ఒక మనిషికి ప్రారంభమే కాదు, ముగింపు కూడా వుంటుంది. 1980, అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీలో గద్దర్ ప్రోగ్రాం వుందని తెలిసింది. అప్పటికి ఆయన పాట వినలేదు. పాడతాడని మాత్రం తెలుసు. మా ఇంటి నుంచి మట్టి దారిలో, ముళ్ల కంపల మధ్య 3 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. నేనూ కొందరు స్నేహితులు సాయంత్రం 6 గంటలకు బయల్దేరాం. సైకిళ్లు పంక్చర్ అయ్యే అవకాశం ఎక్కువ. జాగ్రత్తగా చూసి తొక్కాం.
అప్పట్లో అనంతపురం, విద్యార్థి రాజకీయాలకు వేదిక కాబట్టి, కాలేజీ డేకి గద్దర్‌ని పిలిచారు. సుత్తి ఉపన్యాసాలు ముగిసిన తర్వాత ఆఖరున గద్దర్ వచ్చాడు. ఆట, మాట, పాట. కుర్రాళ్లంతా ఊగిపోయారు. నాకైతే అపస్మారక స్థితి. పేదవాళ్ల పాటలు, ప్రభువుల్ని ధిక్కరించే పాటలు. రాత్రి 10 గంటలకి చీకట్లో ఇంటిదారి పట్టాం. అనుకున్నట్టుగానే సైకిల్ పంక్చర్. కానీ గద్దర్ పాటలు పాడుతూ, మాట్లాడుతూ గాలిలో తేలుతూ వచ్చేశాం.
17 ఏళ్ల వయసుకే కమ్యూనిస్టు సాహిత్య ప్రభావంతో, ఈ సమాజం వుండాల్సిన విధంగా లేదని తెలుసు. అయితే ఎలా వుండాలో తెలియదు. గద్దర్ పాట విన్నప్పుడు ఎంత ఆవేశం, ఆగ్రహం అంటే అడవిలోకి వెళ్లి తుపాకి మోసేంత. అయితే అనంతపురం చుట్టూ అడవులు లేకపోవడం, తుపాకి ఎక్కడ దొరుకుతుందో తెలియక బతికిపోయాను. అప్పటికి మధ్య తరగతి ఇళ్లలోకి టేప్ రికార్డర్ రాలేదు. ఎవరైనా మిత్రుల ఇళ్లలో గద్దర్ పాటల క్యాసెట్ వుంటే శ్రద్ధగా, ప్రేమగా వినేవాన్ని. ఒక మనిషి గొంతులో అంత శక్తి, జనం బాధ వినడం అదే మొదటిసారి.
టేప్ రికార్డర్లు ఇంట్లోకి వచ్చిన తర్వాత గద్దర్ కూడా ఇంటి మనిషయ్యాడు. తర్వాత నేను జర్నలిస్ట్‌గా ఉన్నపుడు గద్దర్ వార్తలు వస్తే ఒకటికి రెండుసార్లు చదివేవాన్ని. ఆయనపై కాల్పులు జరిగినపుడు బాధ పడిన లక్షల మందిలో నేనూ ఒకన్ని. గద్దర్‌ని ప్రజాయుద్ధ నౌక అన్నారు. అప్పుడు నిజమే. ఇప్పుడు శిథిల యుద్ధ నౌక మాత్రమే.
కాలం ఎవరినైనా మారుస్తుంది. అందరూ బాగుండాలని కోరుకున్న వాళ్లు తాము బాగుంటే చాలనుకున్నారు. అందరూ కడుపు నిండా తినాలని కోరుకున్న వాళ్లు, అవకాశం వచ్చినపుడు అందరి తిండి తామే లాక్కున్నారు. క్రీస్తునే మోసం చేసిన మనిషి, మార్క్స్‌ని మోసం చేయలేడా?
కానీ గద్దరన్నా నీ పాట విని ఊగిపోయి, జీవితపు చేదుతనానికి రోసిపోయి పేద జనం తలరాతల్ని మార్చాలని అడవుల్లోకి వెళ్లిపోయిన బలహీన, దళిత వర్గాల పిల్లల సంగతేంటి? వాళ్లు తిరిగొస్తారని ఊరి చివర చత్వారపు కళ్లతో ఎదురు చూస్తున్న తల్లుల మాటేంటి? బీద తల్లి కూడా 9 నెలలు మోసి బిడ్డని కంటుంది. మాంసం ముద్దల రూపంలో తిరిగొచ్చిన బిడ్డల శవాల్ని చూడటానికా ఆ ప్రసవ వేదన?
ఈ వయసులో అడవుల్లోకి వెళ్లి తుపాకి తీసుకోమని నిన్నెవరూ కోరడం లేదు. దాని వల్ల లాభం కూడా లేదు. అది నిరూపితం. అయితే ఈ మధ్య కాలంలో నువ్వు వేస్తున్న పిల్లిమొగ్గలు, జిమ్నాస్టిక్స్ నవ్వు తెప్పిస్తున్నాయి. వేషం మారింది, రూపం మారింది. చివరికి రంగు కూడా మార్చావు (నెత్తికి, మీసాలకి రంగు). గుళ్లకి, గోపురాలకి తిరిగి చివరికి కేఏ పాల్ పక్కన చేరావు. మీరిద్దరూ కలిసి ఏం మారుస్తారు? నువ్వు ఒక కమెడియన్‌గా మారడం తప్ప.
చిలుక కొత్తగా సంస్కృతం నేర్చుకున్నట్టు విశ్వశాంతి అనే ఏదో అర్థం కాని పదాలను మాట్లాడుతున్నావు. యుద్ధం లేకుండా శాంతి ఎప్పుడైనా వచ్చిందా? యుద్ధం అంటే భౌతికంగా రక్తం పారించేది మాత్రమే కాదు. ఒకప్పుడు పాటతో నువ్వు చేసింది కూడా యుద్ధమే. నీ పాట ఇప్పుడు మందుగుండు లేని తూటా!
ఒకప్పుడు నువ్వు యుద్ధ నౌకవే! శిథిలమై ఒడ్డున కూచున్నా నీకు గౌరవం వుండేది. కానీ పగిలి పోయిన చెక్కముక్కల్ని నమ్మి నిన్ను నువ్వు ఇంకా నౌక అనుకుని మునిగిపోతున్నావు. అదే విషాదం.
గతంలో నువ్వు కనపడక పోయినా నీ పాట వినపడేది. ఇప్పుడు నువ్వు కనబడినా నీ పాట వినపడదు. ఏదో ఒక దిక్కు కోసం వెతుకుతూ పాటని దిక్కులేకుండా చేశావు.
చివరికి ఇలా మిగిలావా గద్దరన్నా? పోనీలే ఇలాగైనా మిగిలావు. పాటకి కూడా ఒక ప్రారంభమూ, ముగింపూ వుంటుంది.
జీఆర్ మహర్షి