అమెరికాలో న‌ల్ల‌వాళ్ల జీవితాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టే చిత్రాలు!

వాళ్ల‌ను న‌ల్ల‌వాళ్లు అన‌డం నేరం అనేది అమెరిక‌న్లే! బ్లాక్స్ అన‌కూడ‌ద‌ని వాళ్లే చెబుతారు. అలాగే నీగ్రో, నిగ్గ‌ర్స్ అనే ప‌దాలు అత్యంత తీవ్ర‌మైన‌వి! వాటిని కాస్త సాఫ్ట్ చేసి బ్లాక్స్ అని కూడా అన‌కూడ‌దు,…

వాళ్ల‌ను న‌ల్ల‌వాళ్లు అన‌డం నేరం అనేది అమెరిక‌న్లే! బ్లాక్స్ అన‌కూడ‌ద‌ని వాళ్లే చెబుతారు. అలాగే నీగ్రో, నిగ్గ‌ర్స్ అనే ప‌దాలు అత్యంత తీవ్ర‌మైన‌వి! వాటిని కాస్త సాఫ్ట్ చేసి బ్లాక్స్ అని కూడా అన‌కూడ‌దు, ఆఫ్రిక‌న్-అమెరిక‌న్స్ అనాలి. ఇదీ అమెరిక‌న్లు చెప్పే మాటే. మ‌రి ఆ తేడా కూడా ఎందుకు? వాళ్లు అమెరికాలోనే పుట్టి పెరిగారు, నాలుగు వంద‌ల సంవ‌త్స‌రాల నుంచి వాళ్ల కుటుంబాలు అమెరికాలోనే ఉన్నాయి. అలాంట‌ప్పుడు వాళ్లు ఎందుకు అమెరిక‌న్లు కారు? ఇంకా వాళ్లు ఎందుకు ఆఫ్రిక‌న్-అమెరిక‌న్లుగానే పిలిపించుకోవాలి? బ‌హుశా ఈ ప్ర‌శ్న‌కు మాత్రం వైట్ అమెరిక‌న్లు స‌మాధానం ఇవ్వ‌రేమో! ఆఫ్రిక‌న్-అమెరిక‌న్లు అంటూ వాళ్ల‌ను వేరే చేసి పిల‌వ‌డం వివ‌క్ష కాదా?  వాళ్లేమీ వేరే మతాచారాల‌నూ పాటించ‌డం లేదు వేరే గ్రూప్ గా వ్య‌వ‌హ‌రించ‌డానికి. కేవ‌లం వాళ్ల రంగు-రూపుల‌ను వేరే చేసి చెప్ప‌డానికే ఆఫ్రిక‌న్-అమెరిక‌న్ లంటూ పిలుస్తున్నారు. వేరు చేసి చూడ‌టం స‌హ‌జం అయిన‌ప్పుడు వాళ్ల‌ను ఏ పేరుతో పిలిస్తేనేం? వివ‌క్ష వారి స‌మాజంలో భాగం అయిన‌ప్పుడు ఏ పేరుతో పిలిస్తే కానీ వాళ్ల‌కు స‌మాన‌హ‌క్కులు ల‌భిస్తాయి?

అమెరికాలో వారి ఘోష ఈనాటిది కాదు. వారి రోద‌న శ‌తాబ్దాలుగా అర‌ణ్య‌రోద‌నే అవుతూ ఉంది. వాళ్ల‌ను అక్క‌డ‌కు తెచ్చుకుంది తమ‌ను తాము సుపీరియ‌ర్లుగా ఫీల‌య్యే తెల్ల‌జాతివాళ్లే! బానిస‌లుగా తెచ్చుకున్నారు. వాళ్ల రూపు దృఢంగా క‌నిపించేస‌రికి ప‌నికి ప‌నికొస్తార‌ని తెచ్చుకున్నారు. వాళ్ల రంగు మాత్రం వివ‌క్ష‌తో చూడ‌టానికి కార‌ణం అయ్యింది. అవుతూనే ఉంది. వారి రంగు మార‌దు-వీరి వివ‌క్ష పూరిత ధోర‌ణీ పోదు!

శ‌తాబ్దాలుగా అనేక పోరాటాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ఎట్ట‌కేల‌కూ దాదాపు 150 సంవ‌త్స‌రాల కింద‌ట బానిస‌త్వాన్ని అయితే అధికారికంగా ర‌ద్దు చేయించుకోగ‌లిగారు కానీ, వివ‌క్ష మాత్రం మాన‌డం లేదు. బానిస‌త్వాన్ని ర‌ద్దు చేయ‌డం విష‌యంలో కూడా చాలా తీవ్ర‌మైన పోరాట‌మే జ‌రిగింది. బానిస‌త్వాన్ని ర‌ద్దు చేస్తూ నాటి అమెరిక‌న్ ప్రెసిడెంట్ అబ్ర‌హం లింక‌న్ నిర్ణ‌యం తీసుకోగా.. అమెరికాలోని రాష్ట్రాలు దాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించాయి! అమెరికా విడిపోయింది. సివిల్ వార్ జ‌రిగింది. అమెరికాలోని ద‌క్షిణాది రాష్ట్రాలు బానిస‌త్వం ఉండాల్సిందే అని ప‌ట్టుబ‌డ్డాయి. అది ఏ మ‌ధ్య‌యుగంలోనో కాదు.. 1850 స‌మ‌యంలో అమెరిక‌న్ సివిల్ వార్ జ‌రిగింది. సౌత్, నార్త్ వేరై పోరాడ‌గా, నార్త్ గెలిచింది. బానిస‌త్వం ర‌ద్దు అయ్యింది. అయితే బానిస‌ల బ‌త‌కుల్లో మాత్రం వెలుగు రాలేదు. అధికారికంగా బానిస‌త్వం ర‌ద్దు అయినా.. వారిని త‌క్కువ చూడ‌టం ఆగ‌లేదు. అది కొన‌సాగుతూ ఉంది.

అమెరిక‌న్ సివిల్ వార్ కు కాస్త పూర్వ‌పు ప‌రిస్థితుల గురించి ద‌ర్శ‌కుడు క్వెంట‌న్ ట‌రంటినో ఒక సినిమాతో క‌ళ్ల‌కు క‌ట్టాడు. ఆ సినిమా పేరే 'జాంగో-అన్ చైన్డ్'. అమెరిక‌న్ ద‌క్షిణాది రాష్ట్రాల్లో బానిస‌ల కొనుగోళ్లు, అమ్మ‌కాల‌కు సంబంధించి జ‌రిగే సంత‌లు, బానిస‌ల‌ను తెల్ల అమెరిక‌న్లు ఎలా ట్రీట్ చేసేవాళ్లు, వాళ్ల‌ను ఎంత‌లా హింసించే వాళ్లు, వాళ్ల‌తో ఎలా గొడ్డు చాకిరీ చేయించుకునే వాళ్లు, ఎదురు చెప్పిన బానిస‌లను ఎలాంటి శిక్ష‌ల‌తో టార్చ‌ర్ చేసే వాళ్లు అనే అంశాల గురించి ఆ సినిమాలో అనేక సీన్ల‌లో ఒళ్లు జ‌ల‌ద‌రించేలా చూపించారు. ఆ సినిమాలోని స్టార్టింగ్ సీన్ల‌లో ఒక న‌ల్ల‌జాతీయుడు గుర్రం మీద వెళ్తున్న‌ప్పుడు అక్క‌డి తెల్ల‌జాతీయులు వ్య‌క్తీక‌రించే ఆశ్చ‌ర్యం, గుర్రం మీదు వెళ్తున్న అత‌డి విష‌యంలో అక్క‌డి వాళ్లు ఆక్షేపించ‌డం, అది నేర‌మ‌ని తేల్చి చెప్ప‌డం.. ఇవ‌న్నీ జాంగోలో క‌నిపిస్తాయి.

అది కూడా ఆ న‌ల్ల‌జాతీయుడు సొంత ధైర్యంతో గుర్రం ఎక్క‌డి ఉండ‌డు. ఒక జ‌ర్మ‌న్ తెల్ల‌వాడు ఇచ్చిన ప్రోద్భ‌లంతో గుర్రం మీద ప్ర‌యాణిస్తూ ఉంటాడు. ఇక వ్య‌వ‌సాయ ప‌నుల్లో న‌ల్ల‌వాళ్ల చేత చేయించుకునే గొడ్డు చాకిరీ, వాళ్ల ప్రాణాల‌కు య‌జ‌మానులు ఇచ్చే విలువ ఇవ‌న్నీ జాంగోలో తేట‌తెల్లంగా చూపించారు. ఆ సినిమా క్లైమాక్స్ కొంచెం సినిమాటిక్ గా ఉంటుంది. న‌ల్ల‌జాతివ్య‌క్తి గెలుపుతో ఆ సినిమా ముగుస్తుంది. అయితే వాస్త‌వంలో అలా జ‌రిగిఉండే అవ‌కాశాలు ఉండ‌క‌పోవ‌చ్చు.

జాంగో అనే ఆఫ్రిక‌న్-అమెరిక‌న్ మూలాల వ్య‌క్తి కథ‌గా, వాస్త‌వ ప‌రిణామాల ఆధార‌మైన సినిమాగా అది ఆక‌ట్టుకుంది. మ‌రి అలాంటి సినిమాలు చూసేట‌ప్పుడు తెల్ల‌జాతి అమెరిక‌న్లు ఎలా స్పందించారో కానీ అది హిట్టైంది. అయితే న‌ల్ల‌జాతీయులు ఆ సినిమా ప‌ట్ల కొంత ఆక్షేప‌ణ తెలిపారు. సినిమాలో అవ‌స‌రానికి మించి 'నిగ్గ‌ర్' అనే దూష‌ణ‌ను ప‌దే ప‌దే వాడార‌ని వారు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

జాంగో 150 యేళ్ల కింద‌టి నాటి పరిస్థితుల ఆధారంగా రూపొందిన సినిమా.  ఆ సినిమాలోనూ అలాంటి ప‌రిస్థితులే చూపించి, 1964లో జ‌రిగిన వాస్త‌విక ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన 'మిస్సిసిపీ బ‌ర్నింగ్' వంటి సినిమాలోనూ దాదాపు అదే ప‌రిస్థితుల‌నే చూపించారంటే అమెరికా ఏం మార‌లేద‌ని స్ప‌ష్టం అవుతుంది.

1962లో మార్టిన్ లూథ‌ర్ కింగ్ ఆధ్వ‌ర్యంలో హ‌క్కుల ఉద్య‌మం సాగింది. న‌ల్ల‌జాతి పిల్ల‌ల‌కు వేరే స్కూళ్ల‌ను నిర్వ‌హించ‌డం, బ‌స్సుల్లో వాళ్ల‌కు ప్ర‌త్యేక సీట్లు..ఇలాంటి వ్య‌వ‌స్థీకృతం అయిన వివ‌క్ష ప‌ట్ల నిర‌స‌న‌తో సాగిన ఆ శాంతీయుత ఉద్య‌మంతో ప‌రిస్థితి కొంత వర‌కూ మార్పు వ‌చ్చింది. న‌ల్ల‌జాతి పిల్ల‌ల‌కు కూడా తెల్ల‌జాతివారి పిల్ల‌లు చ‌దివే పాఠ‌శాల‌ల్లోకి వెళ్లేందుకు ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పించ‌డంపై తెల్ల‌జాతీయులు తీవ్ర నిర‌స‌న తెలిపారు. నల్ల‌జాతి పిల్ల‌ల‌ను త‌మ పిల్ల‌ల‌తో క‌లిసి చ‌ద‌వ‌నీయ‌రాద‌ని వాళ్లు రోడ్డెక్కి నిర‌స‌న‌లు తెలిపారంటే వివ‌క్ష ఎంత బ‌లంగా ఉండిందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఒక‌వైపు న‌ల్ల‌జాతి వారి నుంచి స‌మాన‌త్వ డిమాండ్ తో ఉద్య‌మాలు జ‌రుగుతున్నా, తెల్ల‌వాళ్లు వివ‌క్ష కొన‌సాగాలంటూ ఉద్య‌మాలు చేశారు. ఇదంతా  50 యేళ్ల కింద‌టి వ‌ర‌కూ జ‌రిగిందే! లూథ‌ర్ కింగ్ ను హ‌త్య చేశారు. హ‌క్కుల కోసం పోరాడిన మాల్కం ఎక్స్ కూడా తుపాకీ తూటాల‌కు బ‌ల‌య్యాడు! ఎవ్వ‌రినీ వ‌ద‌ల్లేదు తెల్ల‌జాతి దురాహంకారులు.

ఈ హ‌క్కుల పోరాటంలో భాగ‌స్వామ్యులు అయిన ముగ్గురు కుర్రాళ్ల హ‌త్య గురించి రూపొందించిన సినిమా మిస్సిసిపీ బ‌ర్నింగ్. మిస్సిసిపీలో ఈ వివ‌క్ష‌లు ఎక్కువ‌. హ‌త్య‌కు గురైన ఆ ముగ్గురిలో యూధు కుర్రాళ్లు కూడా ఉంటారు. యూధులు కూడా నిగ్గ‌ర్ల‌లా దుర్వాస‌న వ‌స్తారంటూ ఆ సినిమాలో ఒక డైలాగ్ చెప్పించారు తెల్ల‌జాతి ఆర్టిస్ట్ తో. వాళ్ల‌ను హ‌త్య చేసిన వారిని స్థానిక పోలీసులు కాపాడ‌టం, ఆ మిస్సింగ్ కేసును వారు డైల్యూట్ చేయ‌డం.. వ్య‌వ‌స్థీకృతంగా వివ‌క్ష ఎంత బ‌లంగా వేళ్లూనుకుపోయిందో స్ప‌ష్టం అవుతుంది. చివ‌ర‌కు దోషుల‌ను ఎఫ్బీఐ ప‌ట్టుకోవ‌డం, శిక్షించ‌డంతో క‌థ ముగుస్తుంది.

ఇంకా అమెరికాలో న‌ల్ల‌జాతి వారి ప‌రిస్థితుల గురించి బోలెడ‌న్ని సినిమాలు వ‌చ్చాయి. '12 ఇయ‌ర్స్ ఏ స్లేవ్' సినిమా కూడా ఒక వాస్త‌వ క‌థ‌. త‌న జీవితంలో బానిస‌గా బ‌తికిన 12 సంవ‌త్స‌రాల వ్య‌థ గురించి ఒక ఆఫ్రిక‌న్-అమెరిక‌న్ రాసిన పుస్త‌కం ఆధారంగా ఆ సినిమా రూపొందించారు. త‌ను బానిస కాక‌పోయినా, అత‌డిని అమ్మేసి ఉంటారు. త‌ను బానిస కాద‌ని నిరూపించుకోవ‌డానికి అత‌డు అనేక పాట్లు ప‌డ‌తాడు. దాన్ని బ‌ట్టి న‌ల్ల‌జాతి వాళ్ల‌లో కూడా కొంద‌రు ఫ్రీమెన్ ఉండే వార‌ని అర్థం అవుతుంది. అదే స‌మ‌యంలో 'జాంగో'లో ఒక న‌ల్ల‌జాతి వాడే పొలాల్లో ప‌ని చేసే త‌న లాంటి వాళ్ల‌ ను హింసిస్తూ ఉంటాడు. య‌జమానికి దారుణ‌మైన స‌ల‌హాలు ఇస్తూ ఉంటాడు. దాన్ని బ‌ట్టి న‌ల్ల‌జాతి వాళ్ల‌లోనూ కొంద‌రు త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం బానిసల‌ను హింసించార‌నే విష‌యం అర్థం అవుతుంది.

ఆ మ‌ధ్య వ‌చ్చిన అమెజాన్ వెబ్ సీరిస్ 'హంట‌ర్స్'లో ఇద్ద‌రు న‌ల్ల‌జాతి టీనేజ‌ర్లు త‌మ‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. కొంద‌రు విధ్వంస‌కారులు గురించి వారికి స‌మాచారం తెలుస్తుంది. వాళ్లలో ఒక న‌ల్ల‌మ్మాయి అంటుంది.. మ‌నం ఈ విష‌యాన్ని పోలీసుల‌కు చెబుదాం…అని, ఆ వెంట‌నే ఆమె స‌హ‌చ‌రుడు అంటాడు, 'మ‌న‌లాంటి న‌ల్ల‌వాళ్లు వెళ్లి ఈ విష‌యాన్ని చెబితే.. పోలీసులు ముందు మ‌న‌ల్ని లోప‌ల వేసి హింసిస్తారు..' అంటూ స‌మాజంలో వారి విలువ ఏమిటో ఆ పాత్ర‌ల చేత చెప్పించారు. హంట‌ర్స్ 1970లో జ‌రిగిన‌ట్టుగా చూపిన వెబ్ సీరిస్.

అనేక సినిమాల్లో ఇంకా న‌ల్ల‌జాతి వాళ్ల‌ను తెల్ల‌జాతి వాళ్లు చూసే దృష్టిని ప్ర‌స్తావించారు. అలాగే తెల్ల‌జాతి క్రిమిన‌ల్స్ న‌ల్ల వారి గురించి అత్యంత స‌హ‌జంగా ఆడే దుర్భాష‌ల‌ను కూడా హాలీవుడ్ సినిమాల్లో చూపించారు. న‌ల్ల‌జాతి వాళ్ల ప‌ట్ల అమెరిక‌న్ స‌మాజంలో వేళ్లూనుకుపోయిన వివ‌క్ష‌ను ప్ర‌పంచానికి అర్థం అయ్యేలా చూపింది హాలీవుడ్ సినిమాలే. ఇప్పుడు అమెరికాలో ప‌రిణామాల ప‌ట్ల హాలీవుడ్ ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు. వాళ్లు న‌ల్ల‌జాతికి వారికి అనుకూలంగా గ‌ళం విప్పుతున్నారు. క‌ళాకారులుగా త‌మ స్పంద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జ‌రిగిన దురాగ‌తాల‌ను చూప‌డ‌మే కానీ ఈ సినిమాలేవీ అమెరిక‌న్ల‌లో వివ‌క్ష‌ను మాత్రం పూర్తిగా తుడిచివేయ‌లేక‌పోతూ ఉన్నాయనేది సుస్ప‌ష్టం.

-జీవ‌న్ రెడ్డి.బి