ఇతరులతో పోలిస్తే రత్నమాల సమస్య చిన్నదే. కానీ ఆమెకు అదే పెద్ద తలకాయ నొప్పిగా తయారయింది. ఆమె భర్త వెంకట్రావు తాగుబోతు కాడు, తిరుగుబోతు కాడు, భార్యను హింసించడు, పిల్లల్ని అకారణంగా కొట్టడు. అయినా రత్నమాల భర్తను తలచుకొని బాధపడుతూందంటే దానికి కారణం అతను మాట్లాడే తీరు.
‘అసలిన్ని బూతులు ఎలా మాట్లాడగలరో’ అనుకొంటుంది రత్నమాల. ‘తన తండ్రి, సోదరులు బయట ఎవరితోనైనా బూతులాడేవారేమో గానీ ఇంట్లో ఎప్పుడూ అలాటి మాటలు ఉపయోగించేవారు కారు. అలాటి వాతావరణంలో పెరిగిన తను వచ్చివచ్చి ఈయన పాలబడింది. ఈయన నోరు విప్పితే చాలు బూతులు. కోపం వచ్చినప్పుడని కాదు, సంతోషంలో అని కాదు, పగలని కాదు, రాత్రని కాదు.. నోట్లోంచి ఎప్పుడూ బూతులు రాలుతూనే ఉంటాయి. ఆయన కంటే పెద్దవాళ్ళున్నా నోరు కంట్రోలు చేసు కోరు, ఆడవాళ్ళున్నా ఆగరు. పెళ్ళయిన కొత్తలో ఈయన భాష తమాషాగా అనిపించి నవ్వేది. పోనుపోను చికాకు వేసేది. అసలు తనకి స్టయిలుగా డ్రస్ చేసుకొని మితంగా మాట్లాడే మగాళ్ళంటే ఇష్టం. ఎంత ఖరీదైన డ్రస్సు వేసుకున్నా సరే, నోట్లోంచి బండబూతులు రాలుతుంటే దర్జా ఎక్కడనుంచి వస్తుంది? అనాగరీకుడనుకోరూ?
చెప్పి చూసింది. ‘గాడిద..’ అన్నాడు. అన్ని జాతుల్లో, అన్ని భాషల్లో బూతులాడతారట. అదేమీ తప్పు కాదని తెలుసుకొని సినిమాల్లో హీరోయిన్ల దగ్గర్నుంచి, హీరో బామ్మల దగ్గర్నుంచీ మాట్లాడుతున్నారట. బూతు ఎక్కడ మిస్సవుతారోనని బీప్ పెడుతున్నారట. అది వినగానే అక్కడ ఏ బూతు వాడి ఉంటాడా అని ప్రేక్షకులు తమ బుర్రకు పదును పెడతారట. అసలు బూతులు మాట్లాడితేనే ఆత్మీయత కొట్టొచ్చినట్టు కనబడుతుందిట. జాతీయత ఉట్టిపడుతుందట. ‘అయితే మీ ఆఫీసరుతో అలా మాట్లాడి చూడండి' అంది ఒళ్ళు మండి. ‘అలాగే మాట్లాడతానుగా, వాడు నా క్లాసుమేటు కూడా’ అన్నాడు. హతోస్మి!
ఆఫీసులో తనతో పనిచేసే వాళ్ల గురించి అతను తిట్టే విధానం వింటుంటే జుగుప్ప వేసేది. ‘అదేదో చేస్తాననే బదులు చేసిపారేస్తే వదిలిపోతుంది. ఈ వాగుదు వినడం కంటే అదే మెరుగు’ అంది ఓసారి. ‘దానిదేముంది దొరికితే తప్పకుండా చేస్తాను’ అన్నాడు నిర్లజ్జగా. ‘సిగ్గు లేకపోతే సరి. అయినా వాడు మీకు కోపం తెప్పిస్తే వాణ్ణి తిట్టాలి కానీ వాడి అమ్మ, అక్కా మీకేం ద్రోహం చేశారని వాళ్ళని తిట్టడం? అసలతగాడికి అక్కా, చెల్లీ ఉన్నారో లేదో మీరు అలాచేస్తా, ఇలా చేస్తానంటూ ఎగురుతున్నారు. అసలు మనిషే లేకపోతే..’ ‘చాల్లే.. ఓ మనిషిని తిట్టే పద్ధతే అది. అక్కా, చెల్లి ఉన్నారో లేదో, వాళ్ళ వయస్సేమిటో, రూపురేఖలేమిటో కనుక్కొని తిడతామా?’
‘ఏమిటండీ యీ పద్ధతి? పరాయి ఇంటి ఆడవాళ్ళ మానం దోచుకుంటే మీది పైచేయి అయినట్టా? అసలీ తిట్లలోనే సెక్స్ వివక్షత ఉన్నట్టుంది. వాడి తమ్ముడికి మీ భార్యను అప్పగిస్తానంటూ తిట్టరేం?’’ ‘‘ఈ తిక్క ఫెమినిస్టు కబుర్లు నా దగ్గర…. నేనూరుకోను.’’
‘‘అసలు ఇంకో విషయం. రతికార్యం అనేది ఇద్దరికీ ఆనందానిచ్చే పని. అదేదో శిక్ష విధించినట్టు మాట్లాడడమేమిటి?’’
‘‘చెప్పానా? తరతరాలుగా అన్ని దేశాల్లో ఉన్న పలుకుబడే అది. కోతుల్లో కూడా శత్రువు మీద గెలిచినపుడు తన ఆధిక్యత యిలాగే తెలుపుతుందిట. అంటే ఈ అభిప్రాయం మన పూర్వీకుల నుండీ మనకు సంక్రమించిందన్నమాట.’’
‘‘పూర్వీకులనడం కంటే, కోతిబుద్ది ఇలా ఉంటుందని అనండి. పైనున్న వాళ్లదే పైచేయా? అవతలివాళ్లు శిక్ష పొందుతున్నారని అర్థమా? అయితే శిక్ష విధించడానికే నన్ను మీరు పెళ్ళాడారన్నమాట. నేను ఏ తప్పు చేస్తే శిక్ష వేస్తున్నారు చెప్పండి.’’ అని అడిగితే జవాబుగా తనకు బలిసి అనవసరంగా వాగుతోందని వెంకట్రావు మొరటుగా అనడంతో ‘ఈయనతో అనవసరంగా వాదనకు దిగానురా బాబూ’ అనుకుని ఊరుకుంది.
పెళ్లయి చాన్నాళ్లయినా, వయసు పెరిగినా భర్త అలవాటు పోలేదు. కూతుళ్ళు ఎదిగి వస్తున్నా. వాళ్లెదురుగా అలా మాట్లాడడానికి కూడా అతనికి సంకోచం లేదు. తను మొత్తుకుంటే ‘ఆఁ, ఇంట్లో కాకపోయినా బయట ఇవన్నీ వింటూనే ఉంటారులే’ అంటూ కొట్టిపారేశాడు.
ఇంతలో ఇల్లు మారాల్సి వచ్చింది. ఈ వాటాల కాంప్లెక్స్ లోకి వచ్చిపడ్డారు. పాత ఇంటి ఫ్రెండ్స్ దగ్గర్లో లేరు కాబట్టి ఈయన ఉధృతం తగ్గుతుందేమోనని ఆశపడింది. కానీ పక్కింటి వాటాలో ఉన్న పద్మనాభాన్ని చూసి దడుసుకుంది. ఆయనా ఈయనలాటి వాడే. ఇద్దరూ కలిసి రాజకీయాలు మాట్లాడుతూంటారు. ముఖ్యమంత్రిని, ప్రధాన మంత్రివీ వారి కుటుంబంలోని ఆడవాళ్లను ఏం చేస్తే దేశం బాగుపడుతుందో చర్చించుకోవడం వింటుంటే అన్నం సయించేది కాదు. ‘అగ్నికి వాయువు తోడయినట్టుంది వ్యవహారం’ అనుకుని, ఓసారి పద్మనాభం భార్య సరోజను కదలేసింది. ‘‘మీరు కాస్త మీ ఆయన్ని అదుపులో పెట్టంది. ఇద్దరూ కలిస్తే మరీ పేట్రేగిపోతున్నారు. ఇంట్లో ఆడపిల్లలు వినాల్సిన మాటలు కావివి’ అంది.
సరోజ కొట్టి పారేసింది. ‘మీరింకా పట్నవాసం నుంచి వచ్చారు. మీ మగాళ్లు పరాయి ఆడవాళ్ళ ముందు బూతులు రాకుండా చూసుకుంటారు. మాది పల్లెటూరు. మా వాళ్ళు వెనకా, ముందూ చూడకుండా మాట్లాడేస్తారు. ఏదో అలవాటై పోయింది లెండి. ప్రతీ మొగాడూ ఇంతే, మా వైపు ఆడాళ్లు ఓ మెట్టు తక్కువ, అంతే. దాని గురించి అంత సెన్సిటివ్‌గా ఫీలయి బుర్ర బద్దలు చేసుకోవడం ఎందుకు? ఈ చెవితో విని ఆ చెవిలోంచి వదిలేస్తే పోలా?' అందావిడ. ఈ మాత్రం విషయం చెప్పడానికే ఆవిడకి రెండు, మూడు బూతు పదాలు ఉపయోగించింది. 'దొందుకు దొందే' అనుకొని వచ్చేసింది తను.
‘పోనీ సరోజలా తనూ సరిపెట్టుకుంటే పోలా?’ అనుకున్నా తన మనసు ఊరుకోవడం లేదు. ఏదో ఒకటి చేసి మొగుణ్ణి మార్చాలి అనుకొంటుండగా ఒక సంఘటన జరిగింది. ఓ రోజు భర్త, పద్మనాభం మాట్లాడుతుండగా తను మధ్యలో వెళ్ళి “ఏమండీ పద్మనాభంగారూ, మావార్ని అయ్యప్ప మాల వేసుకోమన కూడదూ, నెలన్నరపాటు బూతులు మాట్లాడకుండా ఆపుకుంటారు' అంది. ‘మీరూ అంతే సుమా’ అని ధ్వనిస్తూ. ‘‘బూతు మాటల్లేకుండా నేను నెలన్నర ఉంటాను సరే కానీ బూతు పనుల్లేకుండా నువ్వన్నాళ్ళు ఉండలేవు కదా. మరి మాల ఎలా వేసుకొంటాను చెప్పు?' అంటూ భర్త జోక్ వేశాడు. అందరూ పగలబడి నవ్వారు. తనకి చచ్చే సిగ్గు వేసింది. కళ్ళనీళ్ల పర్యంతం అయింది. పద్మనాభం మరీ ఎక్కువగా నవ్వడంతో ఈయన చేత ఎలాగైనా బూతులు మాన్పించాలన్న పట్టుదల పెరిగింది.
ఇంతలో ఒక పత్రికలో బూతులు మాట్లాడడం గురించి వ్యాసం వచ్చింది. ‘రతిపై తన ఆసక్తిని వ్యక్తపరచడానికి మగవాడు బూతులు వాడతాడని, బాల్యంలో ఆదేమిటో తెలియక పోయినా దానిమీద ఇంట్రస్టు కొద్దీ ఎక్కువ మాట్లాడతాడనీ, మళ్లీ ముసలితనంలో చేవ చచ్చినా ఇంట్రస్టు పోక బూతుల డోసు పెంచుతాడనీ అదే మగతనానికి లక్షణం అనుకుంటారని రాశాడా వ్యాస రచయిత. చదివితే నిజమే ననిపించింది. తన భర్త కూడా మాట్లాడితే ‘మగాడన్నాక ఇలాగే మాట్లాడాలి. వగరూ, పొగరూ ఉన్నాక తప్పుతుందా?’ అంటూ గొప్పలు చెప్పకోవడం వింది. అలా మాట్లాడడమే మగతనానికి గుర్తు అనుకొంటున్నాడు. అవతలి వాళ్ళు అలా అనుకోవడం లేదని అతనికి తెలిస్తే?
ఆ రాత్రి రత్నమాల మొగుడి దగ్గరికి చేరి ‘ఏమండోయ్, ఈ పత్రికలో బూతుల గురించి తమాషా వ్యాసం రాశాడు. చదువుతారా?’ అంది. 'ప్రతి ..కొడుకూ వ్యాసాలు రాసి …వాడే” అంటూ వెంకట్రావు అంటూండగానే 'ఆగండి, పంచాంగం విప్పకండి. అందులో రాసింది చెప్తా వినండి. ముసలాళ్ళు బూతులెందుకు ఎక్కువగా మాట్లాడతారో తెలుసా? వాళ్ళకు రతిలో పాల్గొనే శక్తి ఉండదు కదా, అందువల్ల అలా మాట్లాడి తృప్తి పడతారట”
'ఛ ఛ అలా రాసేడా….’’
‘‘కావాలంటే వినండి.’’ అంది రత్నమాల, మొగుడు పేపరు తప్ప పత్రికలు చదవడని తెలుసు కాబట్టి. తను చెప్తామనుకున్నవన్నీ వ్యాసంలో ఉన్నట్టు చెప్పేసింది. ‘పడుచు వాళ్ళలో కూడా సరిగ్గా చేయలేని వాళ్ళు వాళ్ళనది చేస్తా, ఇది చేస్తా’ అంటారుట…’’
‘‘వెర్రి… సిద్ధాంతంలా ఉంది.’’
‘‘కాదండీ మా క్లాసుమేటు వసంత కూడా ఇలాగే చెప్పింది. ఓ సారి వాళ్ళాయన గురించి చెప్పుకొచ్చింది. 'మా వారు రెండు నిమిషాలకంటే ఉండలేరు. కానీ వాళ్ళ ఆఫీసర్ని తిట్టేటప్పడు చూడాలి. వాడి అమ్మనూ, అమ్మమ్మనూ అన్ని రకాలుగా ఏకధాటిగా గంటసేపు వరస పెట్టి అదరగొట్టేస్తా నంటూ బూతులాడతారు. ‘చేతలు లేనివాళ్లకే వాచాలత’ అనేవారు మా మేష్టారు. పెద్దవాళ్లు కొడితే తిరిగి కొట్టలేని చిన్నపిల్లలు నీ అమ్మ, నీ అక్క.. అంటూ బూతులు కురిపించి పారిపోవడం కూడా యీ థియరీ కిందే వస్తుంది అన్నారాయన. వసంత అవన్నీ గుర్తు చేసి, ‘అవునూ, మీ వారూ బాగా బూతులాడతారుగా, ఆయనా అదే బాపతా?’ అని అడిగింది.’.
వెంకట్రావు నివ్వెరపోయి ఇదంతా విన్నాడు. చివర్లో 'మరి నువ్వేం సమాధానం చెప్పావు?' అని అడిగాడు ఆత్రుతగా. ‘బావుంది. ఏం చెప్తాను? తను వాళ్ళాయన కబుర్లు చెప్తూంటే ఆపుకోలేనంత నవ్వొచ్చి ఇవతలికి వచ్చి పడ్డాను’ అంది రత్నమాల సంజాయిషీగా.
వెంకట్రావు ఆలోచనలో పడ్డాడు. ఆ వ్యాసంలో రాసినదానిలో నిజం ఉందా? ఈ మధ్య తను బూతులు ఎక్కువ మాట్లాడుతున్నాడా? అఫ్కోర్స్, గతంలో కంటె శృంగారజీవితం తగ్గిపోయిన మాట వాస్తవం. వయసు మీద పడుతోంది, ఆఫీసులో చికాకులు పెరిగాయి, ఆర్థికావసరాలు పెరిగి తనకూ, భార్యకూ చికాకులు పెరిగాయి. పిల్లలు పెద్దవాళ్లవడంతో యింట్లో ప్రైవసీ బాగా తగ్గిపోయింది. వీటి వలన చేతలు తగ్గి, కబుర్లు పెరిగి ఉంటాయా? ఏమో, ఎవర్నయినా అడిగి తెలుసుకునే విషయం కాదు. మన బూతులు లెక్కపెట్టే డ్యూటీ ఎవరికీ అప్పగించలేం కదా! ఏది ఏమైనా బూతులు తగ్గించాలి, జీవితంలో రొమాన్సు పాలు పెంచాలి. భార్య రొమాంటిక్‌గా కనిపించడం మానేసి చాలా ఏళ్లవుతోంది. ఏదో రొటీన్ వ్యవహారం అయిపోవడంతోనే ఆసక్తి చచ్చింది. పక్కచూపులు చూస్తేనే మజా! ఆఫీసులో ఉన్నవాళ్లలో పనికొచ్చే రకం ఎవరూ లేరు.
కొన్నాళ్లు మథన పడగా, అతని చూపు సరోజ మీద పడింది. పద్మనాభం తనను మించి బూతులాడతాడు. అంటే మ్యాగజైన్ థియరీ ప్రకారం అతని యాక్టివిటీ తనకంటె తక్కువన్నమాట. అతని భార్య పస్తులతో బాధపడుతూ ఉండాలి. కానీ తెగువ చూపి ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదు కదా! తనని కదిలిస్తే ఒళ్లో పడడం ఖాయం.
అసలు తన గురించి సరోజకు ఎలాంటి అభిప్రాయం ఉందో? తన మొగుడి లాగా చేతకానివాడను కొంటోందా? ఈ మేగజైను ఆమె కూడా చదివి వుంటుంది. మొగుడి విషయంతో పోల్చి చూసుకుని లోకంలో బూతులాడే మగాళ్ళందరూ ఇంతేనన్నమాట అనుకుంటుంది. ఛ! తన బతుకిలా అయిపోయింది. తన రసికత ఆమెకు తెలియపరచటం ఎలా? ఒక సారి తనతో ఉంటే తన సత్తా ఎలాంటిదో అదే తెలుస్తుంది. కానీ ఇలా బూతులాడుతూంటే తనకేసి కన్నెత్తి కూడా చూడదు. అందువల్ల ఎంత కష్టమైనా సరే, ముందు బూతులు మానేయాలి. ఆ తర్వాత తక్కిన సంగతి చూడాలి.
తన పాచిక పారి మొగుడు బూతులాడడం మానేశాడని నెల్లాళ్లకి రత్నమాల గుర్తించి, మహా సంతోషపడింది. 'ఇన్నాళ్లకు తలెత్తుకుని తిరగ్గలను, ఎవరింటికైనా ఆయనతో ధైర్యంగా వెళ్లగలను' అనుకుంది. కానీ మరో నెల తిరక్కుండా ఇంకో విషయం గమనించింది. ‘వెంకట్రావు సరోజకి లైనేస్తున్నాడు.’ ముందు తను పొరపాటు పడుతున్నాననుకుంది. వెంకట్రావు సరోజ గురించి అడపాదడపా అడుగుతున్నాడని గుర్తు తెచ్చుకుంది. ‘ఆమె భర్తా బూతులాడతాడు కాబట్టి ఆమె దాంపత్య జీవితం గురించి కుతూహలం కలగడం సహజం' అనుకొని సరిపెట్టుకుంది.
కానీ సరోజ నూతి దగ్గర బట్టలు ఉతుకుతూంటే పెరట్లో కుర్చీ వేసుకుని పేపరు చదువుకోవడం, ‘బజారు నుండి వస్తూ వస్తూ చవగ్గా ఉన్నాయని మీకూ కూరలు తెచ్చానండీ’ అంటూ ఆమెకే డైరెక్టుగా కూరలు ఇవ్వడం, ‘ఫలానా సినిమాలో మీ ఫేవరేట్ హీరో భలేగా యాక్ట్ చేశాడు సుమండీ’ అని అభినందించడం. ఇవన్నీ చూస్తే కాస్త అనుమానం వచ్చింది. తను ఒక చిక్కుముడి విప్పుతూ మరొక చోట ముడి వేసిందా?’ అని భయపడింది. ‘బూతుల గొడవ వదుల్చుకుని సవతి గొడవ తగుల్చు కుంటోందేమో’ అని విసుక్కుంది. మళ్ళీ దీనికీ ఏదో ఒక మందు వెయ్యకపోతే లాభం లేదనుకుంది.
బాగా గమనించగా మొగుడికీ, సరోజకీ మధ్య సీతాలు రాయబారిగా తిరుగుతున్నట్టు పసిగట్టింది. ఓ రోజు తనింట్లో నుంచి కొంగులో ఏదో దాచుకుని బయటకొస్తోంది. తను పెరట్లోంచి ఇంట్లోకి వెళుతూ ఎదురయింది. సీతాలు దూరంగా జరిగింది. అనుమానం తగిలి 'సీతాలూ కరివేపాకు కోసి పెట్టు' అంటూ పెరట్లో మూలకి లాక్కెళ్ళి ‘ఏం దాచావో చూపించవే’ అంటూ నిలదీసింది. సీతాలు మొండి కేయబోయింది. తను అంతకంటే జగమొండి. కొంగులో దాచినది పూలపొట్లం. మొగుడు సరోజకి పంపుతున్నాట్ట. ‘డాఫరు పని ఎప్పట్నుంచి చేస్తున్నావే జెష్టదానా?’ అని తిట్టింది.
‘బాగుందండోయ్. పెద్దోళ్ళే కానిపన్లు చేస్తూ, మమ్మల్ని వాడుకుంటున్నారు. సరోజమ్మ కూడా ముందు మొగం చిట్లించుకునేది. ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా తీసుకుంటోంది. ఆవిడా బానే వుంది. మీ ఆయనా బానే ఉన్నాడు. మధ్యలో నాదేముంది? పనిదాన్ని, ఏది మంచీ, ఏది సెడో మీలాంటి గొప్పోళ్లకే తెలియాలి’ అని ఎదురు తిరిగింది. ‘పోలీసోళ్లకి అప్పగిస్తాను చూడు. మా పెత్తల్లి కొడుకు ఇక్కడే టూటౌన్ పోలీసు స్టేషన్లో పని చేస్తున్నాడు. వాడికి చెబ్దువుగాని ఏం చెప్తావో’ అంటూ దబాయించింది తను. ‘మారాజులాగ తీసుకెళ్ళండి. వస్తాను. వెళ్ళి మీ ఆయన గురించి చెప్తాను. ఇవాళ ఫస్టుషో ఆట సినిమాకి సరోజమ్మని రమ్మనమని కబురు సెప్పమన్నాడు. అదీ సెప్తాను టేషన్లో…’
‘‘ఆగాగు, సినిమాకి రమ్మనమన్నారా? కాస్తుండు. ఆలోచించనీ..”
సినిమా హాలు దగ్గర వెయిట్ చేస్తున్న వెంకట్రావు చాలా టెన్స్‌గా ఫీలవుతున్నాడు. ‘సరోజ వస్తుందా, రాదా? వస్తే తన మీద ఇంట్రస్టు ఉందనుకుని ముందుకు సాగవచ్చు, రాకపోతే కథ కంచికి అన్నమాట. విషయం ఇవాళ తేలిపోతుంది.’
వాల్‌పోస్టర్లు చూస్తూండగా అతని భుజం మీద చేయిపడింది. తిరిగి చూస్తే సరోజ భర్త పద్మనాభం! ‘ఏమిటి సార్ సినిమాకు రమ్మని పిల్చేరు. ఏమిటి విశేషం? కాంప్లిమెంటరీ టిక్కెట్లు దొరికాయా?’ అంటూ పలకరించేడు. ‘అవునవును. అదేఅదే…’ అని జవాబిచ్చి లోపలకి తీసుకెళ్లాడు. సినిమా చూస్తున్నాడన్నమాటే కానీ ఏవీ అర్థం కావటం లేదు. బుర్ర వేడెక్కిపోతోంది ‘సరోజ తను రాకుండా మొగుణ్ణి పంపిందంటే అర్థం ఏమిటి? జాగ్రత్త, మా ఆయనకి చెప్తాను అని వార్నింగిచ్చిం దన్నమాట. అల్లరిపడి, అల్లరి పెట్టకుండా చాలా సున్నితంగా వెధవ్వేషాలేస్తే నా మొగుడికి చెప్తాను సుమా’ అని హెచ్చరించిం దన్నమాట. మొగుడికి ఏం చెప్పి పంపించిందో?’
సినిమా చూసి నవ్వుతూన్న పద్మనాభం ‘ఏమిటి సార్? అదోలా ఉన్నారు?’ అని అడిగాడు. ‘బోరుగా ఉంటేనూ…’ అని వెంకట్రావు అంటే ‘ఫస్ట్ హాఫనవరూ యిలాగే ఉంటుందని, తర్వాత యింట్రస్టింగుగా ఉంటుందని మొన్న మీ మిసెస్ చెప్పారు.’ అన్నాడు పద్మనాభం. ‘రత్నమాలతో వీడెప్పుడు ముచ్చట్లు పెట్టుకున్నాడు? వీడికిదేం పని? నా బూతులలవాటు చూసి, భార్య అసంతృప్తితో ఉండుంటుందని నాలాగే లెక్కేసి, తనకు లైనేస్తున్నాడా? అమ్మో, యికనైనా వాక్‌శూరత్వం ఆపి, కార్యశూరుడ ననిపించుకోవాలి.’ అని నిశ్చయించుకున్నాడు.
‘వ్యథా వనితాయణం’లో మరో కథ వచ్చే నెల మొదటి బుధవారం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2022)