నవ్విన నాపచేనే.. పాఠశాల విద్యపై జగన్ మార్కు

సీఎం జగన్ ఏడాది పాలనపై ప్రశంసలు ఎన్ని ఉన్నాయో.. విమర్శలు కూడా ఆ స్థాయిలోనే వస్తున్నాయి. అయితే విమర్శించేవారి స్థాయి చూస్తే మాత్రం వాటిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది. నవరత్నాల ఫలితాలు…

సీఎం జగన్ ఏడాది పాలనపై ప్రశంసలు ఎన్ని ఉన్నాయో.. విమర్శలు కూడా ఆ స్థాయిలోనే వస్తున్నాయి. అయితే విమర్శించేవారి స్థాయి చూస్తే మాత్రం వాటిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది. నవరత్నాల ఫలితాలు జగన్ ఘన విజయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు చేసినోళ్లు.. వారి పనితీరు చూసి శెహభాష్ అంటున్నారు. ఊరూరా సచివాలయాలేంటి అన్నోళ్లే.. ప్రజా సమస్యల పరిష్కారంలో వాటి పాత్ర ఎన్నదగినదని మెచ్చుకుంటున్నారు.

తాజాగా ప్రభుత్వ స్కూళ్లలో అమలవుతున్న సంస్కరణల ఫలితాలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. నేడు ఇంగ్లిష్ మీడియాన్ని విమర్శించినవాళ్లే.. రేపు ప్రభుత్వ స్కూళ్లకు పోటెత్తుతున్న విద్యార్థులను చూసి మెచ్చుకోక తప్పదు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో చదువు మానేసి ప్రైవేట్ స్కూల్స్ వైపు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరిగింది. జగన్ పాలనలో తొలి ఏడాదిలోనే కొత్తగా రెండున్నర లక్షలమంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు.

అమ్మఒడి పథకం కేవలం ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకే అనే పుకారుతో అలా జరిగిందని అనుకున్నా.. ఆ తర్వాత ఆ పథకం అన్నిస్కూళ్లకూ వర్తిస్తుందని తెలిసినా ఎవరూ వెనక్కి తిరిగి వెళ్లడానికి ఇష్టపడ లేదని సర్వేలు చెబుతున్నాయి. జగనన్న విద్యా కానుక పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలందరికీ స్కూల్ యూనిఫామ్, టై, షూస్, బ్యాగ్ అన్నీ ఉచితంగా ఇవ్వబోతున్నారు. ఈ విద్యాసంవత్సరం కోసం బడ్జెట్ లో 650 కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించారు.

ఇక నాడు-నేడుపథకం ద్వారా 10వేల కోట్లతో ప్రతి స్కూల్లో అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయి. మౌలిక వసతులు, మంచినీటి సౌకర్యం, టాయిలెట్లు, ప్రహరీ నిర్మాణం, ఆటస్థలం, ల్యాబ్, లైబ్రరీ వంటి సౌకర్యాలన్నీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా సమకూరుతున్నాయి. ఆగస్ట్ లో స్కూల్స్ తిరిగి ప్రారంభమయ్యే నాటికి ఈ పనులన్నీ పూర్తవుతాయి. అంటే ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ కనిపిస్తాయన్నమాట.

జగనన్న గోరుముద్ద పథకం కూడా ప్రభుత్వ స్కూళ్లవైపు విద్యార్థులు ఆకర్షితులవడానికి మరో కారణం. పల్లెటూళ్లయినా, పట్నమైనా.. ఉదయాన్నే దంపతులిద్దరూ పనులకు వెళ్లకపోతే కుదరని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో కొంతమందికి మాత్రమే పిల్లలకు లంచ్ బాక్స్ రెడీ చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. మిగతావాళ్లందరికీ ప్రభుత్వ స్కూళ్లు గొప్ప ఆసరా. వైసీపీ వచ్చాక మధ్యాహ్న భోజనం మరింత రుచికరంగా ఉండటంతో ఏడాదిలోనే ప్రభుత్వ స్కూళ్లలో భోజనం చేసే విద్యార్థుల సంఖ్య 15శాతానికి పెరిగింది.

ఇవన్నీ ఒకెత్తు అయితే, ఈ ఏడాది నుంచి అమలులోకి రాబోతున్న ఇంగ్లిష్ మీడియం మరో ఎత్తు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుందనే వార్త చాలామంది నిరుపేదలకు వరంగా మారింది. తాహతు లేకపోయినా.. పోటీ ప్రపంచంలో తమ పిల్లలు వెనకపడకూడదనే ఉద్దేశంతో చాలామంది అప్పోసప్పో చేసి మరీ కార్పొరేట్ స్కూళ్లకు ఫీజులు ధారపోస్తున్నారు. ఇలాంటివారంతా ఇప్పుడు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే ఇంగ్లిష్ మీడియం చదివించేందుకు పంపించబోతున్నారు. ఈ నిర్ణయంతో ఈ ఏడాది కొత్తగా మరో 5లక్షల న్యూ అడ్మిషన్స్ ప్రభుత్వ స్కూళ్లకు వచ్చే అవకాశముందని అంచనా.

గతేడాది 2.5లక్షల మంది కొత్తగా ప్రభుత్వ స్కూళ్లవైపు మొగ్గు చూపగా.. ఈ ఏడాది కేవలం ఇంగ్లిష్ మీడియం వల్లే రెట్టింపు సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు రాబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే.. వచ్చే ఏడాదికల్లా ప్రైవేట్ స్కూళ్ల హవా తగ్గడం గ్యారెంటీ. జగన్ ప్రవేశ పెట్టిన దాదాపు అన్ని పథకాలూ విమర్శలతో మొదలై.. విజయాలనందుకున్నాయి.

ఇప్పటి వరకూ ప్రైవేట్ స్కూళ్లకు ముకుతాడు వేయాలని ఎంతోమంది మహామహులు ప్రయత్నించి విఫలమయ్యారు. జగన్ ప్రైవేట్ పై వేటు వేయకుండానే.. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యతా ప్రమాణాలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచారు. రాష్ట్ర విద్యావ్యవస్థనే సంపూర్ణంగా ప్రక్షాళణ చేయబోతున్నారు. విద్యార్థులతో కిక్కిరిసిన ప్రభుత్వ స్కూళ్లను మనందరం చూసే రోజు ఎంతో దూరంలో లేదు.

కేటీఆర్ చాలా నిజాయితీ పరుడు

రెండేళ్లు కాదు బాలయ్యా.. తర్వాత ఐదేళ్లూ ఆ పైన ఐదేళ్లూ జగనే సీఎం