ఒకప్పుడు టీడీపీ అంటే కమ్మలు, కమ్మలు అంటే టీడీపీ. అలా సాగింది వాళ్ల అవినాభావ బంధం. జగన్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో, బాబు అసలు రంగు ఏంటనేది కమ్మలకు పూర్తిగా తెలిసొచ్చింది. అవసరం తీరిన తర్వాత వాడుకుని వదిలేసే బాబు.. తన సామాజిక వర్గానికి కూడా అదే విధంగా హ్యాండ్ ఇచ్చారని, ఇస్తున్నారని వారు పూర్తిగా అర్థం చేసుకున్నారు.
అందులోనూ నందమూరి కుటుంబంపై చంద్రబాబుకి చిన్నచూపు ఉండటం ఆ సామాజిక వర్గానికి సరిగా రుచించని అంశం. కమ్మవారిలో నారావారి కుటుంబం కంటే, నందమూరి ఫ్యామిలీపైనే భక్తి ఉంది. అందుకే నందమూరిని దూరం పెట్టాక, నారావారికి క్రెడిబులిటీ బాగా తగ్గింది.
మరి కమ్మవారికి ప్రత్యామ్నాయం ఏంటి..?
ఎంతసేపు నారావారి వెన్నుపోటు భరించాలి, ఏపీలో కమ్మవారికి ఇప్పుడు ప్రత్యామ్నాయం కావాలి. ఎన్టీఆర్ గనక సొంత పార్టీ అంటూ వస్తే వారంతా అటువైపు తిరిగే అవకాశముంది. కానీ అదిప్పుడే సాధ్యం కాదు. పోనీ అధికార వైసీపీ వైపుకి వెళ్లాలంటే.. జగన్ పై ఆల్రడీ కమ్మ వ్యతిరేకి అనే ముద్ర ఉంది.
ఇటు బాబుకు మద్దతు ఇవ్వలేరు, మనసు చంపుకొని టీడీపీతోటే కొనసాగుదామన్నా కూడా లోకేష్ పై వాళ్లకు నమ్మకం లేదు. ఈ దశలో వారికి పవన్ కల్యాణ్ రూపంలో ఓ ఆప్షన్ కనిపిస్తోంది.
పవన్ కమ్మ కాదు, కాపు వర్గానికి చెందిన నేత. ఒకప్పుడు విజయవాడ కేంద్రంగా సాగిన కమ్మ వర్సెస్ కాపు రాజకీయాల లెక్కలు తీస్తే అస్సలు పవన్ ని వారు సపోర్ట్ చేయరు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అందులోనూ పవన్ కల్యాణ్ కి కమ్మలపై సాఫ్ట్ కార్నర్ ఉంది. ఒకే వర్గాన్ని టార్గెట్ చేస్తూ జగన్ అరాచకాలు చేస్తున్నారంటూ ఆమధ్య కమ్మలకు మద్దతుగా కూడా మాట్లాడారు. ఈ క్రమంలో ఏపీలో కమ్మలు పవన్ వైపు వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
నీది తెనాలి.. నాది తెనాలి..!
విచిత్రం ఏంటంటే.. పవన్ సన్నిహితుడు నాదెండ్ల మనోహర్ కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత అయినా, ఆయన క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ చేయలేరు. తన సొంత సామాజిక వర్గాన్ని కూడా జనసేన వైపు తీసుకు రాలేకపోతున్నారు నాదెండ్ల. కానీ పవన్ చరిష్మా మాత్రం కమ్మలను కూడా కలుపుకొనిపోగలదు.
పవన్ కాపు వర్గానికి చెందిన నాయకుడే అయినా, ఆయనపై నమ్మకం లేక ఇప్పటికే కాపుల్లో చాలామంది జనసేనను వీడారు. జగన్ కు జై కొట్టారు. ఈ టైమ్ లో కమ్మ వర్గాన్ని పవన్ దగ్గర తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అటు కొంత కాపులు, ఇటు కొంత కమ్మల మద్దతుతో 2024 నాటికి బలం పుంజుకోవచ్చనేది పవన్ ఆలోచనగా కనిపిస్తోంది.
ప్రస్తుతానికైతే మీడియాలో ఉన్న చాలామంది కమ్మలు, పవన్ పై సాఫ్ట్ కార్నర్ తోనే ఉన్నారు. పవన్ ఇదే స్ట్రాటజీతో కనుక ముందుకెళ్తే.. 2024 నాటికి చంద్రబాబు రాజకీయాల్ని కూడా ఆయన తట్టుకొని నిలబడగలరు.