రానున్నది ఎన్నికల సీజన్. దీంతో ప్రతి రాజకీయ పార్టీ అప్రమత్తంగా మెలగాల్సిన అవసరం వుంది. ఏ మాత్రం తప్పులో కాలేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది. ముఖ్యంగా శత్రువులెవరో, మిత్రులెవరో గుర్తించాల్సి వుంటుంది. ఈ విషయంలో జనసేన తన అమాయకత్వం, అజ్ఞానం ఎప్పటికప్పుడూ బయట పెట్టుకుంటోంది. రాజకీయంగా జనసేన నష్టపోతే, అది ఆ పార్టీ నేతల స్వీయ తప్పిదాలే కారణమవుతాయి.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, టీడీపీ, జనసేన మధ్యే పోటీ. ఈ మూడు ప్రాంతీయ పార్టీలు కావడం విశేషం. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కేంద్రంలో బీజేపీ అధికారంలో వుండడం వల్ల ఆ పార్టీ గురించి చర్చ జరుగుతూ వుంటుంది. జనసేనతో బీజేపీకి పొత్తు వుంది. రాజకీయాల్లో మిత్రులు కానివారెవరైనా ప్రత్యర్థులే. అదేంటోగానీ ఈ చిన్న లాజిక్‌ని జనసేనాని పవన్‌కల్యాణ్, ఆయన తమ్ముడు నాగబాబు ఎలా మిస్ అయ్యారో అర్థం కాదు.
ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న నాగబాబు తమకు వైసీపీనే శత్రువని ప్రకటించారు. కనిపించే శత్రువు ఎవరో తెలిస్తే ప్రమాదం లేదు. కానీ కనిపించని శత్రువు గురించి జనసేన ఆలోచిస్తున్నట్టు లేదు. పైకి మాట్లాడేవన్నీ నిజాలే అని జనసేన నేతలు నమ్ముతున్నట్టు వారి వ్యవహార శైలి తెలియజేస్తోంది. శనివారం మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. పవన్‌కల్యాణ్ అధ్యక్షతన సమావేశం జరగనుంది.
రాష్ట్రంలో శాంతిభద్రతలు, జనసేన కార్యకర్తలపై కేసులు, కౌలు రైతు భరోసా యాత్ర తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే కొన్ని తీర్మానాలను కూడా ఆమోదించే అవకాశాలున్నాయని సమాచారం. ఈ సమావేశం పవన్ తెలివితేటలకు అగ్ని పరీక్ష అని చెప్పక తప్పదు. ఎందుకంటే జనసేన పాలిట జగన్ ఎంత శత్రువో, అంతకంటే ఎక్కువగా చంద్రబాబు కూడా ప్రమాదకారే అని గుర్తిస్తున్నట్టు లేదు.
జనసేనతో పొత్తు వుంటుందనే సంకేతాల్ని చంద్రబాబు వ్యూహాత్మకంగా పంపారు. దీని వెనుక పెద్ద కుట్రే వుందని తెలుస్తోంది. టీడీపీలో అసమ్మతివాదులు, టికెట్ రాదనే అపనమ్మకం వున్న వాళ్లు, ఇతరత్రా కారణాలతో వైసీపీని కాకుండా ప్రత్యామ్నాయంగా జనసేనను ఎంచుకోవాలని ఆలోచిస్తున్న వాళ్లకు పొత్తు పేరుతో చంద్రబాబు అడ్డంకి సృష్టించారనే ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ జనసేనలోకి వెళ్లినా, టీడీపీ పొత్తు కుదుర్చుకుంటే అక్కడికెళ్లినా మళ్లీ ఇబ్బందులు తప్పవనే భయం పవన్ వైపు వెళ్లాలనే ఆలోచనలకు కళ్లెం వేస్తోందని టీడీపీలోని అసంతృప్తవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది జనసేన ఎదుగుదలకు అడ్డంకే. ఇలాంటివి పవన్‌కల్యాణ్ గుర్తించి, చక్కదిద్దుకుంటారా? లేక జగన్‌పై గుడ్డి ద్వేషంతో తనను తాను బలిపెట్టుకుంటారా? అనేది మంగళగిరి కీలక సమావేశం తేల్చనుంది.