సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి రూపొందించిన తాజా చిత్రం స్వాతిముత్యం. గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యారు. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర బృందం విజయోత్సవ వేడుకకు నిర్వహించింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ” మా సినిమాకి ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ పట్ల చాలా సంతోషంగా ఉంది. సినిమా గురించి, సినిమాలో పాత్రల గురించి చాలా సహజంగా మన మధ్యలో జరిగినట్లు ఉందని అందరూ ప్రశంసిస్తున్నారు. విమర్శకులు కూడా అన్ని పాత్రలకు ప్రాధాన్యమిస్తూ మంచి వినోదాన్ని పంచామని ప్రశంసించడం ఆనందంగా ఉంది. హీరో గణేష్ నేను కథ చెప్పగానే నచ్చి దానిని ముందుకు తీసుకెళ్ళాడు. మా ఇద్దరికీ ఈ విజయం చాలా కీలకం అన్నారు.
వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. ” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాను.. మళ్ళీ చెబుతున్నాను. కొత్త వారికి అవకాశం ఇవ్వడం అనేది నాగ వంశీ చిన్న విషయం అయ్యుండొచ్చు. కానీ నాకు అది చాలా పెద్ద విషయం. ఇంతమంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. విడుదలకు ముందే ఈ సినిమా చూసి నవ్వుకుంటూ బయటకు వస్తారని మేం చెప్పాం. అయితే మేం ఊహించిన దానికంటే ఎక్కువగా నవ్వుకుంటూ బయటకు వస్తున్నారు.” అన్నారు.
హీరో గణేష్ మాట్లాడుతూ.. ” ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. మా సినిమాకి ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు. నటుడిగా నన్ను ప్రేక్షకులు అంగీకరించారు. ప్రతి ఒక్కరూ తెర మీద గణేష్ కనిపించలేదు, బాల అనే కుర్రాడు మాత్రమే తెర మీద కనిపించాడు అన్నప్పుడు.. నటుడిగా ఓ పది మార్కులు వేయించుకున్నాను అని చిన్న తృప్తి కలిగింది.
నా నుంచి నటనను రాబట్టినందుకు, నా దగ్గరకు ఈ కథను తీసుకొచ్చినందుకు లక్ష్మణ్ కి ధన్యవాదాలు. అలాగే ఈ కథను మా కంటే ఎక్కువగా నమ్మి, అన్నీ సమకూర్చి, ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సితార సంస్థకి, నాగ వంశీ కి జీవితాంతం ఋణపడి ఉంటాను. ఇంతమంచి విజయాన్ని అందించినందుకు అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అన్నారు.
నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ.. “స్వాతి ముత్యం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. మా సినిమాకి లభిస్తున్న ఆదరణ పట్ల సంతోషంగా ఉంది. చిత్ర విడుదలకు ముందు మెగాస్టార్ పెద్ద మనసుతో మా సినిమాకి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు స్వాతి ముత్యం, గాడ్ ఫాదర్ రెండు చిత్రాలూ విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. స్వాతి ముత్యం చిత్రానికి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఈ వారాంతానికి వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది” అన్నారు. దివ్య శ్రీపాద, సురేఖా వాణి తదితరులు ప్రసంగించారు.