మణిరత్నం సినిమా కాబట్టి పొన్నియన్‌సెల్వన్ చూడాల్సి వచ్చింది. మణిరత్నం గొప్ప దర్శకుల్లో ఒకరు. కథ చెప్పడంలో ఆయనకో పద్ధతి వుంది. సరళ రేఖ మార్గం (లీనియర్). జిగ్‌జాగ్‌గా (నాన్ లీనియర్) చెప్పడం వుండదు. నూలుపోగు లాంటి కథనం తప్ప, సాలెగూడు అల్లిక వుండదు. అనగనగా ఒక రాజులా చందమామ కథ తరహాలో చెబుతాడు. గజిని టైప్‌లో ప్లాష్ బ్యాక్‌లుండవు. మౌనరాగంలో తప్పదు కాబట్టి హీరోయిన్‌కి ప్లాష్‌బ్యాక్. ఒకటోరెండో తప్ప అన్నీ స్ట్రెయిట్ నెరేషన్.
గీతాంజలిలో నాగార్జునకి క్యాన్సర్ అని ఫస్టే తెలిసిపోతుంది. ఘర్షణలో సవతి పిల్లల కథగా మొదటి 15 నిమిషాల్లోనే అర్థమైపోతుంది. నాయకుడులో బాల్యం నుంచి మరణం వరకూ హీరో జర్నీ. బొంబాయిలో మతకలహాల్లో ఇరుక్కున్న హీరో దగ్గరి నుంచి మొదలు పెట్టి ప్లాష్‌బ్యాక్ టెక్నిక్‌తో కథ చెప్పొచ్చు. కానీ అలాంటి తలనొప్పి పెట్టుకోడు. హీరో ఊరికి వస్తాడు, సైరాభానుని చూస్తాడు. ఇద్దరి మధ్య ప్రేమ. పెద్దలు ఒప్పుకోరు. బొంబాయి వెళ్లి పెళ్లి చేసుకుంటారు. ఇద్దరు పిల్లలు. మతకలహాలొస్తాయి. వినడానికి ఇది సాదాసీదా లైన్. కానీ మణిరత్నం చేతిలో విజువల్ వండర్. రోజా కూడా అంతే.
స్క్రీన్‌ప్లేలో మాస్టర్‌గా పేరుగాంచిన మణిరత్నం పొన్నియన్‌సెల్వన్‌లో తడబడ్డాడు. డిగ్రీలో జూలియస్ సీజర్ నాటకం వుండేది. సుమంత్ అనే లెక్చరర్ టీచ్ చేసేవాడు. ఆయనకి షేక్‌స్పియర్, సీజర్ కంఠస్తం వచ్చు. ఆయనకి బాగా పరిచయమైన పాత్రలు మాకు అపరిచితం. సీజర్, కాషియస్, ఆంటోని పేర్లే తెలియవు. ఆయన తన స్టాండర్డ్‌లో పాఠం చెబితే, మాకు అర్థమై, కానట్టు వుండేది. పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడమే నిజమైన విద్య.
పొన్నియన్, మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్. చాలా ఏళ్లుగా ఆయన స్టడీ చేసాడు. పాత్రలన్నీ సుపరిచితమై వుంటాయి. తమిళులకి బాగా నచ్చడానికి ఇదే కారణం కావచ్చు. పైగా తమిళులకి తమ సంస్కృతి, చరిత్ర అంటే ఆరాధన. అయితే తెలుగు ప్రేక్షకులకి ఈ కథ కొత్త. మన బొబ్బిలి యుద్ధం, విశ్వనాథ నాయకుడు చూపిస్తే తమిళులకి ఏ రకంగా అర్థం కాదో, మన పరిస్థితి కూడా ఇదే.
నవలలో ఏముందో, నవలని మార్చడం ఇష్టం లేక ఆ రకంగా తీశాడో మనకు తెలియదు. కథ చెప్పిన పద్ధతిలోనే చాలా తికమక వుంది. బాహుబలి, ప్రభాస్ కథ. అతని తర్వాత అన్ని పాత్రలు పరిచయమై క్లారిటీ వస్తుంది. పార్ట్-2 కట్టప్ప యాంగిల్‌లో చెప్పినా, అప్పటికే మనకి అందరూ తెలుసుకాబట్టి కన్ఫ్యూజన్ లేదు. అది కాకుండా కట్టప్పనే మెయిన్ చేసి పార్ట్-1 చెబితే బుర్ర తిరిగేది. అరవిందసమేతలో సునీల్ కథ చెబుతాడు. అయితే అది ఎన్టీఆర్ కథ. సునీలే కథలో దూరి హీరోని డ్రైవ్ చేస్తే కంగాళి అయ్యేది. కథలోకి సునీల్ వస్తాడు తప్ప, అది సునీల్ కథ కాదు.
పొన్నియన్‌ని కూడా మణిరత్నం తన స్టైల్‌లో సుందర చోళుడితో (ప్రకాశ్‌రాజ్) ప్రారంభించి ఆయనకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు అని పరిచయం చేసి కుట్రలు జరుగుతున్న సీన్ ఎస్టాబ్లిష్ చేస్తే చరిత్ర తెలియకపోయినా అర్థమయ్యేది.
కథా నాయకుడే సగం సినిమా తర్వాత వస్తాడు. పైగా పొన్నియన్ ప్రజలకి ఎందుకు ప్రీతిపాత్రుడయ్యాడో మనకి తెలియదు. ఐశ్వర్యరాయ్‌కి, త్రిషకి సంఘర్షణ వుందని తెలియడానికి బోలెడు టైం పడుతుంది.
ఆదిత్య కరికాలుడుకి (విక్రమ్) స్నేహితుడు, ఒక దూత, గూడాచారి లాంటి వల్లవరాయ (కార్తి) పాయింట్ ఆఫ్ వ్యూతో మొత్తం కథ నడుస్తుంది. అపుడు ఈ సినిమా పేరు వల్లవరాయ అవుతుంది తప్ప పొన్నియన్ సెల్వన్ కాదు. ఇతర భాషల్లో ఆడకపోవడానికి ఈ కథ సెకెండాఫ్‌లో కానీ అర్థం కాదు. అప్పటికి జనం ఉస్సూరమని వాట్సప్, ఫేస్‌బుక్‌లలోకి వెళ్లిపోతారు. కొంత మంది సగంలోనే జారుకున్నారు. సెకెండాఫ్‌లో యుద్ధ సన్నివేశాలతో పాటు, విజువల్ వండర్స్ ఎన్ని ఉన్నా బోర్ కొట్టడానికి కారణం కథ కనెక్ట్ అయ్యేలా చెప్పకపోవడం. స్క్రీన్‌ప్లే తప్పిదం.
ఒక అపరిచిత కథని కూడా చెప్పి మెప్పించడమే సినిమా ప్రాథమిక లక్షణం. సావిత్రి సినిమాలు చూడని వాళ్లకి కూడా మహానటి నచ్చుతుంది. ఇరాన్ రాజకీయ పరిస్థితులు తెలియకపోయినా వాళ్లు తీసే పిల్లల సినిమాలు అర్థమవుతాయి. మణిరత్నం గొప్ప దర్శకుడే. బహుశా తమిళ ప్రేక్షకులనే దృష్టిలో పెట్టుకుని తీసినట్టున్నాడు. అయితే ఆయన పేరు చూసి తెలుగులో ఈ సినిమా చూసిన వాళ్లకి బుర్ర గోక్కునే పని కల్పించారు.
పార్ట్-2లో తికమక వుండకపోవచ్చు. అయితే దాన్ని చూడాలని తెలుగు ప్రేక్షకులకి ఆసక్తి వుండకపోవచ్చు. చిరంజీవి వాయిస్ వోవర్‌తో సినిమా ప్రారంభమైనా, సాహోలో వాయిస్ వోవర్ ఉన్నా, ఎవరెవరో తెలియక తికమకపడినట్టు, దీంట్లో కూడా అదే. ఏదో అడిగితే చెప్పి వుంటాడు కానీ, చిరంజీవికి కూడా ఎవరికెవరు ఏమవుతారో తెలిసే అవకాశం లేదు.
ఇక మధ్యలో కొన్ని క్షణాలు కనిపించే నాజర్ ఎవరో, ఆయనకి ఐశ్వర్యరాయ్‌కి సంబంధం ఏమిటో చెప్పిన వాళ్లకి పార్ట్-2 టికెట్లు ఉచితం.
జీఆర్ మహర్షి