వైసీపీ హయాంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. దిశ చట్టం అంటూ ప్రభుత్వం మోసం చేస్తోంది, దిశ యాప్ తో ప్రయోజనం లేదంటూ టీడీపీ గురివిందలు ఎగిరెగిరి పడుతున్నారు. నారా లోకేష్ అయితే ఏకంగా శవరాజకీయాలకు పేటెంట్ తెచ్చుకున్నారు. ఎక్కడ ఏ కారణంతో ఎవరు చనిపోయినా ఎగురుకుంటూ వెళ్లి వారిని పరామర్శించి రాజకీయం చేసి వస్తున్నారు. మీ కష్టాలకు ప్రభుత్వమే కారణం, మీ కన్నీళ్లకు జగన్ దే బాధ్యత అంటూ లేనిపోని అభాండాలు వేస్తున్నారు.
ఎక్కడ ఏ లవర్ కి కోపమొచ్చినా జగనే కారణం, ఏ ఫ్యాక్షన్ హత్య జరిగినా దానికి జగనే బాధ్యుడు, ఏ ఊరిలో రెండు వర్గాల మధ్య తగాదా జరిగినా జగన్ దే నేరం అన్నట్టుగా మాట్లాడుతున్నారు లోకేష్. పోనీ జగన్ అధికారంలో ఉన్నారు కాబట్టి, ఆయన హయాంలో జరిగిన వాటన్నిటికీ ఆయనదే బాధ్యత అనుకుందాం. మరి చంద్రబాబు హయాంలో జరిగిన వాటి సంగతేంటి..?
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాది నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. అప్పట్లో ఆ కేసుని హైలెట్ కాకుండా చేయడానికి టీడీపీ అనుకూల మీడియా ఎన్ని ప్రయత్నాలు చేసిందో అందరికీ తెలుసు. చివరికి ఆ అమ్మాయిపైనే తప్పునెట్టేశారు కానీ కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక్క మంత్రి కూడా వెళ్లలేదు. ఆనాడు ఈ లోకేష్ ఏం చేస్తున్నట్టు..? ఎక్కడున్నట్టు..?
బద్వేలులో ఉషారాణి అనే ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటే పూర్తి స్థాయిలో విచారణ జరగలేదు సరికదా.. ర్యాగింగ్ భూతం అంటూ ఆ కేసుని మూసేశారు. అప్పట్లో కాలేజీ యాజమాన్యానికి టీడీపీ ప్రభుత్వం సపోర్ట్ చేసిందని, వారిపై కేసు లేకుండా చేసిందనే ఆరోపణలు వచ్చాయి. అప్పుడు కూడా మన చినబాబు మౌనవ్రతంలో ఉన్నారు.
2017లో కర్నూలులో ఓ రాజకీయ నాయకుడికి చెందిన రెసిడెన్షియల్ స్కూల్ లో సుగాలి ప్రీతి అనే 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు కేసు నమోదైంది. అయితే అది ఆత్మహత్య కాదు, రేప్ అండ్ మర్డర్ అంటూ ప్రీతి తల్లిదండ్రులు ఆరోపించారు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ తో సదరు రెసిడెన్షియల్ స్కూల్ యజమాని కొడుకుపై కేసు నమోదైంది. జైలుకెళ్లినవారు బెయిల్ పై బయట తిరుగుతున్నారు కూడా.
రమ్య హత్య జరిగాక మరుసటి రోజే అక్కడ వాలిపోయిన లోకేష్.. సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఇంతవరకు ఎందుకు పరామర్శించలేదనేదే అంతు చిక్కని ప్రశ్న.
అప్పుడు లేవని నోళ్లు, ఇప్పుడే ఎందుకు లేస్తున్నాయి. శవ రాజకీయాలకు ఎందుకు వెళ్తున్నాయి. అసలు కారణాలు పక్కనపెట్టి, ప్రభుత్వాన్ని ఎందుకు నిందిస్తున్నాయి. ఇవి అధికార పక్షం అడుగుతున్న ప్రశ్నలు కాదు, సోషల్ మీడియా గొంతెత్తి నినదిస్తోంది. మీ హయాంలో చనిపోయిన ఆడపిల్లల కుటుంబాలను ఎప్పుడు పరామర్శించవు లోకేష్ అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మరి లోకేష్ దగ్గర ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా..?