ప్రేమ పెళ్లిళ్లకు ఆర్య సమాజ్ ప్రసిద్ధి. ఆర్యసమాజ్‌లో ఎంతో మంది ప్రముఖులు పెళ్లిళ్లు చేసుకున్నారు. యువతీయువకులు పేర్లు గోప్యంగా ఉంచుతారనే నమ్మకంతో ఆర్యసమాజ్‌కు వెళ్లడం సాధారణ విషయమైంది.
కుల, మతాంతర వివాహాలకు కుటుంబ సభ్యులు నిరాకరిస్తారనే భయం వున్న వాళ్లు ఆర్యసమాజ్‌ను ఆశ్రయించే వారిలో ఎక్కువ మంది ఉంటారు. ఈ నేపథ్యంలో ఆర్యసమాజ్ వివాహ సర్టిఫికెట్‌ను తాము గుర్తించలేమని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
ఆర్యసమాజ్ జారీ చేసిన వివాహ సర్టిఫికెట్‌ను గుర్తించడానికి జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. వివాహ సర్టిఫికెట్లను జారీ చేయడం ఆ సంస్థ పనికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.
తమ బిడ్డ మైనర్ అని, ఓ యువకుడు కిడ్నాప్ చేసి బలవంతంగా ఆర్యసమాజ్‌కు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆర్యసమాజ్ ఇచ్చిన సర్టిఫికెట్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టులో చూపి అమ్మాయి మేజర్ అని నమ్మించే ప్రయత్నం చేశారని పిటిషనర్ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
బాధిత కుటుంబం ఫిర్యాదుతో మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న యువకుడిపై ఆ రాష్ట్రంలో కేసు నమోదైంది. విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహ ధ్రువీకరణ పత్రాన్ని సమర్థులైన అధికారులు జారీ చేస్తారని ధర్మాసనం పేర్కొంది.
వివాహ సర్టిఫికెట్లను జారీ చేసే అధికార పరిధి ఆర్యసమాజ్‌కు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అది వాళ్ల పని కూడా కాదని తేల్చి చెప్పింది. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును కొట్టేసింది.