మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు రోజురోజుకూ వేగం పుంజుకుంటోంది. దర్యాప్తు 73వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో వైఎస్ కుటుంబ సభ్యుల్ని పిలిపించి విచారించడం ఆసక్తి పరిణామంగా చెప్పుకోవచ్చు.
ఈ నేపథ్యంలో కడపలో సీబీఐ అధికారులను బుధవారం వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే సీబీఐ అధికారులే ఆమెను పిలిపించారా? లేక తనకు తానుగా వెళ్లారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పులివెందుల ఆర్అండ్‌బీ అతిథిగృహంలో చేపట్టిన సీబీఐ విచారణకు వరుసగా రెండోరోజు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఆయన సోదరుడైన పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి హాజరయ్యారు. వైఎస్ వివేకా కూతురు హైకోర్టుకు సమర్పించిన అనుమానితుల జాబితాలో వీళ్లిద్దరి పేర్లు ఉండడం గమనార్హం.
గతంలో వైఎస్ వివేకానందరెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయేందుకు… మనోహర్‌రెడ్డి తదితరులు కారణమనే ఆరోపణలు అప్పట్లో గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న వైఎస్ భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డిల నుంచి రాబట్టిన సమాచారంపై ఏదైనా క్లారిటీ కోసం డాక్టర్ సునీతను సీబీఐ అధికారులు పిలిపించి మాట్లాడారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎందుకంటే రెండోరోజు కూడా వాళ్లిద్దరినీ విచారిస్తున్న నేపథ్యంలో సునీత నుంచి మరింత సమాచారం రాబట్టారనే ప్రచారం జరుగుతోంది. కుటుంబ గొడవలే హత్యకు కారణాలై ఉంటాయా? అనే కోణంలో సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది. దీంతో వైఎస్ భాస్కర్‌రెడ్డి – మనోహర్‌రెడ్డిలతో వివేకాకు గొడవలేంటి? ఆర్థికపరమైనవా లేక రాజకీయ సంబంధమైనవా? అనే కోణంలో ఇరువైపుల నుంచి సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వైఎస్ కుటుంబ సభ్యుల్ని విచారిస్తుండడంతో కడప జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.