కేసీఆర్ కొత్త పార్టీ పెట్టారు. అది జాతీయ పార్టీగా పేర్కొన్నారు. అయితే జస్ట్ టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా పేరు మార్చేశారు. ఇక దేశమంతా తిరగవచ్చు, ఎక్కడైనా పోటీ చేయవచ్చు అని ఉవ్విళ్ళూరుతున్నారు. అయితే విభజన గాయాలతో కుములుతున్న ఏపీ జనం బీఆర్ఎస్ మీద ఎలా రియాక్ట్ అవుతారు అన్న దాని మీదనే ఇపుడు అంతా ఆలోచిస్తున్నారు.
కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి అని పేరు పెట్టేసినంత మాత్రాన ఏపీ జనాలు ఎందుకు నమ్ముతారని వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎన్ని పేరులు మార్చినా ఏమి చేసినా సరే ఏపీలో నమ్మరు కాక నమ్మరు, పైగా ఏపీ రాజకీయాల్లో వచ్చే మార్పు కూడా ఉండదు అని వాసుపల్లి స్పష్టం చేస్తున్నారు.
ఏపీలో రాజకీయ శూన్యత లేదని, అందువల్ల ఇక్కడ బీఆర్ఎస్ అని జనాల్లోకి వెళ్ళినా ఉపయోగం ఏమీ ఉండదని అంటున్నారు. ఏపీలో సంక్షేమ పధకాలు అద్భుతంగా సాగుతున్నాయని, ముఖ్యమంత్రి జగన్ దార్శనికత వల్లనే ఇది సాధ్యపడుతోందని ఆయన చెప్పారు. మరో ముప్పయ్యేళ్ల పాటు ఏపీకి జగనే సీఎం అందువల్ల ఏ కొత్త పార్టీ వచ్చినా ఆయాసపడడమే తప్ప వైసీపీని ఎవరూ ఏమీ చేయలేరని గణేష్ కుమార్ తనదైన శైలిలో విశ్లేషించారు.
విషయానికి వస్తే కేసీఆర్ అంటే ఏపీ జనాలకు నిజానికి ఇప్పటికీ చాలా కోపం ఉందా, ఏపీ విభజన ఆయన వల్లనే జరిగిందని భావిస్తున్నారా. ఆ కోపాన్ని ఇంకా అలాగే ఉంచుకున్నారా అన్నది అయితే కాలక్రమంలో తేలే అంశమే అని అంటున్న వారూ ఉన్నారు. ఏపీలో కేసీఆర్ పార్టీ అద్భుతాలు క్రియేట్ చేస్తుందని ఇప్పటికైతే ఎవరూ గట్టిగా చెప్పడం లేదు మరి.