టీడీపీ యువకిశోరం నారా లోకేశ్‌కు చావులు ఊపిరి పోస్తాయా? ఇప్పుడిదే ప్రధాన ప్రశ్న. ఆధిపత్య, ప్రేమోన్మాద హత్యల నుంచి లోకేశ్ రాజకీయ భవిష్యత్‌కు ప్రాణం పోయాలని చంద్రబాబు పరితపిస్తున్నట్టుగా… ఆయన వాలకం చూస్తే అర్థమవుతోంది. హత్యల సందర్భంలో భావోద్వేగాల నుంచి రాజకీయ ప్రయోజనాలను పిండుకోవాలనే టీడీపీ ఎత్తుగడలను ప్రజానీకం జాగ్రత్తగా గమనిస్తోంది. ఇలాంటి చావులతోనే లోకేశ్ భవిష్యత్ ముడిపడి ఉందనే టీడీపీ ఆలోచన భయం కలిగిస్తోంది.
అసలే టీడీపీ…ఆపై సినిమాను తలపించే తలపించే సీన్‌ను క్రియేట్ చేయడంలో ఆ పార్టీకి ఏదీ సాటిరాదనే అభిప్రాయం బలంగా ఉంది. అందుకు తగ్గట్టుగానే గుంటూరులో రమ్య హత్యానంతరం టీడీపీ చేసిన యాగీ అంతా ఇంతా కాదు. రమ్య హత్య కంటే నారా లోకేశ్‌ను అరెస్ట్ చేయడమే పెద్ద నేరమన్న ధోరణిలో టీడీపీ, దాని అనుకూల మీడియా వ్యవహరిస్తోంది. దీంతో టీడీపీ, ఎల్లో మీడియా నైజం ఏంటో జనం కళ్లకు కట్టినట్టు తెలిసొస్తోంది.
టీడీపీ నేత లోకేశ్‌ను పోలీసులు అరెస్టు చేసి… పలు స్టేషన్ల చుట్టూ తిప్పి వదిలేశారు. ఇదేమీ కొత్తకాదు. ఇందుకు లోకేశ్ అతీతమైన నాయకుడు అంతకంటే కాదు. కనీసం మంగళగిరిలో గెలవలేని లోకేశ్, తమ పార్టీని వచ్చే ఎన్నికల్లో గట్టెక్కించే రథసారథిగా టీడీపీ ఎంచుకోవడంలోనే, ఆ పార్టీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.
లోకేశ్ అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల ఆందోళనలు దేనికి సంకేతం? రమ్య హంతకులను ఫలానా రీతిలో శిక్షించాలనే డిమాండ్‌తో ఆందోళనలు చేసి ఉంటే జనం మెచ్చేవాళ్లు. కానీ రాష్ట్రమంతా రమ్య హత్యపై ఆందోళనగా ఉంటే… టీడీపీకి మాత్రం లోకేశ్ అరెస్ట్ ప్రాధాన్య అంశమైంది. రాష్ట్రమంతా ఒక దారైతే టీడీపీది మాత్రం లోకేశ్ దారి అనే చందంగా తయారైంది. ఇంతకంటే దివాళాకోరుతనం ఇంకేదైనా ఉంటుందా?