మొన్నటి వరకూ ఆయనొక ఉపప్రాంతీయ వాది. ఆయనదొక ఉపప్రాంతీయ పార్టీ. ఆ ప్రాంతీయ వాదంతో ఒక పెద్ద రాష్ట్రాన్ని విడదీయించుకున్నారు. కేంద్రంలోని ప్రభుత్వం తన బలాన్ని ఉపయోగించుకుని, రాజకీయ స్వార్థంతో మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విడదీసింది. సరే.. జరిగిందేదో జరిగింది అనుకోవచ్చు.
మరి ఇంతలోనే సదరు ఉపప్రాంతీయ వాది జాతీయ వాదాన్ని వినిపిస్తున్నారు. జాతీయ పార్టీ అని అంటున్నారు. మరి తన రాజకీయ ఎదుగుదలతో ప్రాంతీయ వాదాన్ని వినిపించిన సదరు నేత, ఇప్పుడు మరో మెట్టు ఎదగడానికి జాతీయ పార్టీ అంటే.. సర్వత్రా సమ్మతం వ్యక్తం అవుతుందా? అనేది శేష ప్రశ్న. మరి ఈ ప్రశ్నకు సమాధానం ముందస్తుగానే లభిస్తోంది. జాతీయ పార్టీ అని అంటున్న కేసీఆర్ ఏం చెప్పి పక్క రాష్ట్రాల నుంచి ప్రజల మద్దతు పొందుతారు? అనే ప్రశ్నకే సమాధానం లేదు!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాకా.. హైదరాబాద్ లో ప్రాంతీయ విద్వేషాలు రేకెత్తకపోవడం మంచి పరిణామమే. ఇలాంటి వాటికి టీఆర్ఎస్ ప్రోత్సాహం ఇవ్వకపోవడమూ మంచిదే. అభివృద్ధి కావాలంటే ప్రాంతీయ విద్వేషాలతో ప్రయోజనం ఉండదని కేసీఆర్ గ్రహించారు. అందుకే హైదరాబాద్ లో అలాంటి రచ్చలు లేవు. మరి ఇదే కేసీఆర్ జాతీయ పార్టీకి అర్హత కాదు!
ఇప్పటికే ఉన్న జాతీయ పార్టీలే రాష్ట్రాల మధ్యన తగవులను తీర్చలేకపోతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. రాష్ట్రాల మధ్యన నీటి తగవులు తెగడం లేదు. ఒక్కో రాష్ట్రంలో ఆ పార్టీల రాష్ట్ర శాఖలే ఒక్కోలా మాట్లాడుతూ ఉంటాయి. కర్ణాటక, తమిళనాడు నీటి వివాదంలో బీజేపీ కర్ణాటక శాఖ ఒకలా, ఉందో లేదో తెలియని తమిళనాడు శాఖ మరోలా మాట్లాడుతూ ఉంటుంది. కర్ణాటక- గోవా జలవివాదాల్లో కూడా.. బీజేపీది ఆయా రాష్ట్రాల్లో ఆయా విధంగా ఉంటుంది. మరి ఇప్పటికే ఎస్టాబ్లిష్డ్ జాతీయ పార్టీలకే ఒక విధానం లేదు.
అలాంటిది ఉపప్రాంతీయ వాదంతో.. ఎగసిన కేసీఆర్ కు తన సరిహద్దు రాష్ట్రాల్లో ఆమోదం లభిస్తుందనేది పగటి కలే. తెలంగాణ సీఎంగా ఆయనను పక్క రాష్ట్రాల వాళ్లు ద్వేషించకపోవచ్చు కానీ, ఉప ప్రాంతీయ తీరుతో వ్యవహరించిన నేతను తమకు కూడా నేతగా నెత్తికెత్తుకునేంత పెద్ద మనసు దక్షిణాది రాష్ట్రాల్లోనే లేదు. మరి కేసీఆర్ కు ఇదంతా తెలియదా అంటే.. తెలియక అయితే కాదు!