కేసీఆర్ స‌ర్కార్‌కు ప్ర‌శ్న‌…ఏపీలో ఉలికిపాటు!

కొన్నికొన్ని సంద‌ర్భాల్లో పాల‌కుల విప‌రీత ధోర‌ణులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. న్యాయ‌స్థానాలే జోక్యం చేసుకోక‌పోతే… రాచ‌రి కాన్ని మ‌రిపించేలా పాలించే వాళ్లేమో అనే అనుమానాలు త‌లెత్త‌కుండా ఉండ‌వు. పాల‌న‌లో జ‌వాబుదారీ త‌నం ఉండాల‌ని రాజ్యాంగం చెబుతుంటే,…

కొన్నికొన్ని సంద‌ర్భాల్లో పాల‌కుల విప‌రీత ధోర‌ణులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. న్యాయ‌స్థానాలే జోక్యం చేసుకోక‌పోతే… రాచ‌రి కాన్ని మ‌రిపించేలా పాలించే వాళ్లేమో అనే అనుమానాలు త‌లెత్త‌కుండా ఉండ‌వు. పాల‌న‌లో జ‌వాబుదారీ త‌నం ఉండాల‌ని రాజ్యాంగం చెబుతుంటే, అందుకు విరుద్ధంగా ప్ర‌జాప్ర‌భుత్వాలే వ్య‌వ‌హ‌రిస్తూ హ‌క్కుల్ని కాల‌రాయ‌డం స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ హైకోర్టు కేసీఆర్ స‌ర్కార్‌కు వేసిన ప్ర‌శ్న‌…ఏపీ ప్ర‌భుత్వాన్ని ఉలికిపాటుకు గురి చేసేలా ఉండ‌డం గ‌మనార్హం. వాసాలమర్రిలో దళితబంధు అమలుపై హైకోర్టులో బుధ‌వారం విచారణకు వ‌చ్చింది. ఈ పిటిష‌న్‌పై చీఫ్ జ‌స్టిస్ హిమాకోహ్లి, జ‌స్టిస్ విజ‌య‌సేన్‌రెడ్డి ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. నిబంధ‌న‌లేవీ ఖ‌రారు చేయ‌కుండానే ద‌ళిత బంధుకు నిధులు విడుద‌ల చేయ‌డంపై పిటిష‌న్ వేసిన వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకెళ్లింది.

అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ప్రసాద్‌ స్పందిస్తూ.. రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ పథకం వర్తిస్తుందన్నారు. ఆ మేర‌కు ప్ర‌భుత్వం నిబంధనలు ఖరారు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయస్థానం జోక్యం చేసుకుంటూ పిటిషన్‌లో ఆ నిబంధనలను ఎందుకు జత చేయలేదని పిటిషనర్‌ను ప్రశ్నించింది. పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది శశికిరణ్‌ స్పందిస్తూ….పథక నిబంధనల జీవో ప్రభుత్వ వెబ్‌సైట్‌లో లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

ధ‌ర్మాస‌నం స్పందిస్తూ…  అస‌లు జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బంది ఏంటని నిల‌దీసింది. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచాల‌ని కేసీఆర్ స‌ర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, జీవో ఇచ్చిన 24 గంటల్లో వెబ్‌సైట్‌లో ఉంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.  

ఇటీవ‌ల జీవోల‌ను వెబ్‌సైట్‌లో ఉంచ‌కూడ‌ద‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆదేశించిన నేప‌థ్యంలో… తెలంగాణ హైకోర్టు ఆదేశాల‌పై ఏపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే రీతిలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి న్యాయ‌స్థానంలో మొట్టికాయ‌లు త‌ప్ప‌వ‌నే అభిప్రాయాలు సోష‌ల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే గోప్య‌త‌ను న్యాయ‌స్థానం ఎప్ప‌టికీ స‌హించ‌ద‌ని చెబుతున్నారు. అందుకే జీవోల విష‌య‌మై కేసీఆర్‌ను తెలంగాణ హైకోర్టు నిల‌దీస్తే… ఏపీ ప్ర‌భుత్వం భుజాలు త‌డుముకుంటుంద‌ని చెప్ప‌డం.