాత్రంగా ధ‌రిస్తున్నారు. ఇక మామూలుగా రోడ్ల‌పై వెళ్లే వారిని గ‌మ‌నిస్తే.. మాస్కుల ముచ్చ‌ట కూడా త‌గ్గుతోంది.