అన్ లాకింగ్ : పుంజుకుంటున్న పోల‌వ‌రం ప‌నులు

బృహ‌త్త‌ర సాగునీటి ప్రాజెక్టు పోల‌వ‌రం ప‌నుల‌కు కూడా క‌రోనా దెబ్బ త‌ప్ప‌లేదు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో ఉత్త‌రాది వ‌ల‌స కార్మికుల శ్ర‌మ కూడా అతి కీల‌క‌మైన అంశం. భారీ యంత్రాల‌తోనే ఈ త‌ర‌హా ప్రాజెక్టుల…

బృహ‌త్త‌ర సాగునీటి ప్రాజెక్టు పోల‌వ‌రం ప‌నుల‌కు కూడా క‌రోనా దెబ్బ త‌ప్ప‌లేదు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో ఉత్త‌రాది వ‌ల‌స కార్మికుల శ్ర‌మ కూడా అతి కీల‌క‌మైన అంశం. భారీ యంత్రాల‌తోనే ఈ త‌ర‌హా ప్రాజెక్టుల నిర్మాణం సాగినా, శ్రామికుల స‌త్తువ కూడా అత్యంత కీల‌కం. ఈ క్ర‌మంలో క‌రోనా నేప‌థ్యంలో పనులు కొంత వ‌ర‌కూ ఆగిపోవ‌డం, ఉత్త‌రాది వ‌ల‌స కార్మికులు సొంతూళ్ల‌కు వెళ్ల‌డానికి ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో కాంట్రాక్టర్లే వాళ్ల‌ను సొంతూళ్ల‌కు చేర్చే ఏర్పాట్లు చేశారు.  

ఇక లాక్ డౌన్ మిన‌హాయింపులు మొద‌ల‌య్యాకా ఇప్పుడు పోల‌వ‌రం ప‌నులు మ‌ళ్లీ ఊపందుకుంటున్న‌ట్టుగా తెలుస్తోంది. అనుకున్న స‌మ‌యానికి పోల‌వ‌రం ప‌నులు పూర్త‌య్యే దిశ‌గా కార్యాచ‌ర‌ణ సాగుతూ ఉంద‌ని స‌మాచారం. కార్మికులు కొంద‌రిని ర‌ప్పించ‌డం, ఉన్న వారికి వైద్య ప‌రీక్ష‌లు చేయించి, ఆరోగ్య‌వంతంగా ఉన్న వారి చేత ప‌నులు చేయించ‌డం ద్వారా పోల‌వ‌రం నిర్మాణం మ‌ళ్లీ ఊపందుకుంటూ ఉంది.

ప్ర‌ధానంగా లాక్ డౌన్ స‌మ‌యంలో కూడా కొంత వ‌ర‌కూ ప‌నులు సాగాయని తెలుస్తోంది. స్పిల్ వే, స్పిల్ చాన‌ల్, జ‌ల‌విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రం ప‌నులు గ‌ణ‌నీయంగా సాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే వ‌ల‌స కూలీలు తిరిగి రావ‌డం కూడా మొద‌లైంద‌ని, రానున్న వారం నుంచి ప‌నులు మ‌రింత‌గా ఊపందుకుంటాయ‌ని స‌మాచారం. 

బ‌హుళార్థ సాధ‌క ప్రాజెక్టు అయిన పోల‌వ‌రం లో జ‌ల‌విద్యుత్ ఉత్ప‌త్తి కీల‌క‌మైన అంశం. భారీ క‌ప్లింగ్ ట‌ర్భైన్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అందుకు సంబంధించి ప్ర‌స్తుతం మ‌ట్టిప‌నులు సాగుతున్నాయి. ఇక స్పిల్ వే ద్వారా పోల‌వ‌రం చ‌రిత్ర‌కు ఎక్క‌నుంది. ప్ర‌పంచంలోనే అతి పెద్దదిగా పేరున్న త్రీ గోర్జెస్ స్పిల్ వే ద్వారా ఒకే సారి 47 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని వద‌ల‌వ‌చ్చు. పోల‌వ‌రం స్పిల్ వే 50 ల‌క్ష‌ల క్యూసెక్కుల సామ‌ర్థ్యంతో నిర్మితం అవుతోంది. ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజ్ ద‌గ్గ‌ర 30 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద నీటిని విడుద‌ల చేయ‌వ‌చ్చు. పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి అయితే.. ప్ర‌పంచంలోనే ప్ర‌ముఖ‌మైన బ‌హుళార్థ‌క సాధ‌క ప్రాజెక్టుగా నిలుస్తుంది. ఆంధ్రుల ఆశ‌లు చాలా వ‌ర‌కూ ఈ ప్రాజెక్టు మీదే ఉన్నాయి.  ఈ ప్రాజెక్టును స‌కాలంలో పూర్తి చేస్తే జ‌గ‌న్ ప్ర‌భుత్వం కూడా చ‌రిత్ర‌కు ఎక్కుతుంది.

తమ్ముడు అలా.. అన్న ఇలా

జన్వాడ ఫామ్ హౌస్ రహస్యాలు