సినిమా విడుదల అనగానే హీరో,హీరోయిన్లు, డైరక్టర్ ఇలా చాలా మంది హుషారుగా ముందుకు వచ్చి ప్రచారం సాగిస్తారు. ప్రెస్ మీట్ లు పెడతారు. హడావుడి చేస్తారు. కానీ ఎప్పుడన్నా సినిమా నిర్మాతతో కానీ, డైరక్టర్ తో కానీ తేడా వచ్చినా, హీరోలు, హీరోయిన్లు ప్రమోషన్ కు మొహం చాటేస్తారు. అయితే వీలు కుదరలేదనో, మరోటనో సాకు చెబుతారు.
ఈవారం విడుదలవుతున్న సినిమాల్లో 'కనబడుటలేదు' అనే చిన్న సినిమా ఒకటి వుంది. కమెడియన్ కమ్ హీరో సునీల్ నటించిన థ్రిల్లర్ ఇది. స్పార్క్ ఓటిటి సంస్థ నిర్మించిన ఈ సినిమా కు పోటీగా క్రేజీ అంకుల్స్, రాజరాజ చోర సినిమాలు ప్రచారంలో చాలా ముందున్నాయి.
క్రేజీ అంకుల్స్ సినిమా పబ్లిసిటీ విషయంలో చాలా కీలకంగా వుంది. అలాగే రాజరాజచోర కూడా. ఈ రెండు సినిమాల్లో కీలకమైన పాత్రలు ధరిస్తున్న వారంతా ప్రచారానికి విపరీతంగా సహకరిస్తున్నారు. కానీ కనబడుటలేదు సినిమాకు మాత్రం ప్రచారం అంతగా కనిపించడం లేదు.
ముఖ్యంగా ఈ సినిమాకు జనాలు ఎవరైనా వస్తారు అంటే అది సునీల్ ను చూసి. కానీ ఆయనే ప్రచారానికి దూరంగా వున్నారు. గోవాలో వేరే షూటింగ్ లో బిజీగా వున్నారు. దాంతో పాపం ఈ సినిమా పోటీలో బాగా వెనుకబడింది.