సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఓపెన్ అయినప్పట్నుంచి వరుసపెట్టి చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మారిన పరిస్థితుల నేపథ్యంలో పెద్ద సినిమాలేవీ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈవారం కూడా చిన్న సినిమాలే థియేటర్లలోకి వస్తున్నాయి. గత వారంలానే ఈవారం కూడా 6 చిన్న సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి.
ఈసారి గురువారం 3 సినిమాలు, శుక్రవారం 3 సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. ముందుగా రేపు రిలీజ్ అవ్వబోతున్న సినిమాల విషయానికొస్తే.. రేపు రాజరాజ చోర, క్రేజీ అంకుల్స్, కనబడుట లేదు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో కాస్త అంచనాలున్న సినిమా రాజరాజ చోర మాత్రమే. శ్రీవిష్ణు, మేఘ ఆకాష్ జంటగా నటించిన ఈ సినిమాలో నవ్వులు గ్యారెంటీ అంటున్నారు.
దీంతో పాటు క్రేజీ అంకుల్స్, కనబడుట లేదు అనే మరో రెండు సినిమాలు కూడా వస్తున్నాయి. మనో, శ్రీముఖి, రాజారవీంద్ర లాంటి నటీనటులతో క్రేజీ అంకుల్స్ తెరకెక్కగా.. సునీల్ కీలక పాత్రతో ''కనబడుటలేదు'' అనే సినిమా వస్తోంది. వీటిపై ఎవ్వరికీ పెద్దగా అంచనాల్లేవ్.
ఇక శుక్రవారం రోజున బజార్ రౌడీ, అవలంబిక, చేరువైన దూరమైన అనే మరో 3 చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో సంపూర్ణేష్ బాబు నటించిన సినిమా బజార్ రౌడీ. ఈసారి సంపూర్ణేష్ బాబు కామెడీని కాస్త పక్కనపెట్టి సీరియస్ గా చేసిన సినిమా బజార్ రౌడీ.
ఇలా ఈ శుక్రవారం 6 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. గతవారం విడుదలైన పాగల్ సినిమా సూపర్ హిట్ అంటూ యూనిట్ చెప్పుకుంటున్నప్పటికీ దాని ప్రభావం ఎక్కడా లేదు. మరి ఈవారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఏదైనా క్లిక్ అవుతుందేమో చూడాలి.