బీజేపీకి దొరికాడో ర‌ఘురామ‌

వైసీపీకే కాదు, కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి కూడా ఓ ర‌ఘురాముడు దొరికాడు. బీజేపీకి షాక్ మీద షాక్ ఇస్తున్నాడా ఎంపీ. రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వైఖ‌రితో మాన‌సికంగా వైసీపీ ఎంత ఆవేద‌న చెందుతున్న‌దో,…

వైసీపీకే కాదు, కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి కూడా ఓ ర‌ఘురాముడు దొరికాడు. బీజేపీకి షాక్ మీద షాక్ ఇస్తున్నాడా ఎంపీ. రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వైఖ‌రితో మాన‌సికంగా వైసీపీ ఎంత ఆవేద‌న చెందుతున్న‌దో, ఆ బాధేంటో బీజేపీకి తెలిసొచ్చేలా సొంత పార్టీ ఎంపీ తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అయితే బీజేపీపై ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్న నాయ‌కుడు చిల్ల‌ర నేత కాక‌పోవ‌డం విశేషం. కొంత మంది రెబ‌ల్స్ ప్ర‌జాప్ర‌తినిధుల్లా నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడ్డం కాకుండా, నిర్మాణాత్మ‌క విమ‌ర్శ‌లు చేయ‌డంలో స్వామిది ఓ ప్ర‌త్యేక పంథా.

ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అంటే బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు భ‌యంతో పాటు భ‌క్తి కూడా వుంది. ఈ నేపథ్యంలో అమిత్‌షాపై తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్న రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ధైర్యం ఏ పాటిదో అర్థం చేసుకోవ‌చ్చు. అమిత్‌షాను హోంశాఖ నుంచి త‌ప్పించి, క్రీడ‌ల‌శాఖ ఇవ్వాల‌ని వ్యంగ్యంగా ట్వీట్ చేశారంటే సుబ్ర‌మ‌ణ్య‌స్వామి గ‌ట్స్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. అమిత్‌షాపై స్వామి ట్వీట్ ఏంటో చూద్దాం.

“జమ్మూక‌శ్మీర్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న అమ‌ల్లో వుంది. అక్క‌డ రోజూ ఓ క‌శ్మీరీ హిందువు హ‌త్య‌కు గుర‌వుతున్నాడు. ఈ ప‌రిస్థితుల్లో అమిత్‌షా రాజీనామాకు డిమాండ్ చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఆయ‌న‌కు క్రీడ‌ల‌శాఖ అప్ప‌గిస్తే బాగుంటుంది. ఎందుకంటే క్రికెట్‌కు అన‌వ‌స‌ర ఆద‌ర‌ణ బాగా పెరిగింది” అని దెప్పి పొడిచారు. అమిత్‌షాపై వ్యంగ్యాస్త్రాలు విస‌ర‌డం కొత్త‌కాదు.

గ‌తంలో కూడా మ‌రింత ఘాటుగా అమిత్‌షాను సుబ్ర‌మ‌ణ్య‌స్వామి వెట‌క‌రించారు. టీ 20 మెగా క్రికెట్ టోర్నీలో మ్యాచ్ ఫిక్సింగ్ జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయ‌ని, ద‌ర్యాప్తు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ట్వీట్ చేశారు. తాను ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం వేయాల‌ని అనుకుంటున్నాన‌ని పేర్కొన్నారు. ఎందుకంటే బీసీసీఐకి అమిత్‌షా కుమారుడు నియంత‌గా ఉన్నందున కేంద్ర ప్ర‌భుత్వం విచార‌ణ జ‌ర‌ప‌ద‌ని విమ‌ర్శించారు.

అమిత్‌షా కుమారుడు జైషా ఇప్పుడు బీసీసీఐ కార్య‌ద‌ర్శి. సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్నా ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో బీజేపీ వుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌త్య‌ర్థి పార్టీల్లోని అస‌మ్మ‌తి నేత‌ల‌ను ద‌గ్గ‌రికి తీస్తూ …త‌మాషా చూసే బీజేపీకి సొంత పార్టీ ఎంపీ కొర‌క‌రాని కొయ్య‌గా మార‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.