ఇండియాతో పోలిస్తే పదో వంతు స్థాయి జనాభాను కలిగి ఉన్న యూకే పరిధిలో ప్రస్తుతం పెద్ద సంఖ్యలోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. సరిగ్గా నెల కిందట యూకే పరిధిలో భారీ సంఖ్యలో కేసులు వచ్చాయి. అప్పుడు రోజువారీగా 47 వేల స్థాయిలో గరిష్ట స్థాయి కేసులో నమోదయ్యాయి. ఆ తర్వాత వేవ్ తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం యూకే పరిధిలో 30 వేల స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అదే కరోనా కారణ మరణాల విషయానికి వస్తే సుమారు రోజుకు రెండు వందల లోపు స్థాయిలో నమోదవుతున్నట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
మన దేశ జనాభాకు అనుగుణంగా రోజుకు మూడు లక్షల కేసులు రావడం, యూకేలో అందులో పదో వంతు కేసులు రావడం ఒకే స్థాయికి సూచికే. అయితే.. కరోనాను బ్రిటన్ సామ్రాజ్యం పూర్తిగా లైట్ తీసుకున్నట్టుగా ఉంది. ప్రస్తుతం అక్కడ జనజీవనం దాదాపు సాధారణ స్థితిలో కొనసాగుతూ ఉంది. ఇండియా-ఇంగ్లండ్ ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ ల సందర్భంగా స్టాండ్స్ నిండుతున్నాయి. కొన్ని వేల మంది ఈ మ్యాచ్ లను వీక్షించడానికి హాజరవుతున్నారు. వారిలో ఎవ్వరూ మాస్కులు ధరించి కనపడం లేదు!
కనీసం ఇండియన్ జట్టు సపోర్టర్లు అయినా మాస్కులతో కనిపిస్తున్నారేమో కానీ, బ్రిటీష్ జట్టు మద్దతుదార్లు మాత్రం మాస్కు లు అస్సలు ధరించి కనపడటం లేదు. మాస్కులు, దూరం దూరం కూర్చోవడం వంటి ఊసు లేకుండా అక్కడ క్రికెట్ మ్యాచ్ లను నిర్వహిస్తున్నారు. అది కూడా ఆ దేశం పరిధిలో రోజుకు 30 వేల స్థాయిలో కేసులు వస్తున్న తరుణంలో ఇలాంటి పరిస్థితి ఉండటం గమనార్హం!
యూకే జనాభా స్థాయికి రోజుకు 30 వేల కేసులు అంటే.. పెద్ద నంబరే! అయితే.. కేసులను తగ్గించడానికి అంటూ అక్కడ ప్రభుత్వాలు పెద్దగా ఆంక్షలను పెట్టడం కానీ, అమలు చేయడం కానీ ఇప్పుడు లేనట్టుగా ఉంది. స్పోర్ట్స్ ఈవెంట్ల నిర్వహణ విషయంలోనే ఆంక్షలు లేవంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఇక ఇదే సమయంలో గమనించాల్సిన అంశం ఏమిటంటే.. యూకే పరిధిలో దాదాపు 90 శాతం మందికి కరోనా వ్యాక్సినేషన్ జరిగింది. కనీసం ఒక డోసు వ్యాక్సిన్ ను దాదాపు 90 శాతం జనాభాకు ఇచ్చారట. అలాగే 77 శాతం జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ జరిగిందట. ఇలాంటి నేపథ్యంలో అన్ని రకాల ఆంక్షలనూ మినహాయించినట్టుగా ఉన్నారు. కానీ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. 77 శాతం జనాభాకు రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చిన దేశంలో కూడా రోజుకు 30 వేలకు పైగా కేసులు వస్తున్నాయనే వార్తలు విస్తుగొలిపేవే!
మరోవైపు పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ను ముమ్మరం చేసేలా ఉన్నారక్కడ. 12 యేళ్ల నుంచి 18 యేళ్ల వయసులోపు వారికి రెండు వ్యాక్సిన్లకు యూకే వ్యాక్సిన్ రెగ్యులేటరీ బాడీ ఆమోదం తెలిపింది. అతి త్వరలోనే పిల్లలకు కూడా పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
77శాతం వ్యాక్సినేషన్ జరిగిన దేశంలో ఇప్పటికీ దాని జనాభా స్థాయికి పెద్ద సంఖ్యలోనే కేసులు వస్తుండటం, కేసులు వస్తున్నా.. ప్రభుత్వాలు ఆంక్షలను ఎత్తివేసి అంతా మామూలుగానే నడిపిస్తూ ఉండటం, మరోవైపు చిన్న పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తుండటం.. ఇవన్నీ కరోనా -యూకే విషయంలో ఒకదానికి ఒకటి పొంతనలేని అంశాలు!