మెగా అన్నదమ్ములు ఇద్దరూ కలిసారు. కాస్సేపు ముచ్చటించుకున్నారు. గమ్మత్తేమిటంటే అన్న చిరు ఆ టైమ్ లో ఖైదీ డ్రెస్ లో వున్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో వున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్, మెగాస్టార్ సినిమా గాడ్ ఫాదర్ రెండింటి షూటింగ్ లు అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నేరుగా తమ్ముడి సినిమా సెట్ లోకి వెళ్లారు.
సినిమా యూనిట్, హీరో పవన్ అంతా కలిసి మెగాస్టార్ ను సాదరంగా ఆహ్వానించారు. అన్నదమ్ములు ఇద్దరూ కాస్సేపు కబుర్లు చెప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కువగా మాట్లాడలేదు కానీ అన్న మెగాస్టార్ నే తన లూసిపర్ రీమేక్ అయిన గాడ్ ఫాదర్ విశేషాలు అన్నీ పంచుకున్నారు.
అందులో కీలకమైనది సల్మాన్ ఖాన్ విషయం. లూసిఫర్ రీమేక్ లో సల్మాన్ నటిస్తున్నాడని 'గ్రేట్ ఆంధ్ర' చాలా రోజుల క్రిందటే న్యూస్ బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. చిరు ఇఫ్పుడు ఆ విషయాన్నే తమ్ముడు పవన్ కు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.
ప్రస్తుతం లూసిఫర్ రీమేక్ లో జైలు ఎపిసోడ్ షూట్ జరుగుతోంది. అందువల్ల మెగాస్టార్ ఖైదీ డ్రెస్ లోనే వున్నారు. ఆ డ్రెస్ తోనే భీమ్లా నాయక్ సెట్ లోకి రావడం విశేషం. అందువల్ల ఆ గెటప్ లీక్ కాకుండా, ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.