ఏపీలో అమరావతి ఏకైక రాజధాని అంటూ ఒక వైపు రైతుల పేరిట పాదయాత్ర సాగుతోంది. దీని వెనక టీడీపీ ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ రైతులని చెబుతూ పాదయాత్రలను కొందరి చేత చేయిస్తోందని ఆరోపిస్తున్న సంగతి విధితమే.
మరి ఇటు వైపు వైసీపీ వారే ఒక రాజకీయ పార్టీగా విమర్శలు చేస్తున్నారు. అవతల వైపు రైతులు పాదయాత్ర కనిపిస్తోంది. చంద్రబాబు టీడీపీ ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నా జనాలలోకి డైరెక్ట్ గా ఆరోపణలు వెళ్లడంలేదు.
దాంతో వైసీపీ కూడా అధికార వికేంద్రీకరణ ఉద్యమాన్ని పూర్తిగా తమ భుజాల మీద వేసుకోకుండా నాన్ పొలిటికల్ జేఏసీని ఒకదాని ఏర్పాటు చేయించి వారికి అన్ని బాధ్యతలు అప్పగించి తాము సహకార పాత్రలో ఉండాలని భావిస్తోంది అని అంటున్నారు.
దీని మీద మంత్రి గుడివాడ అమరనాధ్ మాట్లాడుతూ నాన్ పొలిటికల్ జేఏసీ వికేంద్రీకరణ విషయంలో ఉండాలని భావిస్తున్నట్లుగా చెప్పారు. వికేంద్రీకరణకు సమర్ధించే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంస్థలు అందులో భాగస్వామ్యం అవుతాయని అన్నారు. తొందరలో అలాంటి జేఏసీ మేధావులు విద్యావంతులతో ఏర్పాటు అవుతుందని అంటున్నారు.
అంతే కాదు అమరావతి రైతుల పాదయాత్రకు ధీటుగా వికేంద్రీకరణ వాదనను వినిపిస్తూ మరో పాదయాత్ర ఏపీలో సాగాలని కూడా వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఉద్యమ కార్యాచరణ అంతా నాన్ పొలిటికల్ జేఏసీ అన్నది ఏర్పాటు అయితే చర్చించి సిద్ధం చేస్తారని అంటున్నారు. వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు అయితే విశాఖ రాజధాని కోసం తాము ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటిస్తున్నారు.