పాలు ఇచ్చే ఆవును వదిలేసి దున్నపోతును తెచ్చుకున్నారు అంటూ ప్రజలను దెప్పి పొడుస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. సరే, ఆయన అధికారం యావ, ఆయన బాధ తెలిసిందే. ఆ సంగతి పక్కనపెట్టి, హామీలు, అమలు సంగతి అలావుంచి, అసలు ఏదో ఒకటి, బాబుగారు దున్నపోతు అని బిరుదు ఇచ్చిన జగన్ ఇచ్చారా? లేదా? అన్నది చూద్దాం. కీలకమైన ఉద్యోగస్థులకు డిఎలే బకాయిలు పడివుండేవి. అధికారంలోకి వచ్చిన మూడు నాలుకేళ్ల వరకు పే రివిజన్ బకాయిలే చెల్లించలేదు. ఇది బాబు జమానా.
జగన్ వచ్చిన తరువాత పింఛనరు చనిపోయి, ఆ ఫింఛనరు జీవిత భాగస్వామికి వచ్చే పింఛను సైతం పెరిగింది. అది కూడా మూడువేల నుంచి ఆపైన. ఇక పింఛనర్లకు పదివేల నుంచి ఆ పైన పెరిగింది. ఈ లెక్కన ఉద్యోగస్థులకు ఎంత పెరిగి వుంటుందో అంచనా వేసుకోండి. ఇదంతా జగన్ అనౌన్స్ చేసిన ఇంటీరియమ్ రిలీఫ్ వల్ల. త్వరలో పేరివిజిన్ జరిగితే ఇంకెంత పెరుగుతుంది.
నాకు ఎందుకు ఓటు వేయలేదు అని బాబు అడుగుతున్నారు. వేయకపోవడం కాదు, బాబు వైఖరి అయిదేళ్లు చూసిన ఈ ఉద్యోగులు మళ్లీ బాబుగారికి ఓటు వేస్తారా? అలాగే ఆశావర్కర్లు, ఇక రకరకాల కేటగిరీ జనాలకు జీతాలు పెరిగాయి. వృద్దాప్య పింఛన్లు 250 రూపాయలు పెరిగాయి. హామీ వెయ్యి రూపాయలే. కాదనడంలేదు. కనీసం 250 పెరిగింది కదా?
రేషన్ లో సన్నబియ్యం ఇవ్వడం ప్రారంభమైంది.
రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందుతోంది.
విప్లవాత్మకమైన శాశ్వత హక్కుల బిల్లు, విద్యాసంస్థల బిల్లు రూపకల్పన జరిగింది.
పోలీసు కానిస్టేబుల్ లకు వీక్లీ ఆఫ్ దొరికింది.
ప్రభుత్వ ఆఫీసుల్లో రాజకీయ నాయకుల హడావుడి తగ్గింది.
ఇవన్నీ జస్ట్ కొన్ని నెలల్లో మాత్రమే.
కానీ సమస్య ఏమిటంటే, అన్న క్యాంటీన్లు మూసారు. ఇసుక పాలసీ ఇబ్బంది పెడుతోంది. ఈ రెండింటిని పట్టుకుని చంద్రబాబు ఏకంగా జగన్ ను దున్నపోతుతో పోల్చేసారు.
అన్న క్యాంటీన్ల వ్యవహారం చూద్దాం. 70 రూపాయలకు పైగా ఇస్కాన్ కు చెందిన అక్షయపాత్రకు అందచేస్తూ, అయిదు రూపాయలకు జనాలకు భోజనం పెడుతున్నారు. ఇప్పుడు మా ఉద్యోగాలు అంటూ రోడ్డు ఎక్కిన అన్న క్యాంటీన్ జనాలు అంతా ప్రభుత్వం పెట్టినవారు కాదు. ఇస్కాన్ కు చెందిన అక్షయపాత్ర నియమించుకున్నవారు.
అసలు అక్షయపాత్ర ఎంత ఖర్చు చేస్తోంది? వాళ్లకు ఎంత జీతాలు ఇస్తోంది? ఎంత లాభం మిగులుతోంది? ఇవన్నీ ఎవరన్నా ఆరా తీసారా? ఇస్కాన్ కు చెందిన బియ్యం ప్యాకింగ్ మార్చి విదేశాలకు వెళ్తూ, ఆ మధ్య వైజాగ్ లో పట్టుబఢిన సంగతి వార్తల్లో వచ్చింది. ఆ తరువాత అంతా గప్ చుప్ అయింది.
ఇక ఎవరు తింటున్నారు అన్నది కొలమానం లేదు. ఎవరైనా తినొచ్చు. ఇది ఎలాంటి అపాత్రదానం? సరే, పోనీ ఆ దుబారాను పక్కన పెడితే, బాబుగారు ఈ హామీ ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడు అమలు చేసారు? అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదిగో అదిగో అంటూ ఎన్నికలకు మూడునెలల ముందు మొదలుపెట్టారు. ఎందుకోసం? ఓట్ల కోసం కాదా?
ఇక ఇసుక పాలసీ. దీన్ని భగవంతుడు కూడా సరిచేయలేడు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులకు ఇదే ప్రదాన ఆదాయ వనరుగా మారింది ఇప్పుడు. ఏరు, నది వున్న ఏరియాల రాజకీయ నాయకులకు పండగే. కానీ ఎక్కడ ఇసుక కనిపించిన ఫొటోలు తీసి, కేసులు పెడుతున్నారు. దాంతో వ్యవహారం టైట్ అయింది. దాని వల్ల రేటు పెరిగింది. దీన్ని పరిష్కరించి, చక్కదిద్దడంలో మాత్రం జగన్ ప్రభుత్వం తడబడుతోంది.
ఈమాత్రానికి, ఈ కొద్ది నెలలకే జగన్ కాస్తా దున్నపోతులా కనిపిస్తున్నారు చంద్రబాబుకి. కానీ లబ్దిపొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు, ఇతరత్రా జనాలకు మాత్రం కామధేనువులాగే కనిపిస్తున్నాడు. అందుకే వారెవరూ ఇక చంద్రబాబును కానీ, ఆయన మాటలను కానీ పట్టించుకునే స్థితిలో కానీ, ఆయనకు ఓటేశే ఆలోచనలో కానీ లేరు.