మోడీ .. రాహుల్ గాంధీని మెచ్చుకోవాల్సిందే!

ప్ర‌ధాన‌మంత్రి హోదాలో న‌రేంద్ర‌మోడీ జ‌నాల‌కు ర‌క‌ర‌కాల హిత‌బోధ‌లు చేస్తూ ఉంటారు. కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున మోడీ హిత‌బోధ‌ల‌కు సంబంధించిన ఈవెంట్లు కూడా అప్పుడ‌ప్పుడు జ‌రుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటిల్లో ఖేలో ఇండియా.. ఫిట్ ఇండియా..…

ప్ర‌ధాన‌మంత్రి హోదాలో న‌రేంద్ర‌మోడీ జ‌నాల‌కు ర‌క‌ర‌కాల హిత‌బోధ‌లు చేస్తూ ఉంటారు. కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున మోడీ హిత‌బోధ‌ల‌కు సంబంధించిన ఈవెంట్లు కూడా అప్పుడ‌ప్పుడు జ‌రుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటిల్లో ఖేలో ఇండియా.. ఫిట్ ఇండియా.. వంటి కార్య‌క్ర‌మాలు కూడా ఉన్నాయి. 

దేశంలో ప్ర‌జ‌లు ఫిట్ గా ఉండాల‌నేది ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర‌మోడీ సంక‌ల్పం. ఆట‌లు ఆడాల‌ని, మాన‌సికోల్లాసాన్ని పొందాల‌ని,  వ్యాయామం చేయాల‌ని, ఫిట్ గా ఉండాలంటూ.. మోడీ పిలుపునిస్తూ ఉంటారు. త‌ను కూడా ఫిట్ గా ఉండ‌టానికి చేసే క‌స‌ర‌త్తుల గురించి కూడా మోడీ వివ‌రిస్తూ ఉంటారు. 

అలాగే కొంత‌మంది క్రికెట‌ర్లు, సెల‌బ్రిటీల‌తో కూడా మోడీ ఫిట్ నెస్ గురించి మాటామంతీ చేశారు గ‌తంలో. ఏతావాతా ఫిజిక‌ల్ ఫిట్ నెస్ గురించి మోడీకి ఉత్సాహం, శ్ర‌ద్ధ ఉంది. త‌నే గాక అంతా అలా ఉండాల‌నేది మోడీ ఆకాంక్ష‌!

మ‌రి ఈ ఆకాంక్ష‌ను నిజం చేస్తున్న వారిలో మోడీ ప్రియ‌మైన శ‌త్రువు రాహుల్ గాంధీ ఉన్నారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్త యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ… ఉత్సాహంగా సాగుతున్నారు. యాత్ర ప్రారంభం అయ్యి చాలా కాల‌మే అయినా, రాహుల్ ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గుతున్న దాఖ‌లాలు లేవు. ద‌క్షిణాది రాష్ట్రాల మీదుగా రాహుల్ యాత్ర ఉత్సాహంగా సాగుతూ ఉంది. ఎంత‌లా అంటే.. రాహుల్ తో న‌డ‌క‌లో కాంగ్రెస్ పార్టీ నేత‌ల పోటీ ప‌డ‌లేక‌పోతున్నారు. వృద్ధ నేత‌లు కొంద‌రు, మ‌రి కొంద‌రు రాహుల్ స‌మ‌వ‌య‌స్కులే అయినా ఫిట్ గా లేరు. దీంతో రాహుల్ తో న‌డ‌క‌లో వారు పోటీ ప‌డ‌లేక‌పోతున్నారు.

ఇప్పుడే కాదు రాహుల్ గతం నుంచి కూడా చాలా ఫిట్ గా ఉంటార‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు పాద‌యాత్ర‌తో రాహుల్ గాంధీ త‌న ఫిట్ నెస్ ను మ‌రింత‌గా చాటుకుంటూ ఉన్నారు. రోజువారీగా రాహుల్ న‌డుస్తున్న దూరం అయినా, ఇప్ప‌టి వ‌ర‌కూ రాహుల్ న‌డిచిన దూరం అయినా, రాహుల్ ముందున్న దూరం అయినా త‌క్కువేమీ కాదు. 

మ‌రి రాహుల్ యాత్ర పూర్త‌య్యేలోపు ఆయ‌న ఫిట్ నెస్ ను, శారీర‌క సామ‌ర్థ్యాన్ని మోడీ మెచ్చుకోవాల్సిందేమోనేమో! భ‌విష్య‌త్తులో ఫిట్ ఇండియాకు  ప్ర‌తినిధిగా రాహుల్ గాంధీని ప్ర‌క‌టించాలి మోడీ ప్ర‌భుత్వం! మ‌రి ఎటొచ్చీ రాహుల్ గాంధీ ఫిజిక‌ల్ ఫిట్ నెస్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువ‌స్తుందా? అనేదే పెద్ద ప్ర‌శ్న‌!