ఆవేశంలో ఏదో చెప్పడం, ఆ వెంటనే మాట మార్చడం బండ్ల గణేశ్ స్టయిల్. తెలంగాణ ఎన్నికల సమయంలో ఆయన క్రియేట్ చేసిన ''సెవెన్ ఓ క్లాక్'' బ్లేడ్ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో బండ్ల ఏదో చెప్పి ఏదో చేసి కామెడీ పుట్టించేవారు. ఇప్పుడు మరోసారి అలాంటి వ్యవహారమే చేసి నవ్వుల పాలయ్యారు బండ్ల గణేశ్.
“త్వరలోనే ట్విట్టర్ కు గుడ్ బై చెప్పేస్తా, ఇకపై ఎలాంటి వివాదాలొద్దు, నా జీవితంలో నేను వివాదాలు కోరుకోవడం లేదు” సరిగ్గా 3 రోజుల కిందట బండ్ల పెట్టిన పోస్ట్ ఇది. చూడ్డానికి ఇది చాలా సీరియస్ ట్వీట్. ఆయన నిజంగానే ట్విట్టర్ నుంచి వైదొలుగుతారేమో అనిపించేలా ఉంది. అయితే ఎప్పట్లానే బండ్ల తూచ్ అనేశారు.
సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండమని ఎవరో జర్నలిస్ట్ బండ్ల గణేశ్ కు చెప్పారట. ఆ విలువైన సలహాను గౌరవంగా భావించి ట్విట్టర్ లోనే కొనసాగుతారట బండ్ల. ఇదీ తాజాగా ఆయన పేల్చిన కామెడీ తూట. ఇంతోటి దానికి 3 రోజుల కిందట అంత పెద్ద స్టేట్ మెంట్ ఇవ్వడం ఎందుకంటూ సోషల్ మీడియాలో అతడిపై సెటైర్లు పేలుతున్నాయి. ''ఇందుకే కదా బండ్ల నిన్ను అంతా కామెడీ అనేదంటూ'' వ్యంగ్యంగా పోస్టులు పడుతున్నాయి.
బండ్ల మాత్రం ఈ కామెంట్లను పట్టించుకోలేదు. ఎప్పట్లానే తన భజన షురూ చేశారు. తన దేవర పవన్ కల్యాణ్ అంటూ పోస్టులతో హోరెత్తిస్తున్నారు.