టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ ఇంకెన్నాళ్లు..?

ఊరూవాడా పండగ వాతావరణం.. స్కూళ్లలో నాడు-నేడు ఉత్సవం. దానిపై నుంచి దృష్టి మరల్చేందుకు నారా లోకేష్ అరెస్ట్ వ్యవహారం. ఊరూవాడా టీడీపీ నిరసన కార్యక్రమం. రాష్ట్రంలో ఏ అభివృద్ధి పథకం ప్రారంభమైనా ఏదో ఒక…

ఊరూవాడా పండగ వాతావరణం.. స్కూళ్లలో నాడు-నేడు ఉత్సవం. దానిపై నుంచి దృష్టి మరల్చేందుకు నారా లోకేష్ అరెస్ట్ వ్యవహారం. ఊరూవాడా టీడీపీ నిరసన కార్యక్రమం. రాష్ట్రంలో ఏ అభివృద్ధి పథకం ప్రారంభమైనా ఏదో ఒక అవాంతరం సృష్టించేందుకు మారీచ, సుబాహుల్లా ఎదురు చూస్తుంటారు టీడీపీ నేతలు. నిన్న కూడా వారు అదే పని చేశారు.

నాడు-నేడు కార్యక్రమాన్ని చాలా ముందుగానే ప్రకటించింది ప్రభుత్వం. తొలి విడత నాడు-నేడు పనుల్ని ప్రజలకు అంకితం చేయడంతో పాటు, మలి విడత నాడు-నేడు పనుల్ని కూడా వెంటనే ప్రారంభిస్తామని తెలిపింది. అదే రోజు స్కూళ్లు పునఃప్రారంభమవుతాయని చెప్పింది. జగనన్న విద్యా దీవెన కిట్లు కూడా అదే రోజు పంచిపెడతామని స్పష్టం చేసింది. అంటే ఒకేరోజు మూడు పండగలు. ఒకదాన్ని మించి ఒకటి.
 
నాడు-నేడు కార్యక్రమంతో దాదాపుగా రాష్ట్రంలోని స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయి. ప్రతిపక్ష నేతలు, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు కూడా తమ హయాంలో ఇలాంటి పని ఎందుకే చేయలేదబ్బా అని బాధపడే సందర్భం. దీంతో ఎలాగైనా దీనిపై నుంచి దృష్టి మరల్చేందుకు టీడీపీ వ్యూహాలు పన్నింది. అనుకోకుండా వారికి రమ్య హత్యోదంతం కలసి వచ్చింది.

వాస్తవానికి రమ్య హత్య అనేది ఓ ఉన్మాది చర్య. తదనంతరం జరిగిన హత్య. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి, సోషల్ మీడియా ప్రభావంతో భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగవన్న గ్యారెంటీ కూడా లేదు. కానీ ఈ హత్య విషయంలో ప్రభుత్వం ఆఘమేఘాల మీద స్పందించింది. గంటల వ్యవథిలో నిందితుడ్ని పట్టుకోవడంతో పాటు.. బాధితురాలి కుటుంబానికి రూ.10లక్షలు పరిహారంగా ప్రకటించింది.

అంతటితో ఆ వ్యవహారం సద్దుమణిగిందని అనుకున్నారంతా. కానీ అందులో నుంచి టీడీపీ రాజకీయ అస్త్రాన్ని బయటకు తీసింది. చనిపోయిన అమ్మాయి దళిత బిడ్డ కావడంతో టీడీపీ అగ్నికి ఆజ్యం పోసింది. దళితుల్ని, మహిళల్ని రెచ్చగొట్టి పబ్బం గడపాలనుకుంది. అంతిమంగా వారి ఆందోళన, నిరసన కార్యక్రమాలక పరమార్థం ఒక్కటే. నాడు-నేడు కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడం.

సీఎం జగన్ నాడు-నేడు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన కాసేపటికే.. లోకేష్ గుంటూరులో ఎంట్రీ ఇచ్చారు. వాస్తవానికి ఆయన పరామర్శకు వెళ్లడానికి మందీ మార్బలం అవసరం లేదు. కానీ మాజీ మంత్రుల్ని వెంటబెట్టుకుని, లోకల్ లీడర్స్ ని కలుపుకొని, కార్యకర్తల్ని తోడు తీసుకుని రమ్య కుటుంబంపైకి దండయాత్రలా వెళ్లారు. ఇంకా పోలీసులు రాలేదేందబ్బా అనుకుంటూ చాలా సేపు అక్కడే గడిపారు. పరామర్శ పూర్తయినా ఇంకా పోలీసులు రాలేదు. దీంతో ఆ ప్రాంతంలోనే రోడ్డుపై ఉండి చర్చలు మొదలు పెట్టారు.

దీంతో చివరికి పోలీసులు ఎంట్రీ ఇచ్చి లోకేష్ ని వెళ్లిపోవాలని సూచించారు. అవకాశం వచ్చింది కదా అని లోకేష్ ఎదురు తిరిగి అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లి పెద్ద సీన్ క్రియేట్ చేశారు. అలా చినబాబుని అరెస్ట్ చేశారో లేదో, ఇలా జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో టీడీపీ నేతలు ఆయన అరెస్ట్ కి నిరసనగా రోడ్లపైకి వచ్చారు.

వాస్తవానికి రమ్య హత్య తర్వాత శశి కృష్ణ లాంటి మృగాళ్లకు కఠిన శిక్ష పడాలంటూ ప్రజా సంఘాలు రోడ్డెక్కాల్సి ఉంది. కానీ విచిత్రంగా టీడీపీ నేతలు లోకేష్ ని విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగారు. టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా కూడా నాడు-నేడుని వ్యూహాత్మకంగా పక్కనపెట్టి లోకేష్ ని హైలెట్ చేసింది.

డైవర్షన్ – డైవర్షన్..

ఇదే కాదు, గతంలో కూడా జగన్ ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టినా టీడీపీ ఇలాంటి కుటిల పన్నాగాలతో ప్రజల్లోకి వచ్చేది. జగన్ నవరత్నాల్లో భాగంగా ఒక్కో పథకాన్ని ప్రారంభించిన ప్రతిసారి, దానికి వ్యతిరేకంగా ఓ ఇష్యూను పైకి తెచ్చి డైవర్షన్ చేసింది టీడీపీ. 

జగన్ కి పోటీగా చంద్రబాబుని, లోకేష్ ని హైలెట్ చేస్తూ చూపించేది అనుకుల మీడియా. జూమ్ కాన్ఫరెన్స్ లు ఇటీవల బాగా బోర్ కొట్టడంతో.. ఈ దఫా లోకేష్ అరెస్ట్ కి సైతం సిద్ధపడ్డారు. నాడు-నేడుపై తమ అక్కసు వెళ్లగక్కారు.