ఫేస్ బుక్ ఎకౌంట్ హ్యాక్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. డమ్మీ ఎకౌంట్ సృష్టించి డబ్బు అడిగితే మోసపోయే వాళ్లు కూడా తక్కువ. అందుకే హ్యాకర్స్ ఇప్పుడు ఏకంగా వాట్సాప్ పై పడ్డారు. వ్యక్తుల ఫోన్ నంబర్ ఆధారంగా మరో వాట్సాప్ ఎకౌంట్ క్రియేట్ చేసి, దాని సహాయంతో ఇతరుల్ని మోసం చేస్తున్నారు. డబ్బులు గుంజడంతో పాటు.. ఫోన్లలోకి వైరస్ లింక్స్ పంపి అల్లకల్లోలం చేస్తున్నారు. ఈమధ్య హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి.
వ్యక్తుల ఫోన్ నంబర్లు తీసుకుంటారు. ఆ నంబర్లతో వాట్సాప్ తెరుస్తారు. అప్పుడు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అసలైన వ్యక్తి మొబైల్ కు వెళ్తుంది. ఆ ఓటీపీ కనుక పొరపాటున చెబితే.. అసలైన వ్యక్తుల వాట్సాప్ మొత్తం హ్యాకర్లు చేతికి వెళ్తుంది. ఆ వెంటనే వాళ్లు 2-స్టెప్ వెరిఫికేషన్ చేసేస్తారు. దీంతో మోసపోయిన వ్యక్తి తిరిగి తన వాట్సాప్ ను పొందలేడు.
హ్యాకర్లు బ్యాకప్ మొత్తం తీసుకుంటారు. లిస్ట్ లో ఉన్నోళ్లందరికీ వైరస్ లింక్ పంపిస్తారు. ఆ లింక్ ఓపెన్ చేసిన ఫోన్లు అన్నీ హ్యాక్ అవుతాయి. మరికొందరు మిగతా వాళ్లకు డబ్బులు కావాలని అడుగుతారు. తెలిసిన నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ రావడంతో చాలామంది డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తుంటారు. హైదరాబాద్ లో ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయి.
అందుకే తెలిసిన వ్యక్తుల వాట్సాప్ ఎకౌంట్స్ నుంచి లింక్స్ వచ్చినప్పటికీ వెంటనే క్లిక్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. తప్పనిసరి పరిస్థితుల్లో లింక్ ఓపెన్ చేయాల్సి వస్తే, అందులో ఉన్న సమాచారాన్ని పూర్తిగా చదవాలని చెబుతున్నారు. వాట్సాప్ రిజిస్ట్రేషన్ వేరే వ్యక్తులకు ఇచ్చినట్టు అందులో స్పష్టంగా ఉంటుంది.
సో.. వాట్సాప్ లో వచ్చిన మెసేజీలన్నీ మన స్నేహితులు లేదా బంధువులు పంపించారనుకుంటే పొరపాటే. జాగ్రత్తగా గమనించిన తర్వాతే లింక్స్ ఓపెన్ చేయడం లేదా అవతలి వ్యక్తులతో ఛాట్ చేయడం లాంటివి చేయాలి. లేదంటే మీరు కూడా ప్రమాదంలో పడినట్టే.