అడ్డొచ్చిన వారిని చితక్కొట్టాల్సిందే…?

విశాఖ రాజధాని సెంటిమెంట్ బలపడుతోందా. తమకూ ఒక రాజసం కావాలని జనాలు కోరుకుంటున్నారా. దానికి నాయకులు కూడా తమదైన హాట్ హాట్ కామెంట్స్ తో వేడిని రగిలిస్తున్నారా ఏమో కానీ అమరావతి రైతుల పాదయాత్ర…

విశాఖ రాజధాని సెంటిమెంట్ బలపడుతోందా. తమకూ ఒక రాజసం కావాలని జనాలు కోరుకుంటున్నారా. దానికి నాయకులు కూడా తమదైన హాట్ హాట్ కామెంట్స్ తో వేడిని రగిలిస్తున్నారా ఏమో కానీ అమరావతి రైతుల పాదయాత్ర అరసవెల్లి వైపుగా లేకపోయినట్లైతే విశాఖ సహా ఉత్తరాంధ్రా టోటల్ గా సైలెంట్ గా ఉండేది.

కానీ ఇపుడు చూస్తే వాతావరణం వేడిని పెంచేదిగానే ఉంది. ఎక్కడో అమరావతి నుంచి రైతులు వచ్చి మీకు విశాఖ రాజధాని వద్దు, మాకు మాత్రమే రాజధాని కావాలి అంటూ పాదయాత్రతో వీధులలో కదం తొక్కితే సహజంగానే ఉద్రిక్తతలు ఉంటాయి. అయితే సామరస్యంగా ఉండాల్సిన చోట వివాదాలు వస్తే బాధ్యులు ఎవరు అన్నదే సందేహంగా కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే విశాఖను రాజధాని కాకుండా ఎవరు అడ్డుపడినా కూడా వారిని రాజకీయంగా మళ్ళీ లేవకుండా చితక్కొట్టాల్సిందే అని సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటున్నారు. విశాఖ రాజధాని అయితే వెనకబడిన ఉత్తరాంధ్రా మొత్తం బాగుపడుతుంది అని ఆయన అంటున్నారు.

మా ఆశలు అణగదొక్కుతూ మా పీక కోసేందుకు అమరావతి నుంచి వచ్చి అరసవెల్లి దాకా వెళ్తారా అని మంత్రి పాదయాత్రికులను సూటిగా ప్రశ్నించారు. విశాఖ రాజధాని అని అంతా ఒకే ఒక గొంతుతో నినదించాలని, అది కనుక చేస్తే ఎవరు ఎక్కడ నుంచి పాదయాత్ర చేసుకున్నా ఉపయోగం ఉండదని ధర్మాన సూచించారు. విశాఖ రాజధాని కావాలని నిరసనలు త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని, విశాఖ మన రాజధాని అని అంతా ఎలుగెత్తి చాటాలని ఆయన సలహా ఇచ్చారు.

ధర్మాన రాజకీయంగా చితక్కొట్టాలి అన్న వ్యాఖ్యలు మాత్రం విపక్షాల గురించే అని అంటున్నారు. విపక్షాలు అన్నీ కూడా ఉత్తరాంధ్రా ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోకుండా అమరావతి మన రాజధాని అంటూ ఉన్న ఊరుని, ఉన్న వారినీ వంచిస్తున్నాయన్నదే వైసీపీ నేతల మనోగతంగా ఉంది అంటున్నారు. జనాలల్లో విశాఖ నినాదం బలపడితే ప్రత్యర్ధి పార్టీలకు రాజకీయ చితక్కొట్టుడు ఖాయమని అంటున్నారు.