తిరుపతి ప్లైఓవర్ పేరు మార్పుపై ఉన్న శ్రద్ధ, దాన్ని పూర్తి చేయడంలో జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడింది. దీంతో తిరుపతి నగర వాసులతో పాటు తిరుమలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. తిరుపతి స్మార్ట్ సిటీ, టీటీడీ సంయుక్త ఆధ్వర్యంలో 2018లో తిరుపతిలో వారధి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి. తిరుచానూరు మార్కెట్ యార్డు నుంచి కపిలతీర్థం వరకు 7 కి.మీ పొడవుతో ప్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనికి రూ.684 కోట్ల బడ్జెట్తో రూపకల్పన చేశారు.
భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ ప్లైఓవర్ నిర్మాణం ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లైఓవర్ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కొంతకాలం పాటు నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఒకవైపు ఎక్కడికక్కడ గుంతలు తీసి ఉండడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తడంతో తిరిగి ప్లైఓవర్ నిర్మాణానికి మోక్షం కలిగింది.
అయితే నిర్మాణ పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. తగినన్ని నిధులు మంజూరు కాకపోవడంతోనే పనుల్లో వేగం బాగా తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి టీటీడీ నుంచి సుమారు రూ.400 కోట్లు విడుదల కావాల్సి ఉందని సమాచారం.
కారణాలు తెలియదు కానీ నిధుల మంజూరుకు టీటీడీ తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో మళ్లీ విమర్శలు తప్పడం లేదు. మరో వైపు ఈ ప్లైఓవర్ నిర్మాణానికి ప్రాచుర్యంలో ఉన్న గరుడ వారధి అనే పేరుకు బదులు శ్రీనివాసు సేతు అని మార్చారు.
పేరు మార్పుపై ఉన్న శ్రద్ధ ఈ ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై లేదెందుకని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. కేవలం టీటీడీ నిధులు మంజూరు చేయకపోవడం వల్లే నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయిందనే విమర్శలున్నాయి. తమ గోడు ఆ ఏడుకొండలపై కొలువైన శ్రీనివాసుడే ఆలకించాలని భక్తులు, తిరుపతి నగర వాసులు వేడుకుంటున్నారు.