భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)పై విమర్శల జోరు పెరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికార, ప్రతిపక్ష నేతలంతా బీఆర్ఎస్‌ను టార్గెట్ చేయడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు.
బీఆర్ఎస్ గురించి అసలు పట్టించుకునే ప్రశ్నే లేదని వైసీపీ నేతలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మరికాస్త దూకుడుగా కేసీఆర్‌పై కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది.
ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ ప్రభావం ఎలా వుంటుందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా…. ‘కేసీఆర్ కాదు కదా.. ఆయన తాత వచ్చినా మాకు నష్టం లేదు. సింహం సింగిల్‌గానే వస్తుందన్నట్టు, జగన్ కూడా అదే రీతిలో వస్తారు’ అని కారుమూరి ఘాటుగా స్పందించారు. వీళ్లంతా కలిసి రమ్మనాలని, అత్యధిక మెజార్టీతో గెలుస్తామని కారుమూరి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని ఆయన తేల్చి చెప్పారు.
మరోవైపు ఏపీలో జగన్‌కు రాజకీయంగా లబ్ధి కలిగించేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీపై చంద్రబాబు సహా టీడీపీ నేతలెవరూ సీరియస్ కామెంట్స్ చేయకపోవడం గమనార్హం. కానీ వైసీపీ నేతలు మాత్రం రెచ్చగొట్టేలా బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నారు. దీని వెనుక లాజిక్ ఏంటో ఏపీ ప్రతిపక్ష పార్టీలకు అర్థం కాక వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నాయి.