మంత్రి బొత్స సత్యనారాయణకు ఎంత ఆశనో. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా అవతరించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఆవిర్భావంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఏర్పాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఓ నవ్వుతో సరిపెట్టగా, ఆ పార్టీ నాయకులు నోరు మెదపడం లేదు. అదేంటోగానీ, వైసీపీ ముఖ్య నేతలు బీఆర్ఎస్పై ఉత్సాహంగా స్పందిస్తున్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ… ఇలా ముఖ్య నాయకుడు బీఆర్ఎస్ ఆవిర్భావంపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆవిర్భవించడాన్ని స్వాగతించారు. టీఆర్ఎస్కు సంబంధించి ఏం చేసుకోవాలనేది ఆ పార్టీ నేతల ఇష్టమన్నారు. ఇలా ఎన్ని పార్టీలు ఎక్కువైతే అంత మంచిదని ఆయన చెప్పుకొచ్చారు. వీలైనన్ని ఎక్కువ పార్టీలు రావాలని ఆయన కోరుకోవడం విశేషం.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఏడెనిమిది రాజకీయ పార్టీలున్నాయన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, కేఏ పాల్ తదితర పార్టీలున్నాయన్నారు. వీటికి అదనంగా మరొక పార్టీ వచ్చిందన్నారు. అంతే తప్ప, అధికారంలో ఉన్న తమపై ఈ పార్టీలు ఎలాంటి ప్రభావం చూపలేవన్నారు. గతంలో ఈ పార్టీలు తమపై ఏం ప్రభావం చూపాయని ఆయన ప్రశ్నించడం గమనార్హం.
రాజకీయాల్లో పార్టీలు రావడమనేది సహజమైన ప్రక్రియగా ఆయన చెప్పుకొచ్చారు. ఎక్కువ పార్టీలుండాలని, పోటీ చేయాలని బొత్స ఆశించడం వెనుక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చుతాయనే వ్యూహం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ విషయాన్ని బొత్స తన మార్క్ వ్యంగ్యంతో చెప్పడం ఆకట్టుకుంటోంది.