మెగాస్టార్ చిరంజీవి ట్రోల్ అవుతున్నారు. ఆయన ఒకసారి ఇచ్చిన స్టేట్ మెంట్ ట్రోల్స్ వల్ల వేల సార్లు షేర్ అవుతోంది. లక్షల మందికి చేరుతోంది. ఇదంతా 'ఆచార్య' సినిమా గురించి వచ్చిన గొడవ. తన తాజా సినిమా ప్రమోషన్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా విషయంలో దర్శకుడు ఏం చెబితే అది చేసినట్టుగా చెప్పుకున్నారు. ఈ మాట చెప్పకపోయినా చిరంజీవిని ఆచార్య సినిమా గురించి అడిగేది ఎవరూ లేరు!
అయితే.. తనను తను క్లీన్ అని నిరూపించుకునే తాపత్రయంలో భాగంగా ఆచార్య సినిమా విషయంలో తను జోక్యం చేసుకోలేదన్నట్టుగా చిరంజీవి చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇది కాస్తా రివర్స్ అవుతోంది. విశేషం ఏమిటంటే.. చిరంజీవి గత సినిమాల విషయంలో అతిగా జోక్యం చేసుకున్నట్టుగా ఎప్పుడూ ప్రచారం జరగలేదు. ప్రత్యేకించి ఆచార్య మేకింగ్ దశలోనే ఈ ప్రచారం ఊపందుకుంది. కొరటాల పనితీరుపై చిరంజీవి అసంతృప్తిగా ఉన్నారని.. ఆ సినిమాకు సంబంధించి అన్ని క్రాఫ్ట్స్ నూ తను నిర్దేశించడమే కాదు, ఒక దశలో ఆ సినిమాకు తనే దర్శకత్వం వహించినట్టుగా కూడా మేకింగ్ దశలోనే ప్రచారం మొదలైంది.
గతంలో 'స్టాలిన్' విషయంలోనూ ఇదే ప్రచారం జరిగింది. తమిళ దర్శకుడు మురుగదాస్ ను ఆఖర్లో పక్కన పెట్టారని.. యాక్షన్ సీక్వెన్స్ ల చిత్రీకరణలో చిరంజీవితో సహా పవన్ కల్యాణ్ కూడా జోక్యం చేసుకున్నట్టుగా అప్పట్లో గట్టి ప్రచారం జరిగింది. అయితే అప్పట్ల మురుగదాస్ కు కూడా నోరు విప్పేంత సీన్ లేదు. హీరో డ్యామినేటెడ్ ఇండస్ట్రీలో, ప్రత్యేకించి స్టార్ హీరోల విషయంలో నోరు విప్పితే ఆ దర్శకుల పరిస్తితి ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు!
హిట్ అయితే హీరో ప్రోత్సాహంతోనే సినిమా హిట్ అయ్యిందని చెప్పాలి తప్ప అంతకు మించి చెప్పుకునే తాహతు తెలుగు దర్శకులకు లేదు. అలాంటిది ఇప్పుడు ఆచార్య విషయంలో కొరటాల శివ స్పందిస్తారనుకునే వాళ్లెవ్వరూ ఉండరు! అయితే.. కొరటాల స్పందించనక్కర్లేదు. చిరంజీవి స్పందనే రివర్స్ అవుతోంది. మరి కొందరు ఔత్సాహికులు.. గతంలో మహేశ్ బాబు ఇచ్చిన స్టేట్ మెంట్ ను కూడా యాడ్ చేస్తున్నారు.
తన సినిమా ఒకటి ఫ్లాప్ అయితే.. అందుకు తనే కారణం అంటూ మహేశ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ కథను ఎంచుకున్నది తనే కాబట్టి ఆ సినిమా ఫ్లాప్ కు తనే కారణమంటూ మహేశ్ చెప్పాడు. హిట్ అయితే.. ఆ కథ ఎంపికకు తనను తానే మెచ్చుకోవచ్చని కూడా మహేశ్ చెప్పుకున్నాడు. మరి.. మహేశ్ కు ఉన్న పాటి పరిణతి కూడా మెగాస్టార్ కు లేదా? అన్నట్టుగా ఆయన స్టేట్ మెంట్ విషయంలో ట్రోల్స్ కొనసాగుతూ ఉన్నాయి.