బీజేపీ చిత్తశుద్ధి ఏంటో తెలిసిపోయిందిలా..?

తిరుపతి ఉప ఎన్నికల కోసం ఉన్నట్టుండి పక్క రాష్ట్రం నుంచి రత్నప్రభను తీసుకొచ్చారు. తిరుపతిలో ఆమెను గెలిపించుకుంటే, కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, తిరుపతి వాసులకు ఎనలేని సేవ చేస్తారని ఊదర కొట్టారు. కట్…

తిరుపతి ఉప ఎన్నికల కోసం ఉన్నట్టుండి పక్క రాష్ట్రం నుంచి రత్నప్రభను తీసుకొచ్చారు. తిరుపతిలో ఆమెను గెలిపించుకుంటే, కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, తిరుపతి వాసులకు ఎనలేని సేవ చేస్తారని ఊదర కొట్టారు. కట్ చేస్తే డిపాజిట్ కోల్పోవడంతో రత్నప్రభను పూర్తిగా పక్కనపెట్టారు. ఎంతలా అంటే.. తిరుపతిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మొదలుపెట్టిన జన ఆశీర్వాద యాత్రకు కూడా ఆమెకు ఆహ్వానం లేదు.

బీజేపీ నేతలకు దక్షిణాది రాష్ట్రాలపై మొదటినుంచీ చిన్నచూపే. అందులోనూ తెలుగు రాష్ట్రాలు బీజేపీకి కొరకరాని కొయ్యల్లా ఉన్నాయి. అటు తెలంగాణలో కాస్తో కూస్తో పోటీ ఇస్తున్నా, ఇటు ఏపీలో మాత్రం బీజేపీని తలచుకునేవారే లేరు. టీడీపీతో కుమ్మక్కై 2014లో, మోదీ హవాతో ఎగిరెగిరి పడ్డారు కానీ, వైసీపీ వచ్చాక ఏపీలో బీజేపీ అసలు బలమేంటో అందరికీ తెలిసిపోయింది.

తిరుపతి ఉప ఎన్నికల విషయానికొస్తే చాలామంది స్థానిక నాయకులు పోటీ పడ్డారు. కానీ ఏరికోరి కర్నాటక నుంచి రత్నప్రభను తీసుకొచ్చారు. తెలుగు మాట్లాడటమే సరిగా రాని ఆమెను తీసుకొచ్చి తిరుపతి ప్రజలపై రుద్దాలని చూశారు. జనసేనతో కలసి బాగానే ప్రచారం చేసుకున్నారు. 

ఏపీ నుంచి ఒక్క సర్పంచ్ ని కూడా నేరుగా గెలిపించుకునే దిక్కులేదు కానీ, ఏకంగా ఎంపీ సీటు గెలిస్తే, ఆమెకు మంత్రి పదవి ఇస్తామని కూడా ఓ దశలో ప్రకటించారు. రత్నప్రభ కేంద్ర మంత్రి, ఏపీ కొత్త ముఖ్యమంత్రి పవన్ అంటూ.. వారు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అదంతా కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని తేలిపోయింది.

ప్రస్తుతం ఏపీలో బీజేపీ బలం కేవలం టీడీపీ నుంచి గెలిచిన రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు. మొదటినుంచి బీజేపీని అంటిపెట్టుకుని ఉన్నవారు సైతం.. అంతా తమకే కావాలంటారు కానీ, కొత్తగా ఎవరినీ ఎదగనీయడంలేదు. కన్నా పోయి వీర్రాజు వచ్చినా పెద్దగా మార్పేమీ లేదు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని పటిష్టపరచాలన్న ఆలోచన ఎవరిలోనూ లేదు. అదే సమయంలో జనసేనకు ఉన్న క్యాడర్ ని బాగా వాడుకోవాలనే దురాశ మాత్రం వారిలో ఉంది. ఈ కుయుక్తులు తెలిసే ఇటీవల పవన్ కల్యాణ్ వారికి దూరంగా ఉంటున్నారు.

ఏపీలో అధికారానికి చేరువ కావాలనే చిత్తశుద్ధి బీజేపీలో ఉంటే.. ఇప్పటినుంచే నియోజకవర్గాల వారీగా స్థానిక నాయకత్వాన్ని బలపరిచే దిశగా అడుగులు వేయాలి. అరువు నాయకులతో అప్పటికప్పుడు పని జరగాలంటే మాత్రం ఏపీలో కుదిరేలా లేదు.