కొవాక్సిన్ టీకా వేయించుకున్న ఓ వ్యక్తికి ఉద్యోగం పోయింది. టీకాకు, ఉద్యోగానికి సంబంధం ఏంటని అనుకుంటున్నారా..? అవును, ఆ వ్యక్తి కొవిషీల్డ్ టీకా వేయించుకోకుండా కొవాక్సిన్ వేయించుకుని పొరపాటు చేశాడు. దీంతో సౌదీ అరేబియాకి వెళ్లడానికి అనుమతి లేదు, ఈ నెలలో వీసా టైమ్ కూడా తీరిపోవడంతో అతను ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది.
భారత్ బయోటెక్ తయారు చేసిన పూర్తి స్థాయి స్వదేశీ టీకా కొవాక్సిన్ కి ఇతర దేశాల్లో చాలా చోట్ల అనుమతి లేదు. సీరం సంస్థ మన దేశంలో పంపిణీ చేస్తున్న ఆక్స్ ఫర్డ్ తయారీ కొవిషీల్డ్ కి మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా.. అనేక ఇతర దేశాల్లో గుర్తింపు ఉంది. మరి భారత్ లో కొవాక్సిన్ తీసుకున్నవారు ఇతర దేశాలకు వెళ్లాలంటే వారి పరిస్థితి ఏంటి..? ఆయా దేశాలు సదరు టీకాకు అనుమతిచ్చే వరకు వేచి చూడాల్సిందేనా..? ఇలాంటి ఆసక్తికర చర్చ గతంలోనే మొదలైనా, ఇప్పుడది కోర్టు వరకు వెళ్లింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
కేరళలోని కన్నూర్ ప్రాంతానికి చెందిన గిరికుమార్ సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తుండేవాడు. సెకండ్ వేవ్ మొదలయ్యాక భారత్ కి తిరిగొచ్చాడు. ఈ క్రమంలో అతను కొవిన్ పోర్టల్ లో తన పేరు నమోదు చేసుకుని ఏప్రిల్ లో కొవాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాడు, ఆ తర్వాత సెకండ్ డోస్ కూడా పూర్తయింది. తీరా సౌదీ వెళ్లడానికి రెడీ అవుతున్న సందర్భంలో కొవాక్సిన్ కి సౌదీ గుర్తింపు లేదంటూ అతనికి అనుమతి నిరాకరించారు.
దీంతో అతను తనకు కొవిషీల్డ్ టీకా వేయాలంటూ వైద్య సిబ్బందిని సంప్రదించాడు. కొవిన్ యాప్ లో వివరాలన్నీ ఉండటంతో అతనికి కొవిషీల్డ్ టీకా వేయడం కుదరదని అధికారులు తేల్చి చెప్పారు. సౌదీ వెళ్లకపోతే తన ఉద్యోగం పోతుందని అతను కేరళ హైకోర్టుని ఆశ్రయించాడు. ఈ పంచాయితీ ఏంటో చూడండని హైకోర్టు కేంద్రానికి నోటీసులిచ్చింది.
కేంద్రం మాత్రం ఇలాంటి డబుల్ టీకా వ్యవహారాలు కుదరదని తేల్చి చెప్పింది. ఒక వ్యక్తికి రెండు డోసుల టీకా అనే నిబంధన మాత్రమే ప్రస్తుతానికి భారత్ లో అమలులో ఉందని, రెండు రకాల టీకాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పింది. మూడో డోస్ వేసేందుకు అంతర్జాతీయంగా ఎలాంటి మార్గదర్శకాలు లేవని, ఎక్స్ ట్రా డోస్ అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశముంందని దీనిపై ఇంకా ఎలాంటి అధ్యయనాలు జరగలేదని చెప్పింది.
గిరికుమార్ కి అవకాశమిస్తే, ఇంకా చాలామంది కోర్టుమెట్లెక్కుతారని, పిటిషనర్ వాదన పరిగణలోకి తీసుకోవద్దని కోర్టుకి తెలిపింది. దీంతో కోర్టు కూడా గిరికుమార్ పిటిషన్ కొట్టేసింది. ఇప్పుడతను సౌదీ వెళ్లలేని పరిస్థితిలో ఉద్యోగం కోల్పోయాడు.