నేటి నుంచి దేశ వ్యాప్తంగా ఆలయాల, మసీదుల, చర్చిల ఓపెన్ కు అధికారికంగా అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో దేశ వ్యాప్తంగా అన్ని ఆలయాలనూ అధికారికంగా తెరవడానికి అవకాశం లభించించినట్టుగా అవుతోంది. ఈ క్రమంలో లాక్ డౌన్ నేపథ్యంలో రెండున్నర నెలలుగా భక్తులకు దర్శనావకాశం లేకపోయిన తిరుమల్లో కూడా ఇక ఆ అవకాశం లభించనుంది. నేటి నుంచి శ్రీవారి దర్శన భాగ్యం లభించనుంది.
అయితే ఈ విషయంలో టీటీడీ పలు షరతులతో భక్తులకు దర్శనావకాశం ఇస్తోంది. ఈ క్రమంలో రెండు మూడు రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించనున్నారట. ఈ రోజుల్లో టీటీడీ ఉద్యోగులకు దర్శనానికి అనుమతి ఇచ్చి భౌతిక దూరం పాటించడం వంటి విషయాల్లో చర్యలు ఏ విధంగా తీసుకోవాలో టీటీడీ ఒక అంచనాకు రానుందని సమాచారం. 11వ తేదీ నుంచి సాధారణ భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారట.
భౌతిక దూరం పాటించడం, గంటకు ఐదు వందల మంది భక్తులను మాత్రమే అవకాశం, మాస్కులు, గ్లౌజ్ లు తప్పనిసరి.. వంటి నియమాలను టీటీడీ తప్పనిసరి చేయనుందని తెలుస్తోంది.
అలాగే తీర్థప్రసాదాలు ఏమీ ఉండవట. టైమ్ స్లాట్ లో టోకెన్ పొందాలి, అది ఉంటేనే తిరుమలకు అనుమతిస్తారు. దీని కోసం ప్రతి రోజూ అలిపిరి వద్ద మూడు వేల సర్వదర్శనం టోకెన్లను ఇస్తారట. ఒక రోజు ముందే భక్తులు టికెట్లను పొందవలసి ఉంటుంది. నేటి నుంచి ఆన్ లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. వీటిని పొందిన వారికి తిరుమల్లో గది పొందే అవకాశమూ ఉంటుంది.
10 యేళ్ల లోపు చిన్నారులకు, 65 దాటిన వ్యక్తులకు దర్శనభాగ్యం లేదని టీటీడీ స్పష్టం చేస్తోంది. అలాగే ప్రతి భక్తుడికీ థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ తప్పనిసరిగా చేయనున్నారట. ఇలాంటి బోలెడన్ని ఏర్పాట్లతో, అనేక షరతులతో ప్రస్తుతానికి శ్రీవారి దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంది పాలకమండలి.