మ‌రో ఆస్ప‌త్రికి పేరు మార్పు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ముఖ ప్ర‌భుత్వ సంస్థ‌ల పేరు మార్పు కొన‌సాగుతోంది. తాజాగా విజ‌య‌న‌గ‌రంలోని మ‌హారాజా ప్ర‌భుత్వాస్ప‌త్రి పేరును మార్చేశారు. ఈ ఆస్ప‌త్రికి ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌న ఆస్ప‌త్రిగా పేరు మార్చారు. ఈ పేరు మార్పును ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ముఖ ప్ర‌భుత్వ సంస్థ‌ల పేరు మార్పు కొన‌సాగుతోంది. తాజాగా విజ‌య‌న‌గ‌రంలోని మ‌హారాజా ప్ర‌భుత్వాస్ప‌త్రి పేరును మార్చేశారు. ఈ ఆస్ప‌త్రికి ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌న ఆస్ప‌త్రిగా పేరు మార్చారు. ఈ పేరు మార్పును ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. ఇప్ప‌టికే ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొల‌గించి, దివంగ‌త వైఎస్సార్ పేరు పెట్ట‌డంపై వివాదం నెల‌కున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో మ‌హారాజా ప్ర‌భుత్వాస్ప‌త్రి పేరు మార్చ‌డాన్ని టీడీపీ వ్య‌తిరేకిస్తోంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ ఆస్ప‌త్రి వ‌ద్ద టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న‌కు దిగారు. వెంట‌నే పేరు మార్పును ఉప‌సంహ‌రించుకోవాల‌ని, మ‌హారాజా ప్ర‌భుత్వాస్ప‌త్రిగానే కొన‌సాగించాల‌ని డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇదే అంశంపై టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేశ్ ట్విట‌ర్ వేదిక‌గా ఘాటుగా స్పందించారు. మహనీయులను అవమానించడమే జగన్ పనిగా మారిందని త‌ప్పు ప‌ట్టారు. విజయనగరం మహారాజా ప్రభుత్వాస్ప‌త్రి పేరు మార్చి.. ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆస్పత్రి కోసం మహారాజా కుటుంబం విలువైన భూమిని ఇచ్చింద‌ని ఆయ‌న గుర్తు చేశారు.

రాత్రికి రాత్రి మహారాజా పేరుని తొలగించడాన్ని ఖండిస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. రాత్రికి రాత్రే మ‌హారాజా పేరు తొల‌గించ‌డం వెనుక ప్ర‌భుత్వ ఉద్దేశం ఏమై వుంటుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌తిప‌క్ష పార్టీలు రాజ‌కీయంగా పోరాటాలు చేసే అవ‌కాశం ఉంది. ఇదిలా వుండ‌గా ఈ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి వైఎస్సార్ పేరు పెట్ట‌క‌పోవ‌డం కొంత‌లో కొంత అధికార పార్టీకి ఊర‌ట‌నిచ్చే సంగ‌తి.