ఏపీ బీజేపీ అంటే వైసీపీకి చాలా ప్రేమ ఉన్నట్టుంది. తమ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు, పోరాడేందుకు బీజేపీకి సబ్జెక్టులు లేవని వైసీపీ గుర్తించింది. దీంతో బీజేపీ సిద్ధాంతానికి తగిన సబ్జెక్టును వైసీపీ ప్రభుత్వం అందించి తన ప్రేమను చాటుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రంకెలేస్తున్నారు. ఇదంతా వైసీపీ పుణ్యమే అని ఏపీ బీజేపీ సంబరపడుతోంది.
చిత్తూరు జిల్లాలో కాణిపాకం ఆలయం చాలా ప్రసిద్ధి. ప్రమాణాల దేవుడిగా ఆయన సుప్రసిద్ధుడు. కాణిపాకంలో వినాయకుడు స్వయంభువు. ఆ ఆలయానికి సంబంధించి అభిషేకం ధరను సంబంధిత అధికారులు ఏకంగా ఏడు రెట్లు పెంచి, ప్రజలు తమ అభిప్రాయాల్ని చెప్పాలని 15 రోజుల గడువు కూడా ఇచ్చారు. అభిషేకం ధర ఇంత వరకూ రూ.750 ఉంటూ వచ్చింది. పెంచిన ధరతో రూ.5 వేలకు చేరింది.
ఏపీ బీజేపీకి వైసీపీ ప్రభుత్వం మంచి ఆయుధం ఇచ్చినట్టైంది. ధర పెంపు వెనుక వైసీపీ ప్రభుత్వ హిందూ ద్వేషం ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు స్టార్ట్ చేశారు. అంతేకాదు, దసరా పర్వదినాల్లో ప్రముఖ ఆలయాల్లో ప్రసాదాల కొరత ఏర్పడడం వెనుక కూడా హిందూ ద్వేషమే వుందని ఆయన విమర్శించడం గమనార్హం. కాణిపాకంలో అభిషేకం ధరను యథాతధంగా ఉంచాలని, అలాగే ద్వారకాతిరుమలలో భక్తులకు పులిహోరతో సరిపెట్టకుండా, చక్రపొంగలి, వడ తదితర ప్రసాదాలను అందించాలని డిమాండ్ చేశారు.
బహుశా వైసీపీ ప్రభుత్వ హిందూ మత వ్యతిరేక విధానాలకు నిరసనగా సోము వీర్రాజు నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే అవకాశాలు లేకపోలేదనే వ్యంగ్య కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏపీ బీజేపీకి పనేమీ లేదనే జాలితో, ప్రేమతో వైసీపీ ప్రభుత్వమే ఏదో ఒక సమస్యను క్రియేట్ చేసి ఇస్తున్నట్టుగా ఉందనే వెటకారాలు వ్యక్తమవుతున్నాయి.