జగన్ కు ఇదే సరైన సమయం

విజ‌యం అనేది ఒక ర‌కమైన మ‌త్తులాంటిది. ఓట‌మి మ‌త్తు పోగొట్టే ఔష‌ధం. ఏడాది క్రితం దేశంలోనే అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన ముఖ్య‌మంత్రుల్లో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ చోటు దక్కించుకున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి…

విజ‌యం అనేది ఒక ర‌కమైన మ‌త్తులాంటిది. ఓట‌మి మ‌త్తు పోగొట్టే ఔష‌ధం. ఏడాది క్రితం దేశంలోనే అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన ముఖ్య‌మంత్రుల్లో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ చోటు దక్కించుకున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి ఏడాది తిరిగే స‌రికి ఆయ‌న గ్రాప్ అమాంతంగా ఎందుకు ప‌డిపోయింది? ఇండియా టుడే నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వేలో ఏపీ, తెలంగాణ సీఎంలు జ‌గ‌న్‌, కేసీఆర్ ఎందుక‌ని ప్ర‌జాద‌ర‌ణ కోల్పోయిన‌ట్టు తేలింది? ఇప్పుడీ ప్ర‌శ్న‌లు తెలుగు స‌మాజంలో వెల్లువెత్తుతున్నాయి.

ఏపీ సీఎం జ‌గ‌న్ విష‌యంలో ఈ స‌ర్వే మేల్కొలుపులాంటిద‌ని చెప్పొచ్చు. ఆయ‌న పాల‌నా కాలం స‌గం పూర్త‌యింది. ఇక స‌గం మిగిలి ఉంది. ఎంతో ముందుగానే ఆయ‌న పాల‌న‌పై ఏపీ స‌మాజం మూడ్‌ను ఇండియా టుడే క‌ళ్ల‌కు క‌ట్టింది. సంక్షేమ ప‌థ‌కాల‌కు ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నా…మ‌రెందుక‌ని సానుకూల వాతావ‌ర‌ణం లేద‌నేది ప్ర‌భుత్వ పెద్ద‌ల సంశ‌యం. ఇక్క‌డ జ‌గ‌న్ ప్ర‌భుత్వం గుర్తించుకోవాల్సిన అంశం ఒక‌టి ఉంది.

సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు ప్ర‌భుత్వ సొమ్ము మొత్తాన్ని ఖ‌ర్చు చేస్తూ, మిగిలిన వాళ్ల నోళ్లు కొడుతున్నారనే అభిప్రాయాలు బ‌లంగా ఉన్నాయి. ఇదే అతిపెద్ద నెగెటివ్‌గా చెప్పొచ్చు. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ ఏ మాత్రం జ‌ర‌గ‌డం లేదు. కేవ‌లం మూడు రాజ‌ధానులు ప్ర‌క‌టించినంత మాత్రాన త‌మ జీవితాలు మారుతాయ‌న్న భ్ర‌మ‌లో జ‌నం లేర‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం గ్ర‌హిస్తే మంచిది. 

మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత పార్టీని పూర్తిగా గాలికొదిలేసింది. పార్టీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నెల‌కుంది. ఇది పార్టీకి ఎంతో ప్ర‌మాద‌క‌రం. గ‌తంలో చంద్ర‌బాబు ఇలాగే చేసి, ఆ త‌ర్వాత ల‌బోదిబోమంటున్నారు.

పాల‌న‌పై క్షేత్ర‌స్థాయిలో పాల‌న‌పై జ‌నాభిప్రాయాన్ని చెప్పేవాళ్లు క‌రువ‌య్యారు. పైగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పూర్తి ఏక‌ప‌క్షంగా ఫ‌లితాలు రావ‌డం జ‌గ‌న్‌ను త‌ప్పుదోవ ప‌ట్టించింది. అంతా బాగుంద‌నే అభిప్రాయాన్ని స్థానిక సంస్థ‌లు క‌లిగించాయి. అయితే ఆ విజ‌యాలు ఎలా వ‌చ్చాయో పార్టీ నేత‌ల‌కు బాగా తెలుసు. ఈ నేప‌థ్యంలో త‌న‌కు గ్రాప్ ప‌డిపోతోంద‌న్న చేదు నిజాల్ని జ‌గ‌న్ జీర్ణించుకోవాల్సి ఉంది. అస‌లు త‌ప్పులు ఎక్క‌డ జ‌రుగుతున్నాయో ఆయ‌న ఆత్మ‌శోధ‌న చేసుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను ఈ స‌ర్వే తేల్చి చెబుతోంది.

త‌న గ్రాప్ ప‌డిపోతోంద‌ని వ‌స్తున్న స‌ర్వేల‌ను ఆయ‌న పాజిటివ్‌గా తీసుకోవాలి. ఎందుకంటే పొగ‌డ్త‌ల కంటే తెగ‌డ్త‌లే మ‌నిషి ఉన్న‌తికి దోహ‌దం చేస్తాయి. ఆ కోణంలోనే ఇలాంటి వాటిని జ‌గ‌న్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. మ‌రో 30 ఏళ్లు అధికారంలో ఉండాల‌ని క‌ల‌లు కంటున్న జ‌గ‌న్‌కు త‌న పాల‌న‌లోని త‌ప్పుల‌ను స‌రిదిద్దుకోడానికి ఇదే స‌రైన స‌మ‌యం. మంచి ప‌న‌నికి ఆల‌స్యం ఎందుకు?