మునుగోడు ఉప ఎన్నికకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు అయ్యారు. అయితే ముఖ్యమైన మూడు పార్టీల అభ్యర్థులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. మునుగోడులో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకుంది. మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
తెలంగాణ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ గట్టి పట్టుదలతో వుంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో రాజీనామా చేయించి, బీజేపీలో చేర్చుకుని బరిలో దింపింది. కాంగ్రెస్, బీజేపీలు ఎంతో ముందుగా అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తలపడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
దీంతో మూడు పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను నిలిపినట్టైంది. మునుగోడులో బీసీ సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని నిలపడంతో టీఆర్ఎస్ బీసీ వైపు చూస్తుందని అంతా భావించారు. కానీ బీసీ వైపు టీఆర్ఎస్ కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
మొత్తానికి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు రెడ్డి సామాజికవర్గం వైపు చూడడం చర్చనీయాంశమైంది. ఏ రెడ్డి నేత గెలుస్తారో తెలియాలంటే వచ్చే నెల వరకూ ఆగాల్సిందే.