చచ్చిన కాంగ్రెస్‌కి చికిత్సా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి అంత్య‌క్రియలు జ‌రిగి చాలా కాల‌మైంది. ఈ విష‌యం తెలిసినా తెలియ‌న‌ట్టు వృద్ధ కాంగ్రెస్ నాయ‌కులు దింపుడు క‌ళ్లం ఆశ ప్ర‌ద‌ర్శిస్తున్నారు. క‌నీసం కోమాలో వున్నా బ‌త‌క‌డానికి ఐదు శాతం అవ‌కాశాలుంటాయి.…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి అంత్య‌క్రియలు జ‌రిగి చాలా కాల‌మైంది. ఈ విష‌యం తెలిసినా తెలియ‌న‌ట్టు వృద్ధ కాంగ్రెస్ నాయ‌కులు దింపుడు క‌ళ్లం ఆశ ప్ర‌ద‌ర్శిస్తున్నారు. క‌నీసం కోమాలో వున్నా బ‌త‌క‌డానికి ఐదు శాతం అవ‌కాశాలుంటాయి. అది కూడా లేదు. సోనియాగాంధీ అహంకారంతో పార్టీకి స‌మాధి జ‌రిగిపోయింది. శ‌ని, ఆదివారాల్లో (4, 5 తేదీలు) క‌డ‌ప‌లో జ‌రిగే చింత‌న్ స‌మావేశం ఒక కామెడీ.

తుల‌సిరెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌రిగే ఈ స‌భ‌కి న‌వ‌సంక‌ల్పం మేధోమ‌థ‌న స‌ద‌స్సు అని పేరు పెట్టారు. శైల‌జానాథ్ , కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, ర‌ఘువీరారెడ్డి, చింతా మోహ‌న్‌ల‌తో పాటు కేర‌ళ మాజీ ముఖ్య‌మంత్రి ఉమెన్‌చాందీ త‌దిత‌రులు హాజ‌ర‌వుతారు. రాష్ట్రంలోని ఒక్క నాయ‌కుడైనా ఎమ్మెల్యే కాదు క‌దా, వార్డ్ మెంబ‌ర్‌గా కూడా గెలిచే ప‌రిస్థితి లేదు.

ఎక్క‌డా కూడా డిపాజిట్లు రాని స్థితిలో ఈ స‌ద‌స్సు 6 అంశాల‌పై చ‌ర్చిస్తుంద‌ట‌. సంస్థాగ‌త నిర్మాణం, దేశ ఆర్థిక ప‌రిస్థితులు, వ్య‌వ‌సాయం, సామాజిక సాధికార‌త‌, యువ‌త మొద‌లైన అంశాలు చ‌ర్చించి తీర్మానాలు చేస్తారట‌. పాల్గొంటున్న నాయ‌కుల్లో ఒక్క‌రు కూడా యువ‌కులు లేరు. అయినా యువ‌త గురించి చ‌ర్చిస్తారు.

సంస్థాగ‌త నిర్మాణం గురించి మాట్లాడాలంటే ఎదురు డ‌బ్బులిచ్చినా పార్టీ కోసం ప‌ని చేసే కార్య‌క‌ర్త‌లు లేరు. ప్ర‌త్యేక హోదా, రాయ‌ల‌సీమ, ఉత్త‌రాంధ్ర‌ల‌కు ప్ర‌త్యేక ప్యాకేజీ డిమాండ్ల‌తో ఎన్నిక‌ల‌కు వెళ్తార‌ట‌. అధికారంలోకి వ‌స్తే వ్య‌వ‌సాయ రంగానికి ఏం చేయాలో చ‌ర్చిస్తార‌ట‌. జ‌బ‌ర్ద‌స్త్‌కి మించిన కామెడీ.

కాంగ్రెస్ కంచుకోట‌ని గంగ‌లో క‌లిపేశారు. ఇందిరాగాంధీకి వ్య‌తిరేకంగా ఓటు వేసిన‌పుడు కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్‌కి అండ‌గా నిల‌బ‌డింది. ఎన్టీఆర్ గాలిలో తాత్కాలికంగా కొట్టుకుపోయినా ఐదేళ్ల‌కే లేచి నిల‌బ‌డింది. చంద్ర‌బాబు ఎత్తుల్ని చిత్తు చేసింది. అలాంటి పార్టీకి ఈ గ‌తి ఎందుకు ప‌ట్టిందంటే జ‌గ‌న్‌ని త‌క్కువ అంచ‌నా వేయ‌డం వ‌ల్ల‌. 

త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే గెల‌వ‌లేని కిర‌ణ్‌కుమార్‌రెడ్డిని సీఎం చేసి జ‌గ‌న్‌ని జైళ్లో పెట్ట‌డం వ‌ల్ల‌. వృద్ధ నేత‌ల్ని న‌మ్మ‌డం వల్ల‌, ఢిల్లీలోని భ‌జ‌న బృందాల‌ను గుర్తించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌. దేశంలోని చాలా రాష్ట్రాల‌ను అహంభావంతో సోనియా గాంధీ పోగొట్టింది. 

రాష్ట్రంలో ఎలాగూ లేదు. దేశంలో కూడా కాంగ్రెస్ మ‌ళ్లీ వ‌స్తుంద‌ని ఆ పార్టీ నాయ‌కులే న‌మ్మ‌డం లేదు.

జీఆర్ మ‌హ‌ర్షి