ఆమె ఒక వివాహిత. అయితే భర్త ఆమెను వివిధ రకాలుగా హింసించేవాడట. కొన్నాళ్లకు అతడికి ఆమె దూరం అయ్యింది. ఆమెకు తన కన్నా మూడేళ్ల చిన్నవాడైన ఒక యువకుడితో సంబంధం ఏర్పడింది. ఆమె వయసు ముప్పై కాగా, అతడి వయసు 27 యేళ్లట. భర్తకు దూరమైన ఆమెతో ఆ కుర్రాడు సహజీవనం మొదలుపెట్టాడు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండటాన్ని ప్రారంభించారు. అయితే ఆమె భర్త కుటుంబీకులు ఈ విషయంలో అభ్యంతరం చెప్పారు. అంతేగాక బెదిరించడం వంటివి కూడా చేశారట.
ఈ విషయంలో ఆ సహజీవనం చేస్తున్న జంట ఒక పెద్ద స్టెప్పే వేసింది. తమకు రక్షణ కల్పించాలని ఏకంగా హై కోర్టుకు ఎక్కింది. రాజస్తాన్ హై కోర్టులో వారి పిటిషన్ పై విచారణ జరిగిన వైనం ఆసక్తిదాయకంగా మారింది.
తాము సహజీవనంలో ఉండగా.. తమ బంధువులు బెదిరిస్తున్నారని, వారి నుంచి తనకు రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టి వేయడం గమనార్హం. అక్రమ సంబంధం తరహా సహజీవనానికి రక్షణ కల్పించాలంటూ పోలీసులకు తాము ఆదేశాలను ఇవ్వలేమని, అలాంటి ఆదేశాలు ఇస్తే తప్పుడు సందేశాన్ని పంపినట్టుగా అవుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఇది వరకూ సహజీవనంలో ఉన్న జంటలు తమ రక్షణ కోసం కోర్టులను ఆశ్రయించిన సందర్భాలున్నాయి.
వారికి కోర్టు అండగా నిలిచింది. పెళ్లితో సంబంధం లేకుండా సహజీవనం చేస్తున్న వారిపై బంధువుల దాడులు, బెదిరింపులు వంటి వాటిని అడ్డుకోవాలని కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే రాజస్తాన్ జంట కేసు మాత్రం డిఫెరెంట్. ఆమె వివాహిత, భర్తకు దూరంగా అయ్యిందంతే.
ఆమె చట్టపరంగా తన భర్త నుంచి విడాకులు తీసుకోకుండానే మరో యువకుడితో సహజీవనం మొదలుపెట్టింది. ఆమె పరిస్థితి ఎలాంటిది అయినా, ఆమె భర్త ఎలాంటి వాడైనా.. చట్టపరంగా విడాకులు పొందకుండానే సహజీవనం చేస్తుండటంతో.. కోర్టు ఆమె రక్షణకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వలేదని ఇక్కడ స్పష్టం అవుతోంది.
అయితే వారి సహజీవనానికి కోర్టు అభ్యంతరం చెప్పలేదు. వారిపై దాడి చేసే హక్కు, బెదిరించే హక్కు ఎవరికీ లేదని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే.. స్థానిక పోలిస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసుకోవాలని కోర్టు ఆ జంటకు సూచించిందని తెలుస్తోంది.